World Cup 2027 : రోహిత్, విరాట్ లేకుంటే 2027 ప్రపంచ కప్ గెలవలేం..మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్
భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తు గురించి గత కొంతకాలంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్‌లలో వీరిద్దరూ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ విమర్శకుల నోళ్లు మూయిస్తున్నారు. రోహిత్ ఆస్ట్రేలియా సిరీస్‌లో సెంచరీ చేయగా, తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు.

World Cup 2027 : భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తు గురించి గత కొంతకాలంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్‌లలో వీరిద్దరూ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ విమర్శకుల నోళ్లు మూయిస్తున్నారు. రోహిత్ ఆస్ట్రేలియా సిరీస్‌లో సెంచరీ చేయగా, తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. ఈ ప్రదర్శనల నేపథ్యం మాజీ భారత ఓపెనర్, దిగ్గజ ఆటగాడు క్రిస్ శ్రీకాంత్ ఒక సంచలన ప్రకటన చేశారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా భారత్ 2027 వన్డే ప్రపంచ కప్‌ను గెలవలేదు అని ఆయన బలంగా చెప్పారు.
క్రిస్ శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా మాట్లాడుతూ.. రోహిత్, విరాట్ ప్రస్తుత ఆటతీరుపై ప్రశంసలు కురిపించారు. “విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వేరే లెవల్లో ఆడుతున్నారు. ఈ ఇద్దరు దిగ్గజాలు లేకుండా 2027 ప్రపంచ కప్ ప్రణాళికలు ఏవీ విజయవంతం కావు. టీమ్‌లో ఒక చివర రోహిత్, మరో చివర విరాట్ ఉండటం చాలా అవసరం” అని శ్రీకాంత్ అన్నారు. వారిద్దరి స్థానం గురించి ఎవరూ ఎలాంటి ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. సౌతాఫ్రికాతో జరిగిన రాంచీ వన్డేలో వీరిద్దరి భాగస్వామ్యం ప్రత్యర్థి జట్టుపై చూపిన ప్రభావం గురించి శ్రీకాంత్ వివరించారు.
“ఒకవేళ రోహిత్, కోహ్లీ కేవలం 20 ఓవర్ల వరకు క్రీజ్‌లో ఉంటే, ప్రత్యర్థి జట్టు అప్పటికే మ్యాచ్‌లో ఓడిపోయినట్లే. సౌతాఫ్రికా విషయంలో అదే జరిగింది. వారిద్దరి బ్యాటింగ్‌తో ప్రత్యర్థులు మానసికంగా పూర్తిగా దెబ్బతిన్నారు” అని శ్రీకాంత్ విశ్లేషించారు. కేవలం ఒకే ఫార్మాట్‌లో ఆడుతున్నప్పటికీ రోహిత్, విరాట్‌ల నిబద్ధత, ఫిట్‌నెస్ గురించి శ్రీకాంత్ మాట్లాడారు.
“వారు చాలా కష్టపడుతున్నారు. కేవలం ఒకే ఫార్మాట్ ఆడుతూ కూడా ఆ స్థాయి మానసిక దృక్పథాన్ని కొనసాగించడం అంత సులభం కాదు. వారి అంకితభావం గొప్పది” అని శ్రీకాంత్ మెచ్చుకున్నారు. క్రిస్ శ్రీకాంత్ అభిప్రాయం ప్రకారం.. రోహిత్, విరాట్ కోహ్లీ వారి ప్రదర్శన, ఫిట్‌నెస్‌తో 2027 ప్రపంచ కప్‌కు తమ స్థానాలను పక్కా చేసుకున్నారు. “మేము వారిద్దరి లేకుండా ప్రపంచ కప్‌ను గెలవలేము” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




