AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohammed Shami : గతేడాది చుక్కలు చూపించిన చోటే.. ఈసారి నిప్పులు చెరిగాడు.. హైదరాబాద్‌లోనే పగ తీర్చుకున్న షమీ

Mohammed Shami : మొహమ్మద్ షమీ హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ పై అద్భుత ప్రదర్శన చేశాడు. గతేడాది ఇదే వేదికపై అత్యధిక పరుగులు ఇచ్చిన షమీ, ఇప్పుడు ఐపీఎల్ కెరీర్ బెస్ట్ గణాంకాలతో పగ తీర్చుకున్నాడు. ఆ చేదు జ్ఞాపకాన్ని చెరిపేస్తూ తన ఐపీఎల్ కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టాడు.

Mohammed Shami : గతేడాది చుక్కలు చూపించిన చోటే.. ఈసారి నిప్పులు చెరిగాడు.. హైదరాబాద్‌లోనే పగ తీర్చుకున్న షమీ
Mohammed Shami
Rakesh
|

Updated on: Apr 06, 2026 | 1:09 PM

Share

Mohammed Shami : టీమిండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తరపున ఆడుతున్న షమీ, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డాడు. సరిగ్గా ఏడాది క్రితం ఇదే హైదరాబాద్ గడ్డపై తన కెరీర్‌లోనే అత్యంత దారుణమైన రికార్డును మూటగట్టుకున్న షమీ, సరిగ్గా 357 రోజుల తర్వాత అదే మైదానంలో పగ తీర్చుకున్నాడు. ఆ చేదు జ్ఞాపకాన్ని చెరిపేస్తూ తన ఐపీఎల్ కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టాడు. సరిగ్గా 357 రోజుల క్రితం, అంటే ఏప్రిల్ 12, 2025న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మొహమ్మద్ షమీకి ఒక పీడకల లాంటి రోజు ఎదురైంది. అప్పట్లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన షమీని సన్‌రైజర్స్ బ్యాటర్లు ఊచకోత కోశారు. ఆ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన షమీ ఏకంగా 75 పరుగులు సమర్పించుకున్నాడు. అతని ఎకానమీ రేటు 18.75గా నమోదైంది. ఐపీఎల్ చరిత్రలో షమీకి ఇదే అత్యంత పేలవమైన బౌలింగ్ గణాంకాలు. ఆ ఘోర పరాభవం షమీ మనసులో ఒక భారంగా మిగిలిపోయింది.

లక్నో జెర్సీలో షమీ అద్భుతం

కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోకి వచ్చిన షమీ, మళ్ళీ అదే హైదరాబాద్ గడ్డపై అడుగుపెట్టాడు. ఈసారి తన పాత పగను మనసులో పెట్టుకుని బంతిని సంధించాడు. సన్‌రైజర్స్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతూ కేవలం 4 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ స్పెల్‌లో షమీ ఎకానమీ రేటు కేవలం 2.25 మాత్రమే కావడం విశేషం. ఇది అతని ఐపీఎల్ కెరీర్‌లోనే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన.

357 రోజుల నిరీక్షణకు తెర

గత సీజన్‌లో ఎక్కడైతే పరువు పోయిందో, అక్కడే మళ్ళీ తన సత్తా చాటి ప్రపంచ స్థాయి బౌలర్ అని నిరూపించుకున్నాడు షమీ. కేవలం 357 రోజుల వ్యవధిలో అత్యంత చెత్త రికార్డు నుంచి అత్యుత్తమ రికార్డు వరకు షమీ ప్రయాణం అద్భుతం. అతని స్వింగ్ బౌలింగ్‌కు హైదరాబాద్ బ్యాటర్ల దగ్గర సమాధానమే లేకపోయింది. షమీ ధాటికి సన్‌రైజర్స్ తక్కువ స్కోరుకే పరిమితం కావడంతో లక్నో సులభంగా విజయం సాధించింది.

టీమిండియాకు బలమైన సందేశం

గాయం కారణంగా కొంతకాలం జట్టుకు దూరమైన షమీ, దేశీవాళీ క్రికెట్‌లో రెడ్ బాల్‌తో సత్తా చాటాడు. ఇప్పుడు ఐపీఎల్‌లో వైట్ బాల్‌తో కూడా తానేంటో నిరూపించుకున్నాడు. ఈ అద్భుత ప్రదర్శనతో టీమ్ ఇండియా సెలక్టర్లకు గట్టి సంకేతాలు పంపాడు. డెత్ ఓవర్లలోనే కాకుండా పవర్ ప్లేలో కూడా వికెట్లు తీయగలనని మరోసారి నిరూపించాడు. షమీ ఫామ్ చూసి లక్నో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us