Champions Trophy: భారత్-పాక్ మ్యాచ్.. తనకు కేటాయించిన 30 వీఐపీ టిక్కెట్లు అమ్ముకున్న పీసీబీ ఛైర్మన్!
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ నెల 23న ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఓ 30 వీఐపీ బాక్స్ టిక్కెట్లను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌కు ఆఫర్ చేసింది. కానీ, ఆయన వాటిని అమ్ముకోవాలని అనుకుంటున్నారు. అందుకే గల కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రేపటి(ఫిబ్రవరి 19, బుధవారం) నుంచి స్టార్ట్ కాబోతుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు కరాచీ వేదికగా తలపడనున్నాయి. ఇక మన టీమిండియా గురువారం దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ వేటను మొదలుపెట్టనుంది. మొత్తం 8 జట్ల మధ్య జరుగుతున్న ఈ ఛాంపియన్స్ సంగ్రామంలో అంతిమంగా ఓ జట్టు ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్‌గా నిలవనుంది. ఈ టోర్నీలో ఎన్ని మ్యాచ్‌లు ఉన్నా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న మ్యాచ్‌ఏదంటే మరో డౌట్ లేకుండా చెప్పే మాట ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అని.
ఈ దాయాదుల పోరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది మ్యాచ్ కంటే కూడా ఓ మినీ యుద్ధంలా జరుగుతుంది. ఇరు జట్ల ఆటగాళ్లు మ్యాచ్ గెలిచేందుకు తమ ప్రాణాలు పెట్టేస్తుంటారు. అందుకే ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే అంత పిచ్చి క్రికెట్ ఫ్యాన్స్‌కు. ఈ రైవల్రీని ఐసీసీ కూడా అద్భుతంగా క్యాష్ చేసుకుంటుంది. ప్రతి ఐసీసీ ఈవెంట్‌లో ఈ రెండు జట్లకు కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఉండేలా చూసుకుంటుంది. ఇక భారత్-పాక్ మ్యాచ్ చూసేందుకు సాధారణ ప్రేక్షకులతో పాటు వీవీఐపీలు, సినిమా హీరోలు, రాజకీయా నాయకులు, ఇతర సెలబ్రెటీలు కూడా ఆసక్తి చూపిస్తారు. నేరు స్టేడియంలో మ్యాచ్ చూసి ఎంజాయ్ చేసేందుకు వస్తుంటారు. అలాగే ఇరు దేశాల క్రికెట్ బోర్డ్ సభ్యులు కూడా మ్యాచ్‌కు హాజరవుతుంటారు.
ఈ క్రమంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్వహకులు ఓ 30 వీఐపీ టిక్కెట్లను ఆఫర్ చేశారు. అలాగే బీసీసీఐకి కూడా టిక్కెట్లు ఆఫర్ చేసి ఉంటారు. అయితే పీసీబీ(పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) ఛైర్మన్ మాత్రం తనకు ఆఫర్ చేసిన వీఐపీ టిక్కెట్లను ఆయన అమ్ముకోవాలని అనుకుంటున్నారు. అదేంటి.. ఏదో బోర్డ్ ఛైర్మన్ కదా అని ఫ్రీగా టిక్కెట్లు ఆఫర్ చేస్తే చీప్‌గా అమ్ముకుంటున్నాడని తక్కువ చేసి చూడకండి. పాపం.. దాని వెనుక ఒక మంచి ఉద్దేశమే ఉంది.
తనకు తన కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఆఫర్ చేసిన టిక్కెట్ల ఖరీదు దాదాపు 94 లక్షల(ఇండియన్ కరెన్సీలో) వరకు ఉంటుంది. అంత ఖరీదైన టిక్కెట్లు తీసుకొని, వీఐపీ బాక్స్‌లో సౌకర్యాలు పొందుతూ భారత్-పాక్ మ్యాచ్‌ను వీక్షించే కన్నా.. ఆ టిక్కెట్లను అమ్ముకొని వచ్చిన డబ్బుతో పాకిస్థాన్‌లోని క్రికెట్ స్టేడియాల అభివద్ధి కోసం ఉపయోగించాలని నఖ్వీ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని ఐసీసీ, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు కూడా తెలియజేసినట్లు నఖ్వీ తెలిపారు. వీఐపీ బాక్స్‌లో కాకుండా సాధారణ ప్రేక్షకులతో కలిసి సాండ్స్‌లో కూర్చోని ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తానని తెలిపారు.
