Video: 52 ఏళ్ల వయసులో కూడా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ మాస్ షాట్లు! చూస్తే గూస్‌బమ్స్ గ్యారెంటీ
52 ఏళ్ల వయసులోనూ సచిన్ టెండూల్కర్ తన అద్భుతమైన క్రికెట్ ప్రతిభను ప్రదర్శించాడు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20లో ఇంగ్లాండ్ మాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్ లో వరుసగా బౌండరీలు కొట్టి అభిమానులను అలరించాడు. అతని షాట్ల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మ్యాచ్ లో సచిన్ 21 బంతుల్లో 34 పరుగులు చేశాడు.

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ గురించి బహుషా ఈ ఆల్ఫా జెనరరేషన్ కిడ్స్ తెలియకపోవచ్చు. ఇప్పుడంతా కోహ్లీ, రోహిత్, ధోని ఫ్యాన్స్ హవానే నడుస్తోంది. కానీ, ఒకప్పుడు ఇండియా అంటే సచిన్, సచిన్ అంటే ఇండియా అనేలా ఉండేది పరిస్థితి. ఒక్క క్రికెటర్ ఆట చూసేందుకు యావత్ ప్రపంచం ఎదురుచూసేది. అలాంటి ఆటగాడు సచిన్. టన్నుల కొద్ది పరుగులు, వంద సెంచరీలు, లెక్కలేనన్ని రికార్డులు.. క్రికెట్‌ను మతంలా భావించే ఇండియాలో సచిన్ ఆ మతానికి దేవుడు. ఒక్క సచిన్‌ను అవుట్ చేస్తే చాలు ఇండియాపై మ్యాచ్ గెలిచినట్లే అని భావించేవి ప్రత్యర్థి జట్లు. అలా ఉండేది సచిన్ డామినేషన్.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి సచిన్ రిటైర్ అయినప్పుడు కన్నీళ్లు పెట్టుకొని క్రికెట్ అభిమాని లేడు. అయ్యో ఇకపై సచిన్ ఆటను మనం చూడలేమా అంటూ రంది పెట్టుకున్న వాళ్లు ఎందరో. అయితే అలాంటి వారి కోసమో ఏమో కానీ, లెజెండ్స్ లీగ్, మాస్టర్ లీగ్ అంటూ.. సచిన్ ఆటను మరోసారి చూసే అవకాశం కలుగుతోంది. తాజాగా ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20లో సచిన్ టెండూల్కర్ ఇండియా మాస్టర్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మంగళవారం రాత్రి నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో ఇంగ్లండ్ మాస్టర్స్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ సూపర్ షాట్లతో అలరించాడు. వరుసగా 6, 4, 4 కొట్టి తన అభిమానులకు కనుల విందు అందించాడు. 52 ఏళ్ల వయసులో సచిన్ ఇలాంటి షాట్లు ఆడుతున్నాడు అంటే.. అతని యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు ఎలాంటి విధ్వంసం సృష్టించి ఉంటాడో ఈజీగా అర్థం చేసుకోవచ్చు.
సచిన్ కొట్టిన ఆ షాట్లకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డీప్ స్క్వౌర్ లెగ్ పై నుంచి ఒక సిక్స్, డీప్ మిడ్ వికెట్ దిశగా పుల్ షాట్‌తో బౌండరీ, ముందుకొచ్చి కవర్స్‌లోకి ఒక బౌండరీ.. అబ్బా సచిన్ ఆ షాట్లు కొడుతుంటే.. ఆ షాట్లకు అందం వచ్చినట్లు ఉంది. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 21 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 34 పరుగులు చేశాడు సచిన్. అతనితో పాటు గుర్‌క్రీత్ సింగ్ 63, యువరాజ్ సింగ్ 27 పరుగులు చేయడంతో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఇండియా మాస్టర్స్ 133 పరుగుల టార్గెట్‌ను 11.4 ఓవర్లలోనే ఛేదించింది. అంతకంటే ముందు బ్యాటింగ్‌చేసిన ఇంగ్లండ్ మాస్టర్స్ టీమ్ 20 ఓవర్లలో వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది.
SACHIN TENDULKAR – AT THE AGE OF ALMOST 52. 🤯pic.twitter.com/dMo0NVYDaF
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 25, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




