IND vs SL: అభిమానులకు బిగ్ షాక్.. అక్కడ రోహిత్, కోహ్లీ ఆటను చూసే ఛాన్స్ లేనట్టే.. ఎందుకంటే..?
IND vs SL 1st ODI: డిసెంబర్‌లో శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌కు ముందు భారత క్రికెట్ అభిమానులకు నిరాశ కలిగించే వార్త వినిపిస్తోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగాల్సిన తొలి వన్డే వేదిక మారే అవకాశం ఉందని సమాచారం. స్టేడియంలో జరుగుతున్న రెనోవేషన్ పనులు సకాలంలో పూర్తికాకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. దీంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఢిల్లీలో చూసే అవకాశం మిస్ అయ్యేలా ఉంది.

IND vs SL 1st ODI: భారత్, శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ డిసెంబర్‌లో జరగనుంది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. కానీ తొలి వన్డే మొదట అనుకున్న ఢిల్లీ వేదికగా జరగకపోవచ్చని తెలుస్తోంది.
తొలి వన్డే వేదికపై సందిగ్ధత..
షెడ్యూల్ ప్రకారం భారత్, శ్రీలంక తొలి వన్డే డిసెంబర్ 13న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగాలి. కానీ అక్కడ జరుగుతున్న రెనోవేషన్ పనులు సమయానికి పూర్తవుతాయా అనే సందేహాలు నెలకొన్నాయి. ది హిందూ (The Hindu) కథనం ప్రకారం, స్టేడియం ఔట్‌ఫీల్డ్ రెనోవేషన్ డిసెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం లేదు. ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వడానికి దాదాపు నాలుగు నెలలు పట్టవచ్చని ఓ వర్గం తెలిపింది.
ఈ పనుల్లో భాగంగా డ్రైనేజీ సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఔట్‌ఫీల్డ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ముల్లన్‌పూర్, లక్నో వంటి వేదికల్లో ఇప్పటికే సాండ్ బేస్డ్ ఔట్‌ఫీల్డ్‌లను అమలు చేశారు. వీటివల్ల నీరు త్వరగా ఇంకిపోతుంది. ఈ పనులు పూర్తయితే వర్షం పడినప్పుడు మైదానాన్ని ఎక్కువగా కవర్ చేయాల్సిన అవసరం తగ్గుతుందని, అలాగే పిచ్ ఉపరితలంపై అసమానతలు ఏర్పడే అవకాశాలూ తగ్గుతాయని భావిస్తున్నారు.
రంజీ మ్యాచ్‌లు కూడా షిఫ్ట్..
ఈ నిర్మాణ పనుల ప్రభావం ఇప్పటికే ఢిల్లీ దేశవాళీ క్రికెట్‌పై పడింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగాల్సిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లను పాలంలోని ఎయిర్ ఫోర్స్ కాంప్లెక్స్ గ్రౌండ్‌కు మార్చారు.
రంజీ ట్రోఫీ రెండో దశలో ఢిల్లీ.. మహారాష్ట్రతో తలపడనుంది. ఆ సమయానికి ప్రధాన స్టేడియం సిద్ధమయ్యే అవకాశం ఉంది.
మరోవైపు, భారత్-శ్రీలంక తొలి వన్డేను ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు మార్చనున్నారన్న వార్తలను గత నెలలో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఖండించారు. వేదికపై బోర్డు ఇంకా తుది నిర్ణయం ప్రకటించలేదు. రాబోయే రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు నిరాశే..!
మ్యాచ్ ఢిల్లీ నుంచి తరలిపోతే స్థానిక అభిమానులకు ఇది పెద్ద నిరాశే. విరాట్ కోహ్లీకి ఢిల్లీ సొంత గడ్డ. రోహిత్ శర్మకు కూడా రాజధానిలో భారీ అభిమాన గణం ఉంది.
అక్టోబర్ 2023 తర్వాత ఢిల్లీలో భారత్ ఆడబోయే తొలి వన్డే ఇదే అవుతుందని అనుకున్నారు. ఈ ఇద్దరు సీనియర్ బ్యాటర్లు అరుణ్ జైట్లీ స్టేడియంలో మళ్లీ ఆడటాన్ని చూడాలని ఫ్యాన్స్ ఎదురుచూశారు. కానీ రెనోవేషన్ పనులు కొనసాగుతుండటంతో, ఢిల్లీలో రోహిత్, విరాట్ ఆడే వన్డేను చూడటానికి అభిమానులు మరికొంత కాలం వేచి చూడాల్సి రావచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




