
టీమిండియా మరో అద్భుతాన్ని సృష్టించింది. శుక్రవారం ఆస్ట్రేలియాపై భారీ విజయాన్ని నమోదు చేసుకున్న భారత క్రికెట్ జట్టు మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. అన్ని ఫార్మాట్స్‌లో నెంబర్ ర్యాంక్‌లో నిలిచి చరిత్ర తిరగరాసింది. ఇప్పటికే టీ20, టెస్టుల్లో మొదటి స్థానంలో ఉన్న టీమిండియా ఆస్ట్రేలియాతో విజయం తర్వాత వన్డేల్లో కూడా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.
వన్డేల్లో టాప్‌లో ఉన్న పాకిస్థాన్‌ని వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఐసీసీ వన్డే బౌలింగ్ లో నెంబర్ వన్ స్థానంలో సిరాజ్ చోటు దక్కించుకోగా.. T20 బ్యాటింగ్ లో నెంబర్ వన్ ర్యాంక్ లో సూర్యకుమార్ యాదవ్ కొనసాగుతున్నాడు. టెస్టుల్లో నెంబర్ వన్ ఆల్ రౌండర్‌గా రవీంద్ర జడేజా ఉండగా, టెస్టుల్లో అశ్విన్ నెంబర్ వన్ బౌలర్‌గా నిలిచాడు. అలాగే శుభ్‌మన్ గిల్ వన్డే బ్యాటింగ్‌లో రెండవ స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే ఇలా మూడు ఫార్మాట్స్‌లో టీమిండియా మొదటి స్థానంలో నిలవడం ఇదే తొలిసారి. టీమిండియా కంటే ముందు 2012లో దక్షిణాఫ్రికా ఈ అరుదైన ఘనతను సాధించింది. ప్రస్తుతం భారత్ ఈ లిస్ట్‌లో చేరడం విశేషం.
No. 1 Test team ☑️
No. 1 ODI team ☑️
No. 1 T20I team ☑️#TeamIndia reigns supreme across all formats 👏👏 pic.twitter.com/rB5rUqK8iH— BCCI (@BCCI) September 22, 2023
.
అద్భుతం.. అమోఘం.. అఖండం..
టీమిండియా ప్రదర్శన గురించి చెప్పాలంటే ఇలానే చెప్పాలి. వరుస విజయాలు. అంతకు మించి ర్యాంకింగ్స్‌లో టాప్ పొజిషన్లు. భారత క్రికెట్ జట్టు ఈ మధ్య కాలంలో సృష్టిస్తున్న రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఆస్ట్రేలియాపై ఒక్క విజయం.. భారత్‌ను నెంబర్ వన్ వన్డే జట్టుగా నిలిపింది. మొహాలీలో జరిగిన తొలి వన్డేలో వర్షం అడ్డుపడ్డా.. మ్యాచ్ సజావుగా జరిగింది. టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న భారత్‌కు షమీ మంచి ఆరంభాన్నిచ్చాడు. తొలి ఓవర్‌లోనే మిచెల్ మార్ష్ వికెట్ పడగొట్టాడు. వార్నర్ స్మిత్ రెండో వికెట్‌కు వందరన్స్ జోడించారు. ఆతర్వాత లబూషేన్, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, స్టాయినిస్.. రాణించినా.. ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు. దీనికి కారణం మన స్పిన్నర్లు.. వారికి మించి షమీ షార్ప్ బౌలింగే. సరైన సమయంలో వికెట్లు పడగొట్టిన షమీ.. ఐదువికెట్లు తీసి కెరీర్ బెస్ట్ ఇచ్చాడు. దీంతో 276పరుగులకు ఆసీస్ ఆలౌట్ అయింది.
చాలెంజింగ్ టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. గైక్వాడ్, గిల్ ఆసీస్ బౌలర్లపై ఆధిపత్యం చూపించారు. ఒకరిని మించి మరొకరు ఆడారు. చక్కని షాట్లతో బౌండరీలు రాబట్టారు. వీరిద్దరూ కలిసి 142పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత గైక్వాడ్ ఔటయ్యాడు. వెంటనే అయ్యర్ రనౌట్‌గా వెనుదిరిగాడు. 26వ ఓవర్లో గిల్ కూడా ఔటవ్వడంతో.. 9 పరుగుల తేడాతో మూడు వికెట్లు కోల్పోయింది భారత్. కానీ.. కెప్టెన్ రాహుల్ కూల్‌గా ఇన్నింగ్స్‌ని నిలబెట్టాడు. కిషన్ త్వరగా ఔటైనా.. సూర్యకుమార్ యాదవ్ మంచిగా రాణించాడు. అవసరమైన సమయాల్లో బౌండరీలు బాది.. హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో భారత్ విజయానికి చేరువైంది. చివర్లో సిక్సుతో రాహుల్ మ్యాచ్ గెలిపించాడు.
మరిన్ని క్రికెట్ కథనాల కోసం క్లిక్ చేయండి..