AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India : సంజూ శాంసన్, వైభవ్‌లతో ‘మ్యూజికల్ చైర్స్’ ఆటలా?.. టీమిండియా చెత్త వ్యూహాలపై అశ్విన్ ఫైర్

Team India : ఇంగ్లండ్‌ తో టీ20 సిరీస్ పరాజయం తర్వాత టీమిండియా వ్యూహాలపై రవి చంద్రన్ అశ్విన్ తీవ్ర విమర్శలు చేశారు. సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీలను పదేపదే మార్చడం జట్టులో అస్థిరతకు కారణమైందని, ఆటగాళ్లకు నమ్మకం ఇవ్వాలని సూచించారు.

Team India : సంజూ శాంసన్, వైభవ్‌లతో ‘మ్యూజికల్ చైర్స్’ ఆటలా?.. టీమిండియా చెత్త వ్యూహాలపై అశ్విన్ ఫైర్
Team India
Rakesh
|

Updated on: Jul 12, 2026 | 5:38 PM

Share

Team India : ఐర్లాండ్ పర్యటనలో క్లీన్‌స్వీప్ అయిన తర్వాత, ఇంగ్లండ్ గడ్డపై కూడా భారత టీ20 జట్టు 0-4తో సిరీస్‌ను దారుణంగా చేజార్చుకుంది. ఈ వరుస పరాజయాల నేపథ్యంలో టీమిండియా మేనేజ్‌మెంట్ అవలంబిస్తున్న వ్యూహాలు, ప్రణాళికలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత మాజీ దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టు వ్యూహాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఓపెనర్లు సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీలను పదే పదే మారుస్తూ మేనేజ్‌మెంట్ మ్యూజికల్ చైర్స్ ఆట ఆడుతోందని ఆయన మండిపడ్డారు. ఆటగాళ్లకు సరైన భరోసా ఇవ్వకపోవడం వల్లే జట్టులో అస్థిరత ఏర్పడిందని, ఇది తనను ఎంతగానో ఆందోళనకు గురిచేస్తోందని అశ్విన్ ఓపెన్‌గా చెప్పారు.

బట్లర్‌ను చూసి నేర్చుకోండి

ఇంగ్లండ్ ఆటగాడు జోస్ బట్లర్ ప్రదర్శనను ఉదాహరణగా చూపిస్తూ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ యాష్ కి బాత్‎లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “చివరి మ్యాచ్‌లో జోస్ బట్లర్ 131 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కానీ అంతకుముందు మూడు ఇన్నింగ్స్‌లలో అతను కేవలం 44 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యాడు. అయినప్పటికీ ఇంగ్లండ్ మేనేజ్‌మెంట్ అతనిపై నమ్మకం ఉంచి జట్టులోనే కొనసాగించింది. ఫలితంగా చివరి మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. కానీ మన జట్టులో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. 2026 టీ20 వరల్డ్ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‎గా నిలిచిన సంజూ శాంసన్‌ను కేవలం మూడు మ్యాచ్‌ల్లో ఫెయిల్ అయ్యాడని జట్టు నుంచి తీసేశారు. ఇంగ్లండ్ లాగా శాంసన్‌కు వరుసగా అవకాశాలు ఇచ్చి ఉంటే, బహుశా అతను కూడా ఈ మ్యాచ్‌లో సెంచరీ బాదేవాడేమో” అని అశ్విన్ అభిప్రాయపడ్డారు.

సిరీస్ ఓడిపోతేనే అసలైన పరీక్ష

చివరి ఐదో టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని బెంచ్‌కే పరిమితం చేసి, మళ్లీ సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో శాంసన్ కేవలం 14 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 పరుగులు చేసి మంచి టచ్‌లో కనిపించినా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఈ మార్పులపై అశ్విన్ స్పందిస్తూ.. “జట్టు నిరంతరం గెలుస్తున్నప్పుడు ఎలాంటి సవాళ్లు ఉండవు, ఆటగాళ్లు తమంతట తామే రాణిస్తారు. కానీ జట్టు వరుసగా ఓడిపోతున్నప్పుడే సెలెక్టర్ల ఓపికకు, జట్టులోని స్థిరత్వానికి అసలైన పరీక్ష ఎదురవుతుంది. ఐర్లాండ్ నుంచి ఇంగ్లండ్ పర్యటన ముగిసేవరకు మనం ఎన్ని మ్యాచుల్లో ఒకే ప్లేయింగ్ ఎలెవన్‌తో ఆడాం? ప్రతి మ్యాచ్‌లోనూ మార్పులు చేస్తూనే ఉన్నారు. ఒక మ్యాచ్‌లో శాంసన్ అవుట్-వైభవ్ ఇన్, మరో మ్యాచ్‌లో వైభవ్ అవుట్-శాంసన్ ఇన్.. ఇలా చేస్తే ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం ఎలా పెరుగుతుంది?” అని ప్రశ్నించారు.

15 ఏళ్ల వైభవ్‌కు మరికొంత సమయం ఇవ్వాలి

యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ టాలెంట్‌ను అశ్విన్ సమర్థించారు. వైభవ్ అద్భుతమైన ఆటగాడని, ఒకవేళ తాను సెలెక్టర్ స్థానంలో ఉన్నా కచ్చితంగా అతడిని జట్టులోకి ఎంపిక చేసేవాడినని చెప్పారు. అయితే, అంతర్జాతీయ క్రికెట్ ఒత్తిడిని తట్టుకోవడానికి ఆ 15 ఏళ్ల కుర్రాడికి మరికొంత సమయం ఇవ్వాలని, వరుసగా మూడు మ్యాచుల్లో ఫెయిల్ అవ్వగానే డ్రాప్ చేయడం కరెక్ట్ కాదని హితవు పలికారు. వైభవ్ ఆడిన మూడు మ్యాచుల్లో కేవలం 46 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కాగా, భారత జట్టు త్వరలోనే (జూలై 23 నుంచి) జింబాబ్వే పర్యటనలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో సంజూ శాంసన్‌కు చోటు దక్కలేదు, కానీ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి మాత్రం సెలెక్టర్లు మరో అవకాశం ఇచ్చారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us