
Chinnaswamy Stadium 11 Vacant Seats: ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. 2025 సీజన్‌లో ఆర్సీబీ కప్పు గెలిచిన ఆనందంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఊహించని విధంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ చేదు జ్ఞాపకం నుంచి కోలుకోని ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA) సంయుక్తంగా ఒక చారిత్రక నిర్ణయాన్ని ప్రకటించాయి.
మరణించిన ఆ 11 మంది అభిమానులకు నివాళిగా, చిన్నస్వామి స్టేడియంలోని ఒక స్టాండ్‌లో 11 సీట్లను శాశ్వతంగా రిజర్వ్ చేయాలని నిర్ణయించారు. ఈ సీట్లను ఎవరికీ విక్రయించరు. ప్రతి మ్యాచ్ సమయంలోనూ ఆ సీట్లు ఖాళీగా ఉండి, భౌతికంగా లేకపోయినా ఆ అభిమానులు జట్టును ప్రోత్సహిస్తూనే ఉంటారనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఐపీఎల్ మ్యాచ్‌లే కాకుండా, చిన్నస్వామి స్టేడియంలో జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌లకు కూడా ఈ నియమం వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.
ఈ నివాళిలో భాగంగా స్టేడియం ప్రవేశ ద్వారం వద్ద మరణించిన 11 మంది అభిమానుల పేర్లతో కూడిన ఒక స్మారక ఫలకాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్‌లో భాగంగా మార్చి 28న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆర్సీబీ తలపడనుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు స్మారక ఫలకాన్ని ఆవిష్కరించి, స్టేడియం అంతా ఒక నిమిషం పాటు మౌనం పాటించి నివాళులు అర్పించనున్నారు.
“గెలుపు ఆనందాన్ని పంచుకోవడానికి వచ్చి తిరిగి రాని లోకాలకు వెళ్ళిన ఈ అభిమానులు ఎప్పటికీ మా గుండెల్లోనే ఉంటారు” అని స్టేడియం నిర్వాహకులు భావోద్వేగంగా పేర్కొన్నారు. క్రీడల పట్ల అభిమానులకు ఉండే ప్రేమను గౌరవిస్తూ ఆర్సీబీ తీసుకున్న ఈ నిర్ణయం క్రీడా ప్రపంచంలో ఒక అరుదైన ఉదాహరణగా నిలిచిపోనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..