AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్‌ వేలంలో ఛీ కొట్టారు.. కట్ చేస్తే.. 9 ఫోర్లు, 9 సిక్సర్లతో విధ్వంసం.. రికార్డు సెంచరీతో దిమ్మతిరిగే షాక్

Shai Hope Century: దక్షిణాఫ్రికా టీ20 లీగ్ (SA20)లో పరుగుల విధ్వంసం నమోదైంది. వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ షై హోప్ తన బ్యాట్‌తో విరుచుకుపడి లీగ్ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ వేలంలో ఎవరూ కొనుగోలు చేయని కసిని తీర్చుకుంటూ, కేవలం బౌండరీల రూపంలోనే 90 పరుగులు సాధించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.

ఐపీఎల్‌ వేలంలో ఛీ కొట్టారు.. కట్ చేస్తే.. 9 ఫోర్లు, 9 సిక్సర్లతో విధ్వంసం.. రికార్డు సెంచరీతో దిమ్మతిరిగే షాక్
Shai Hope Century
Venkata Chari
|

Updated on: Jan 08, 2026 | 8:59 AM

Share

Shai Hope Century: SA20 లీగ్ 2025-26 సీజన్‌లో భాగంగా డర్బన్ సూపర్ జెయింట్స్‌తో జరిగిన 16వ మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ ఓపెనర్ షై హోప్ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో హోప్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

రికార్డుల వేట..

ఓపెనర్‌గా బరిలోకి దిగిన షై హోప్ 20 ఓవర్ల పాటు క్రీజులో ఉండి అజేయంగా 118 పరుగులు సాధించాడు. కేవలం 69 బంతుల్లోనే 9 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో ఈ మార్కును అందుకున్నాడు. అంటే తన మొత్తం స్కోరులో 90 పరుగులు కేవలం బౌండరీల (ఫోర్లు, సిక్సర్లు) ద్వారానే రావడం విశేషం. ఈ అద్భుత ఇన్నింగ్స్ వల్ల ప్రిటోరియా క్యాపిటల్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఇవి కూడా చదవండి

SA20 చరిత్రలో అత్యధిక స్కోరు..

షై హోప్ తన 118 పరుగుల ఇన్నింగ్స్‌తో SA20 చరిత్రలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు కైల్ వెరీన్ (116*) పేరిట ఉండేది. గతేడాది ఎంఐ కేప్‌టౌన్‌పై వెరీన్ చేసిన రికార్డును హోప్ 2 పరుగుల తేడాతో అధిగమించాడు.

200వ మ్యాచ్‌లో మైలురాయి..

షై హోప్ కెరీర్‌లో ఇది 200వ టీ20 మ్యాచ్ కావడం మరో విశేషం. ఈ మైలురాయి మ్యాచ్‌ను చిరస్మరణీయంగా మార్చుకుంటూ తన టీ20 కెరీర్‌లో 4వ సెంచరీని నమోదు చేశాడు. అంతేకాకుండా, టీ20ల్లో 400 ఫోర్ల మార్కును కూడా ఈ మ్యాచ్‌లోనే అధిగమించాడు. ఇప్పటివరకు 195 ఇన్నింగ్స్‌ల్లో 5,350 పరుగులు చేసిన హోప్ ఖాతాలో 27 అర్ధశతకాలు కూడా ఉన్నాయి.

ఐపీఎల్ లో పట్టించుకోని ఫ్రాంచైజీలు..

ఇంతటి ప్రతిభ ఉన్న షై హోప్‌ను ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ఏ జట్టు కూడా కొనుగోలు చేయలేదు. కనీస ధరకు కూడా ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో హోప్ అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. అయితే, SA20లో తాజా ఇన్నింగ్స్‌తో తనను తీసుకోని ఐపీఎల్ జట్లకు గట్టి సమాధానమే ఇచ్చాడని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఫామ్‌లోకి హోప్..

ఈ సీజన్ ఆరంభంలో హోప్ వరుసగా విఫలమయ్యాడు. మొదటి 5 మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 88 పరుగులు మాత్రమే చేశాడు. కానీ, జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో, అత్యంత కీలకమైన మ్యాచ్‌లో సెంచరీతో ఫామ్‌లోకి రావడం ప్రిటోరియా క్యాపిటల్స్‌కు పెద్ద ఊరటనిచ్చింది.

షై హోప్ ఆడిన ఈ సునామీ ఇన్నింగ్స్ ప్రిటోరియా జట్టుకు ఈ సీజన్‌లో కొత్త ఆశలను చిగురింపజేసింది. కేవలం క్లాస్ ప్లేయర్ అని మాత్రమే పేరున్న హోప్, టీ20ల్లో ఎంతటి విధ్వంసం సృష్టించగలడో ఈ మ్యాచ్ ద్వారా మరోసారి నిరూపించాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.