AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND W vs ENG W : క్రికెట్ మక్కాలో భారతీయుల హవా.. యస్తికా భాటియా రికార్డ్ సెంచరీ, 5 వికెట్లతో క్రాంతి గౌడ్ విధ్వంసం

IND W vs ENG W : లార్డ్స్ టెస్టులో యస్తికా భాటియా చారిత్రాత్మక సెంచరీ, క్రాంతి గౌడ్ రికార్డు 5 వికెట్లతో భారత్ మహిళల జట్టు ఇంగ్లండ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యంతో విజయానికి చేరువైంది.

IND W vs ENG W : క్రికెట్ మక్కాలో భారతీయుల హవా.. యస్తికా భాటియా రికార్డ్ సెంచరీ, 5 వికెట్లతో క్రాంతి గౌడ్ విధ్వంసం
Ind W Vs Eng W
Rakesh
|

Updated on: Jul 12, 2026 | 6:42 PM

Share

IND W vs ENG W : లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక ప్రతిష్టాత్మక టెస్ట్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు చారిత్రాత్మక ప్రదర్శనతో అదరగొడుతోంది. మ్యాచ్‌లో మూడో రోజైన ఆదివారం నాటి ఆటలో భారత బ్యాటర్ యస్తికా భాటియా అద్భుత సెంచరీతో చెలరేగారు. లార్డ్స్ మైదానంలో మహిళల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే తొలి సెంచరీ బాదిన ప్లేయర్‌గా ఆమె సరికొత్త రికార్డు సృష్టించారు. లార్డ్స్ మైదానంలో టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన మరో ఏకైక భారతీయ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ (పురుషుల లేదా మహిళల క్రికెట్‌లో) సౌరవ్ గంగూలీ మాత్రమే. ఆయన 1996లో తన అరంగేట్రం (డెబ్యూ) మ్యాచ్‌లోనే 131 పరుగులు చేసి ఈ ఘనత సాధించారు.  ఈ అమోఘమైన ఇన్నింగ్స్ ద్వారా లార్డ్స్ మైదానంలోని ప్రతిష్టాత్మక ఆనర్స్ బోర్డ్ పై యస్తికా భాటియా తన పేరును లిఖించుకున్నారు. ఆమె అద్భుత సెంచరీతో భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 264/5 పరుగుల భారీ స్కోరు చేసి మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది.

మరోసారి సెంచరీ చేజార్చుకున్న స్మృతి మంధాన

భారత జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ల నుంచి ఆశించిన ఆరంభాన్ని అందుకుంది. స్మృతి మంధాన, షెఫాలీ వర్మ మొదటి వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. షెఫాలీ వర్మ 33 పరుగులు చేసి సోఫీ ఎక్లెస్టోన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన యస్తికా భాటియాతో కలిసి స్మృతి మంధాన ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. మొదటి ఇన్నింగ్స్‌లో లాగే మంధాన రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నారు. ఆమె 70 పరుగులు చేసి పవిలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన జెమిమా రోడ్రిగ్స్ (3), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (16), దీప్తి శర్మ (10) తక్కువ పరుగులకే అవుట్ అయినా, యస్తికా మాత్రం నిలకడగా ఆడి జట్టుకు కొండంత ఆధిక్యాన్ని అందించారు. ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్‌పై 379 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది.

మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ ఆధిపత్యం

జులై 10వ తేదీ శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఓపెనర్ స్మృతి మంధాన 83 పరుగులు, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 58 పరుగులతో హాఫ్ సెంచరీలతో రాణించారు. వీరితో పాటు ఆల్‌రౌండర్ దీప్తి శర్మ కూడా 57 పరుగులతో కీలకమైన హాఫ్ సెంచరీ సాధించారు. జెమిమా రోడ్రిగ్స్ 35 పరుగులు చేయగా, షెఫాలీ వర్మ మాత్రం డకౌట్‌గా వెనుతిరిగారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ 3 వికెట్లు పడగొట్టగా, లారెన్ ఫిలర్, ఇస్సీ వాంగ్, మాడీ విలియర్స్ చెరో రెండు వికెట్లు తీశారు.

ఐదు వికెట్లతో ఇంగ్లండ్‌ను కుప్పకూల్చిన క్రాంతి గౌడ్

భారత్ చేసిన 285 పరుగులకు సమాధానంగా మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ మహిళల జట్టు భారత బౌలర్ల ధాటికి కేవలం 170 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ జట్టులో వికెట్ కీపర్ అమీ జోన్స్ (52), కెప్టెన్ నాట్ సివర్ బ్రంట్ (44) మాత్రమే కొంతవరకు పోరాడారు. భారత యువ బౌలర్ క్రాంతి గౌడ్ లార్డ్స్ పిచ్‌పై అద్భుతమైన స్పెల్‌తో ఇంగ్లండ్ బ్యాటర్ల నడుం విరిచారు. ఆమె 17 ఓవర్లలో కేవలం 37 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టారు. లార్డ్స్ మైదానంలో 5 వికెట్ల హాల్ చేసిన ప్రపంచంలోనే తొలి మహిళా క్రికెటర్‌గా క్రాంతి గౌడ్ చరిత్ర పుటల్లోకి ఎక్కారు. మిగిలిన బౌలర్లలో సయాలీ సత్ఘరే, స్నేహ రాణా చెరో రెండు వికెట్లు తీయడంతో భారత్‌కు మొదటి ఇన్నింగ్స్‌లో 115 పరుగుల కీలక ఆధిక్యం లభించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us