Deepti Sharma : 22 వికెట్లు, ఫైనల్‌లో 58 పరుగులు.. డీఎస్పీ దీప్తి శర్మ జీతం ఎంతో తెలుసా ?
భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచకప్ 2025 విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఆట గురించి ఎంత చెప్పినా తక్కువే. బంతితో అత్యధిక వికెట్లు తీసి, బ్యాట్‌తో ముఖ్యమైన పరుగులు చేసి, ఫైనల్‌లో అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించిన దీప్తి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచింది.

Deepti Sharma : భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచకప్ 2025 విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఆట గురించి ఎంత చెప్పినా తక్కువే. బంతితో అత్యధిక వికెట్లు తీసి, బ్యాట్‌తో ముఖ్యమైన పరుగులు చేసి, ఫైనల్‌లో అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించిన దీప్తి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచింది. ఈ స్టార్ ప్లేయర్ కేవలం క్రికెటర్‌గానే కాక, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) అధికారిణిగా కూడా పనిచేస్తున్నారు. మరి ప్రపంచ విజేత అయిన దీప్తి శర్మకు యూపీ ప్రభుత్వం నుంచి డీఎస్పీగా ఎంత జీతం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
భారత జట్టు ఆల్‌రౌండర్ దీప్తి శర్మ మహిళల ప్రపంచకప్ 2025లో బ్యాట్, బంతి రెండింటితో సంచలనం సృష్టించింది. ఆమె జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించింది. టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన చేసినందుకు దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకుంది. ఆమె ప్రపంచకప్ 2025లో ఏకంగా 22 వికెట్లు తీసి, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. 9 మ్యాచుల్లో 7 ఇన్నింగ్స్‌లలో 30.71 సగటుతో 215 పరుగులు చేసింది. ఫైనల్ మ్యాచ్‌లో ఆమె 58 బంతుల్లో 58 పరుగులు చేయడమే కాకుండా సౌతాఫ్రికాను 5 వికెట్లను కూడా పడగొట్టింది.
దీప్తి శర్మ కేవలం క్రికెట్ స్టార్ మాత్రమే కాదు. ఆమె ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో గౌరవప్రదమైన అధికారిణి కూడా. దీప్తి శర్మ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగరానికి చెందినవారు. ఆమె కేవలం 8 ఏళ్ల వయస్సులోనే క్రికెట్ ఆడటం ప్రారంభించి, 12 ఏళ్లకే యూపీ అండర్-19 జట్టులో చోటు దక్కించుకుంది. 17 ఏళ్ల వయస్సులో 2016లో భారత మహిళా జట్టులో భాగమైంది. క్రికెట్‌లో ఆమె చేసిన సేవలు మరియు ప్రతిభకు గుర్తింపుగా, దీప్తి శర్మను జనవరి 2024లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా నియమించింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్పీకి లభించే జీతం వివరాలు ఏడవ వేతన సంఘం ప్రకారం ఉంటాయి. యూపీలో డీఎస్పీకి 7వ వేతన సంఘం ప్రకారం, లెవెల్ 10 లో రూ.56,100 మూల వేతనం లభిస్తుంది. దీనికి వివిధ రకాల భత్యాలు (అలవెన్సులు) జోడించిన తర్వాత, డీఎస్పీ మొత్తం నెలవారీ జీతం రూ.70,000 నుంచి రూ.1,10,000 మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ జీతం ప్రమోషన్లు, అనుభవాన్ని బట్టి పెరుగుతూ ఉంటుంది.




