బ్యూటీ కోసం ఫిష్ పెడిక్యూర్ చేయిస్తున్నారా? అయితే ఈ ప్రాబ్లమ్స్ వెంట తెచ్చుకున్నట్లే..!
ఫిష్ పెడిక్యూర్.. ఇటీవల బ్యూటీ, వెల్‌నెస్ రంగంలో ట్రెండ్‌గా మారిన ఈ విధానం చూడటానికి ఆసక్తికరంగా అనిపించినా, ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పరిశుభ్రత లోపిస్తే చర్మ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా వ్యాప్తి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఫిష్ పెడిక్యూర్.. ఇటీవల బ్యూటీ, వెల్‌నెస్ రంగంలో ట్రెండ్‌గా మారిన ఈ విధానం చూడటానికి ఆసక్తికరంగా అనిపించినా, ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పరిశుభ్రత లోపిస్తే చర్మ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా వ్యాప్తి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఫిష్ పెడిక్యూర్‌ను వైద్య పరిభాషలో ఇక్తియోథెరపీగా పిలుస్తారు. ఈ ప్రక్రియలో గోరువెచ్చని నీటితో నింపిన ట్యాంకులో ‘గర్రా రుఫా’ అనే చిన్న చేపలను ఉంచుతారు. వినియోగదారులు తమ పాదాలను ఆ నీటిలో ఉంచితే, చేపలు ప్రధానంగా చనిపోయిన చర్మాన్ని తొలగిస్తాయి. దీంతో పాదాలు మృదువుగా మారుతాయని చాలామంది భావిస్తారు.
అయితే ఈ ప్రక్రియలో ఉపయోగించే నీరు, ట్యాంక్ పరిశుభ్రతే ప్రధాన ఆందోళనగా మారుతోంది. ఒకే ట్యాంక్‌లో పలువురు వ్యక్తులు పాదాలను ముంచడం వల్ల సూక్ష్మజీవులు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పాదాలపై చిన్న గాయాలు, కోతలు, చర్మ సమస్యలు ఉంటే ఇన్ఫెక్షన్ ప్రమాదం మరింత పెరుగుతుందంటున్నారు వైద్యులు.
హెపటైటిస్ సీ వంటి రక్తం ద్వారా వ్యాపించే ఇన్ఫెక్షన్ల విషయంలోనూ పరిశుభ్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఫిష్ పెడిక్యూర్ ద్వారా హెపటైటిస్ సీ లేదా హెచ్‌ఐవీ తప్పనిసరిగా వ్యాపిస్తుందని నిర్ధారించే బలమైన ఆధారాలు లేవని, ఇలాంటి వాదనలను జాగ్రత్తగా చూడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహం, సోరియాసిస్ లేదా రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు ఫిష్ పెడిక్యూర్‌కు దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. పాదాలపై తెరిచిన గాయాలు, చర్మ ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు ఈ ప్రక్రియ చేయించుకోకూడదని చెబుతున్నారు.
అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు కూడా పరిశుభ్రత, ఇన్ఫెక్షన్ వ్యాప్తి వంటి కారణాలతో ఫిష్ పెడిక్యూర్‌పై ఆంక్షలు విధించాయి. ప్రతి కస్టమర్ తర్వాత నీటిని మార్చడం, ట్యాంక్‌ను పూర్తిగా శుభ్రపరచడం వంటి చర్యలు అవసరం. కానీ చేపలకు హాని కలగకుండా ఈ స్థాయి పరిశుభ్రతను ప్రతి సారి నిర్వహించడం సవాలుగా మారుతోంది. అందుకే ఫిష్ పెడిక్యూర్ చేయించుకోవాలనుకునేవారు ముందుగా తమ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు, సదరు స్పాలో పరిశుభ్రత ప్రమాణాలు, నీటి నిర్వహణ, పరికరాల శానిటైజేషన్ వంటి అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
