Ravichandran Ashwin : ఆశగా పోతే అక్కడ కూడా ఆరంగేట్రానికి బ్రేక్.. గాయం కారణంగా ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ క్రికెటర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. ఆస్ట్రేలియాలో జరగబోయే బిగ్ బాష్ లీగ్‌లో ఆడటానికి సిద్ధమైన భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బీబీఎల్ తదుపరి సీజన్‌లో సిడ్నీ థండర్ తరఫున ఆడడం దాదాపు ఖాయమైనప్పటికీ, గాయం కారణంగా ఆయన ఈ లీగ్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు.

Ravichandran Ashwin : ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. ఆస్ట్రేలియాలో జరగబోయే బిగ్ బాష్ లీగ్‌లో ఆడటానికి సిద్ధమైన భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బీబీఎల్ తదుపరి సీజన్‌లో సిడ్నీ థండర్ తరఫున ఆడడం దాదాపు ఖాయమైనప్పటికీ, గాయం కారణంగా ఆయన ఈ లీగ్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. అశ్విన్ గనుక ఆడి ఉంటే, బీబీఎల్లో ఆడిన మొట్టమొదటి భారత పురుష క్రికెటర్‌గా చరిత్ర సృష్టించి ఉండేవారు. అశ్విన్‌కు అయిన గాయం ఏమిటి? ఎప్పుడు తిరిగి వచ్చే అవకాశం ఉంది? వంటి వివరాలు ఈ వార్తలో చూద్దాం.
భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్ మైదానంలోకి తిరిగి రావడానికి మరింత వేచి చూడాల్సి వస్తుంది. మోకాలి గాయం కారణంగా ఆయన ఆస్ట్రేలియాలో జరగబోయే బిగ్ బాష్ లీగ్ 15వ సీజన్ నుంచి తప్పుకున్నారు. అశ్విన్ బీబీఎల్ లో సిడ్నీ థండర్ జట్టు తరఫున పూర్తి సీజన్ ఆడటానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒకవేళ అశ్విన్ ఆడి ఉంటే బీబీఎల్ చరిత్రలో ఆడిన మొట్టమొదటి భారత పురుష క్రికెటర్‌గా నిలిచి ఉండేవారు. కానీ గాయం కారణంగా ఈ చారిత్రక అవకాశం ప్రస్తుతానికి మిస్ అయింది.
అశ్విన్ త్వరగా కోలుకుంటే, సీజన్ మధ్యలో సిడ్నీ థండర్ జట్టు అతన్ని తిరిగి ఆడటానికి ఆహ్వానించే అవకాశం ఉంది. అశ్విన్ స్వయంగా సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసి, తన గాయం, బీబీఎల్ నుంచి వైదొలగడం వెనుక కారణాలను తెలియజేశారు. “బీబీఎల్ తదుపరి సీజన్‌కు చెన్నైలో సిద్ధమవుతున్న సమయంలో నాకు మోకాలిలో గాయం అయింది. పరీక్షల తర్వాత, నేను బీబీఎల్ 15లో ఆడలేనని తెలిసింది” అని అశ్విన్ తన ప్రకటనలో తెలిపారు. ఆస్ట్రేలియన్ అభిమానుల ముందు ఆడటానికి తాను ఎంతగానో ఉత్సాహంగా ఉన్నానని, కానీ ఈ నిర్ణయం తీసుకోవడం తనకు బాధ కలిగించిందని ఆయన వ్యక్తం చేశారు.
సిడ్నీ థండర్ ఆటగాళ్లు, సిబ్బంది తనకు పూర్తి మద్దతు ఇచ్చారని అశ్విన్ తెలిపారు. మైదానంలో లేకపోయినా, తాను థండర్ మహిళా, పురుషుల జట్లను ఉత్సాహపరుస్తూ ఉంటానని చెప్పారు. రవిచంద్రన్ అశ్విన్ అదే సంవత్సరంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత బీబీఎల్ లో ఆడాలని నిర్ణయించుకున్నారు. అశ్విన్ ఈ సంవత్సరం ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆ తరువాత అంతర్జాతీయ లీగ్‌లలో ఆడటానికి మొగ్గు చూపాడు. బిగ్ బాష్ లీగ్ 15వ సీజన్ డిసెంబర్ 14 నుంచి జనవరి 25 వరకు జరగనుంది. సిడ్నీ థండర్ జట్టు తమ మొదటి మ్యాచ్‌ను డిసెంబర్ 16న హోబర్ట్ హరికేన్స్‌తో ఆడాల్సి ఉంది. ఈ మధ్యలో అశ్విన్‌కు ILT20 లీగ్‌లో ఏ జట్టు కూడా కొనుగోలు చేయకపోవడం గమనార్హం.




