AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్ జట్టులో పెద్ద సమస్య అదే.. ఆ లెక్కేంటో తెలిస్తే టీమిండియా ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తారు.!

Asia Cup 2023: ఆసియాకప్, ఆ తర్వాత వచ్చే వన్డే ప్రపంచకప్.. ఈ రెండు మెగా టోర్నమెంట్లను గెలవాలని పాకిస్తాన్ ఉవ్విళ్లూరుతోంది. బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్, షాహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా రేసు గుర్రాళ్లుగా ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక కెప్టెన్ బాబర్, రిజ్వాన్..

పాక్ జట్టులో పెద్ద సమస్య అదే.. ఆ లెక్కేంటో తెలిస్తే టీమిండియా ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తారు.!
Babar Azam
Ravi Kiran
|

Updated on: Aug 25, 2023 | 5:35 PM

Share

ఆసియాకప్, ఆ తర్వాత వచ్చే వన్డే ప్రపంచకప్.. ఈ రెండు మెగా టోర్నమెంట్లను గెలవాలని పాకిస్తాన్ ఉవ్విళ్లూరుతోంది. బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్, షాహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా రేసు గుర్రాళ్లుగా ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక కెప్టెన్ బాబర్, రిజ్వాన్.. ఇద్దరూ కూడా ప్రతీ మ్యాచ్‌లోనూ పరుగులు రాబడుతున్నారు. అలాగే తమ బౌలింగ్ యటాక్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనదిగా భావిస్తోంది పాకిస్తాన్. ఇలా అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్.. రెండింటిలోనూ ప్రమాదకారిగా ఉన్నామని అనుకుంటున్న పాకిస్తాన్‌కు.. అసలైన తమ బలహీనత బయటపడట్లేదు. రాబోయే రెండు మెగా టోర్నీలలోనూ వారి ఓటమికి అదే అతిపెద్ద కారణం కావచ్చు. ఏదయితే తమ బలం అని గర్వంగా చెబుతుందో పాక్ జట్టు.. అదే వారి పెద్ద బలహీనతగా మారింది.

పైకి పాకిస్తాన్ జట్టు బాబర్ అజామ్, మహమ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిదిలతో బలంగా కనిపిస్తున్నా.. లోపల దుస్థితి మాత్రం వేరొకటి. పాకిస్థాన్ పరిస్థితి ప్రపంచంలోని ఏ జట్టుకూ లేదు. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు ఆఫ్ఘనిస్థాన్‌తో వన్డే సిరీస్‌ ఆడుతుండగా, ఈ సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలింగ్ బట్టబయలైంది. షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్ 238 బంతులు వేసి.. ఏ ఒక్క ఆఫ్ఘన్ బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయలేకపోయారు. ఇది పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్ లైనప్ పరిస్థితి. అలాగే ఒకప్పుడు ఆ జట్టుకు బలంగా ఉన్న స్పిన్ బౌలింగ్.. ఇప్పుడు పెద్ద బలహీనతగా మారింది.

పాక్ స్పిన్ లెక్కలు..

వన్డేల్లో అత్యంత చెత్త స్పిన్‌ బౌలింగ్ పాకిస్థాన్‌దే. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న జట్లకు కూడా.. పాక్ కంటే మెరుగైన స్పిన్ యటాక్ ఉంది. 2019 ప్రపంచకప్ తర్వాత, వన్డేల్లో అత్యుత్తమ స్పిన్ బౌలింగ్ జట్టు గురించి మాట్లాడితే.. బంగ్లాదేశ్ జట్టు అగ్రస్థానంలో ఉంది. 45 మ్యాచ్‌ల్లో 4.60 ఎకానమీతో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ 25 మ్యాచ్‌ల్లో 4.43 ఎకానమీతో రెండో స్థానంలో ఉంది. పాకిస్థాన్ జట్టు చిట్టచివర 10వ స్థానంలో ఉంది. ఆ జట్టు స్పిన్నర్లు 29 మ్యాచ్‌లలో 518.5 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 69 వికెట్లు పడగొట్టారు. 5.42 ఎకానమీగా ఉంది.

పాకిస్థాన్ స్పిన్నర్లు 40 సగటుతో..

బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల స్పిన్ బౌలింగ్ సగటు 30 కంటే తక్కువలో ఉండగా.. పాకిస్తాన్ స్పిన్నర్ల సగటు 40 కంటే ఎక్కువ ఉంది. ఇదే ఆసియా కప్‌లో పాకిస్తాన్‌కు అతిపెద్ద బలహీనతగా మారనుంది. అంతేకాదు ప్రపంచకప్‌కు కూడా ఇది పెద్ద ఇబ్బందే. ఈ ఏడాది ఆసియా కప్, ప్రపంచకప్‌లు స్పిన్‌కు అనుకూలమైన మైదానాల్లో జరుగుతాయి. స్పిన్నర్లదే కీలక పాత్ర కానుంది. ఆసియా కప్‌లో పాకిస్థాన్ కొన్ని మ్యాచ్‌లను తమ దేశంలో ఆడనుండగా, కొన్ని మ్యాచ్‌లు శ్రీలంకలో ఆడనుంది. అలాగే భారత్‌లోనూ స్పిన్నర్లదే హవా. ఇలాంటి పరిస్థితుల్లో పాక్‌ స్పిన్నర్ల లెక్కలే.. ఆ జట్టును దెబ్బతీసేలా ఉన్నాయి.