Video: కోహ్లీతో గేమ్స్.. స్లెడ్జింగ్‌తో రెచ్చిపోయిన ఛేజింగ్ మాస్టర్.. హిట్ వికేట్ ప్లేయర్‌కు ఇచ్చిపడేశాడుగా..
క్రికెట్‌లో స్లెడ్జింగ్ అనేది కొత్తేమీ కాదు, కానీ ఒక సీనియర్ దిగ్గజ ఆటగాడికి, యువ ఆటగాడు మైదానంలోనే అలా ధీటుగా సమాధానం ఇవ్వడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. కోహ్లీ ఆట ఎంత దూకుడుగా సాగిందో, సాయి సుదర్శన్ చూపించిన పంతం కూడా అంతే ఆసక్తికరంగా సాగింది.

ఐపీఎల్ 2026 మహాసంగ్రామ ఫినాలే ఉత్కంఠ రేపుతుంటే, మైదానంలో ఆటతో పాటు ఆటగాళ్ల మధ్య నడిచిన మైండ్ గేమ్ అభిమానులకు అసలైన వినోదాన్ని పంచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం వైపు దూసుకుపోతున్న వేళ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని గుజరాత్ టైటాన్స్ యువ ఆటగాడు సాయి సుదర్శన్ స్లెడ్జింగ్ చేసిన తీరు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో దావానలంలా వైరల్ అవుతోంది.
ముందు కోహ్లీ మైండ్ గేమ్.. ఒత్తిడిలో వికెట్ పారేసుకున్న సుదర్శన్!
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ తుది పోరులో గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వికెట్‌ను కోల్పోయింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్‌ను విరాట్ కోహ్లీ తన మాటలతో తీవ్ర ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేశాడు. ప్రతి బంతి తర్వాత సుదర్శన్ దగ్గరకు వెళ్తూ, ‘తొలి వికెట్ పడటంతో నువ్వు భయపడుతున్నావు, ఓపెనర్‌గా నీపై చాలా ఒత్తిడి ఉంది’ అంటూ కోహ్లీ అన్న మాటలు స్టంప్ మైక్‌లో స్పష్టంగా రికార్డయ్యాయి.
కోహ్లీ చేసిన ఈ మానసిక దాడి సాయి సుదర్శన్‌పై గట్టి ప్రభావమే చూపించింది. నాలుగో ఓవర్ నాలుగో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి టైమింగ్ కుదరక కేవలం సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు. దీంతో గుజరాత్ జట్టుకు భారీ నష్టం వాటిల్లింది. వాస్తవానికి లీగ్ దశతో పాటు ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల్లోనూ కోహ్లీ ఇదే తరహాలో శుభ్‌మన్ గిల్‌ను ఏడిపిస్తూ ఏకాగ్రత దెబ్బతీసే ప్రయత్నం చేశాడు.
దెబ్బకు దెబ్బ.. కోహ్లీపై సాయి సుదర్శన్ ప్రతీకారం!
— crictalk (@crictalk7) May 31, 2026
ఇక లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ మైదానంలో ఊచకోత కోస్తూ 237.50 స్ట్రైక్ రేట్‌తో పరుగులు వరద పారించాడు. ఎనిమిదో ఓవర్ ముగిసిన తర్వాత కోహ్లీ నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో నిలబడగా, ఫీల్డింగ్ చేస్తున్న సాయి సుదర్శన్ నెమ్మదిగా అతని వైపు నడిచాడు. గతంలో కోహ్లీ తనకు చేసిన దానికి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో, కోహ్లీ కళ్లలోకి చూస్తూ ఏదో గట్టిగానే చెప్పాడు.
సాయి సుదర్శన్ చేసిన చేతి సంజ్ఞలను బట్టి చూస్తే, ‘నువ్వు త్వరలోనే అవుట్ కాబోతున్నావు’ అని హెచ్చరించినట్లు అర్థమవుతోంది. అయితే, సుదర్శన్ చేసిన ఈ పని కోహ్లీకి అస్సలు నచ్చలేదు. కోహ్లీ ఆ మాటలను పట్టించుకోనట్లు నటిస్తూ, అసంతృప్తిగా ముఖం తిప్పుకుని అక్కడి నుంచి పక్కకు జరిగాడు. ఈ ఇద్దరి మధ్య వివాదం పెద్దది కాకపోయినప్పటికీ, మైదానంలో జరిగిన ఈ ‘దెబ్బకు దెబ్బ’ ఉదంతం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
గుజరాత్ ఘోర వైఫల్యం.. విజృంభించిన బెంగళూరు బౌలర్లు..
ఈ ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ విభాగం ఘోరంగా విఫలమైంది. స్టార్ బ్యాటర్లు జోస్ బట్లర్, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ ముగ్గురూ దారుణంగా నిరాశపరిచారు. కేవలం వాషింగ్టన్ సుందర్ మాత్రమే 37 బంతుల్లో 50 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. దీంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 155 పరుగులకే పరిమితమైంది.
బెంగళూరు బౌలర్లలో రసిఖ్ సలామ్ అద్భుతమైన ప్రదర్శనతో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అతనికి తోడుగా జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ చెరో రెండు వికెట్లతో రాణించి గుజరాత్ పతనాన్ని శాసించారు. ఈ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో బెంగళూరు జట్టు టైటిల్ వైపు సునాయాసంగా అడుగులు వేసింది.
క్రికెట్‌లో స్లెడ్జింగ్ అనేది కొత్తేమీ కాదు, కానీ ఒక సీనియర్ దిగ్గజ ఆటగాడికి, యువ ఆటగాడు మైదానంలోనే అలా ధీటుగా సమాధానం ఇవ్వడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. కోహ్లీ ఆట ఎంత దూకుడుగా సాగిందో, సాయి సుదర్శన్ చూపించిన పంతం కూడా అంతే ఆసక్తికరంగా సాగింది. ఆటలో ఇటువంటి సరదా, గంభీర క్షణాలే ఐపీఎల్ ఫైనల్‌ను మరింత ప్రత్యేకంగా మారుస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
