AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆయన రంగంలోకి దిగితే, ఎంత టార్గెట్ పెట్టినా వేస్టే.. కళ్లముందే మ్యాచ్‌ రిజల్ట్ మార్చేశాడు

ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి చవిచూసింది. 228 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ విజయం దక్కకపోవడంపై కెప్టెన్ రిషబ్ పంత్ అసహనం వ్యక్తం చేశాడు. జట్టు ప్రదర్శన, లోపాలు మరియు ముంబై బ్యాటర్ల ఆధిపత్యం గురించి పంత్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆయన రంగంలోకి దిగితే, ఎంత టార్గెట్ పెట్టినా వేస్టే.. కళ్లముందే మ్యాచ్‌ రిజల్ట్ మార్చేశాడు
Lsg Rishabh Pant Commenst On Rohit Sharma
Venkata Chari
|

Updated on: May 05, 2026 | 3:25 PM

Share

ఐపీఎల్ 2026 సీజన్ 47వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైన రోహిత్ శర్మ, ఈ మ్యాచ్‌తో తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. రీఎంట్రీలోనే హాఫ్ సెంచరీతో మెరిసిన రోహిత్, తన అనుభవాన్ని రంగరించి ముంబైకి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. అతనికి తోడుగా రియాన్ రికల్టన్ కూడా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటంతో తొలి వికెట్‌కే 143 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదైంది. ఈ ఓపెనింగ్ జోడీ ధాటికి లక్నో విధించిన 229 పరుగుల లక్ష్యం ముంబైకి సులువుగా మారింది.

పూరన్, మార్ష్ మెరుపులు వృధా..

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఓపెనర్ మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. వీరిద్దరి బాదుడుతో పవర్ ప్లే ముగిసేసరికి లక్నో 90 పరుగులు రాబట్టింది. ముఖ్యంగా నికోలస్ పూరన్ కేవలం 21 బంతుల్లో 8 సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే, ఇంత భారీ స్కోరు చేసినప్పటికీ బౌలింగ్ లోపాలు లక్నోను దెబ్బతీశాయి.

ఓటమికి గల కారణాలను విశ్లేషించిన రిషబ్ పంత్..

మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ తన మనసులోని మాటను బయటపెట్టాడు. “మాకు అద్భుతమైన ఆరంభం లభించింది. పూరన్, మార్ష్ క్రీజులో ఉన్నప్పుడు మేం 250 పరుగులు దాటుతామని భావించాం. కానీ ఆ ఇద్దరి వికెట్లు పడ్డాక మిడిల్ ఆర్డర్‌లో పరుగులు రాబట్టడం కష్టమైంది. లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యం మా విజయ అవకాశాలను దెబ్బతీసింది. మరో 10 నుంచి 15 పరుగులు అదనంగా చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేది” అని పంత్ అభిప్రాయపడ్డాడు.

ముంబై బౌలర్లు, రోహిత్ శర్మపై ప్రశంసలు..

ముంబై బౌలర్ల వ్యూహాలను కూడా పంత్ కొనియాడాడు. వికెట్లు పడిన తర్వాత వారు అద్భుతంగా పుంజుకొని మమ్మల్ని కట్టడి చేశారని అన్నాడు. అలాగే రోహిత్ శర్మ బ్యాటింగ్ గురించి స్పందిస్తూ, “రోహిత్ భాయ్ తన అనుభవాన్ని మరో ఓపెనర్‌తో పంచుకోవడంతో మేం తొలి వికెట్ తీయడానికి చాలా కష్టపడ్డాం. పవర్ ప్లేలో ఒకటి రెండు వికెట్లు తీసి ఉంటే ఫలితం అనుకూలంగా వచ్చేది” అని పేర్కొన్నాడు.

అదృష్టం కలిసి రావడం లేదు: పంత్ ఆవేదన

లక్నో బౌలర్లను వెనకేసుకొచ్చిన పంత్, ప్రతిసారి వారిని నిందించలేమని చెప్పాడు. “ఈ ఓటమికి బౌలర్లనే నేను బాధ్యులను చేయను. ప్రస్తుతం మా జట్టుకు కొంచెం అదృష్టం కావాలి. నేను చెప్పగలిగింది ఇదే” అంటూ భావోద్వేగంగా ముగించాడు. ఈ ఓటమితో లక్నో ఆడిన 9 మ్యాచ్‌ల్లో 7 పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి, దాదాపుగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించినట్లయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us