IPL 2026 : ఇందులో ఈగో ఎందుకు బాసూ?.. ఇషాన్ కిషన్ విజిల్ సెలబ్రేషన్‌పై చెన్నై ఫ్యాన్స్ ఫైర్

IPL 2026 : మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఇషాన్ కిషన్ చేసిన అతి ఉత్సాహపు సెలబ్రేషన్ సీఎస్‌కే ఫ్యాన్స్‌కు అస్సలు నచ్చలేదు. తమ హోమ్ గ్రౌండ్‌కు వచ్చి తమనే వెక్కిరిస్తాడా అంటూ సోషల్ మీడియా వేదికగా ఇషాన్ కిషన్‌పై ట్రోలింగ్ మొదలుపెట్టారు.

IPL 2026 : ఇందులో ఈగో ఎందుకు బాసూ?.. ఇషాన్ కిషన్ విజిల్ సెలబ్రేషన్‌పై చెన్నై ఫ్యాన్స్ ఫైర్
Ishan Kishan

Updated on: May 20, 2026 | 11:18 AM

IPL 2026 : ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఊహించని వివాదానికి దారితీసింది. చెన్నై హోమ్ గ్రౌండ్ అయిన చెపాక్ స్టేడియంలో సన్‌రైజర్స్ ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చేసిన ఒక సెలబ్రేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెను తుఫాను సృష్టించింది. సీఎస్‌కే కు అత్యంత ప్రతిష్టాత్మకమైన విజిల్ పోడు స్టైల్‌ను ఇమిటేట్ చేస్తూ.. ఇషాన్ కిషన్ చెన్నై ప్రేక్షకుల వైపు తిరిగి ఈలలు వేస్తూ యానిమేటెడ్ హావభావాలు ప్రదర్శించాడు. దీనిపై చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. టీమిండియా సీనియర్ స్పిన్నర్, మాజీ సీఎస్‌కే ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ వివాదంపై స్పందిస్తూ ఇషాన్ కిషన్‌కు మద్దతుగా నిలిచారు.

ఈ వివాదానికి గల అసలు నేపథ్యాన్ని గమనిస్తే.. సోమవారం రాత్రి జరిగిన కీలక పోరులో చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఓవర్ మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో ఊదేసింది. ఎస్‌ఆర్‌హెచ్ విజయంలో ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. చెన్నై బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ కేవలం 47 బంతుల్లోనే 70 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ అద్భుత విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసులోకి అధికారికంగా దూసుకెళ్లింది. అయితే మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఇషాన్ కిషన్ చేసిన అతి ఉత్సాహపు సెలబ్రేషన్ సీఎస్‌కే ఫ్యాన్స్‌కు అస్సలు నచ్చలేదు. తమ హోమ్ గ్రౌండ్‌కు వచ్చి తమనే వెక్కిరిస్తాడా అంటూ సోషల్ మీడియా వేదికగా ఇషాన్ కిషన్‌పై ట్రోలింగ్ మొదలుపెట్టారు.

ఈ వివాదం నెట్టింట ముదురుతున్న తరుణంలో రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్పందించారు. ఇషాన్ కిషన్‌ను సపోర్ట్ చేస్తూ అభిమానులకు స్పోర్ట్స్ మ్యాన్‌షిప్ గురించి వివరించారు. “సోషల్ మీడియాలో ఇషాన్ కిషన్ సెలబ్రేషన్ గురించి చాలా చర్చ నడుస్తోంది. ప్లీజ్.. దాన్ని అంతటితో వదిలేయండి యార్! మైదానంలో ఆటగాళ్లు ఎమోషన్స్ ప్రదర్శించడం సహజం, దాన్ని వ్యక్తిగతంగా తీసుకోకండి, ఆటను ఆస్వాదించండి” అని అశ్విన్ కోరారు. అలాగే ఇక్కడ ఆడే ప్రతి ఆటగాడు రేపు టీమిండియా తరఫున ఆడేవాడేనని, ఒక ప్లేయర్ వచ్చి మీ ముందు సెలబ్రేట్ చేసుకుంటే అందులోకి ఈగో ఎందుకు తీసుకువస్తారని చెన్నై అభిమానులను నిలదీశారు. ఇలాంటి డ్రామా, ఎమోషన్స్ లేకపోతే క్రికెట్‌లో మజా ఎక్కడుంటుందని ప్రశ్నించారు.

అశ్విన్ మాట్లాడుతూ చెన్నై ఫ్యాన్స్‌కు, జట్టుకు ఒక సూపర్ ఐడియా ఇచ్చారు. “మరో టీమ్ వచ్చి హోమ్ గ్రౌండ్‌లో చెన్నై లాంటి బలమైన జట్టును ఓడించడం అంత సులువు కాదు. కానీ సన్‌రైజర్స్ ఆ పని చేసి చూపించింది. గత మ్యాచ్‌లో ఘోర పరాజయం తర్వాత వారు పుంజుకున్న తీరు అద్భుతం. ఒక క్రీడాకారుడు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఓడించానని చెబుతున్నాడు, అంతే! దీన్ని ఫ్యాన్స్ మనసులో పెట్టుకోండి. వచ్చే సీజన్ లో మన చెన్నై జట్టు హైదరాబాద్ హోమ్ గ్రౌండ్‌ ఉప్పల్‌కు వెళ్లి వాళ్లను దెబ్బకొట్టాలి. అప్పుడు ఇదే తరహాలో సెలబ్రేట్ చేసుకుని తిప్పికొట్టాలి.. కానీ అదంతా చాలా గౌరవప్రదమైన పద్ధతిలో జరగాలి” అని అశ్విన్ సూచించారు.

అయితే ఇషాన్ కిషన్ ప్రవర్తనను పూర్తిగా సమర్థించకుండా.. ఆయనకు కూడా అశ్విన్ ఒక చిన్న సలహా ఇచ్చారు. “ఈ మ్యాచ్‌ను నేను బాగా ఎంజాయ్ చేశాను. కానీ ఇషాన్ కిషన్ ప్రేక్షకులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, సెలబ్రేషన్స్ కాస్త కంట్రోల్‌లో ఉంచుకుంటే బాగుండేది. ఆ కామెంట్స్ రికార్డ్ కాకుండా అవాయిడ్ చేసి ఉంటే బాగుండేది. కానీ అంతిమంగా ఇదొక ఆట మాత్రమే” అని అశ్విన్ ముగించారు. మొత్తానికి అశ్విన్ చేసిన ఈ ఈగో వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో సరికొత్త చర్చకు దారితీశాయి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us