World Test Championship: ఫైనల్లో టీమిండియాను 8 వికెట్ల తేడాతో ఓడించిన న్యూజిలాండ్… తొలి ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ విజేతగా నిలిచింది. ఐసీసీ తొలిసారి నిర్వహిస్తున్న ఈ మెగా ట్రోఫీని కివీస్ జట్టు కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా విసిరిన...

World Test Championship: ఫైనల్లో టీమిండియాను 8 వికెట్ల తేడాతో ఓడించిన న్యూజిలాండ్... తొలి ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌
Championship Final 2021
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 24, 2021 | 1:00 AM

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ విజేతగా నిలిచింది. ఐసీసీ తొలిసారి నిర్వహిస్తున్న ఈ మెగా ట్రోఫీని కివీస్ జట్టు కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా విసిరిన 139 పరుగుల టార్గెట్‌ను ఆ జట్టు 45.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయినా కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (52/ 89 బంతుల్లో 8×4), రాస్‌టేలర్‌ (47/ 100 బంతుల్లో 6×4) బాధ్యతగా ఆడి కివీస్‌కు అపురూప విజయాన్ని అందించారు.

అంతకుముందు కివీస్ ఓపెనర్లు టామ్‌ లాథమ్‌(9/41 బంతుల్లో), డెవాన్‌ కాన్వే(19/ 47 బంతుల్లో 4×4)ను అశ్విన్ ఔట్‌ చేసి టీమిండియాకు మంచి శుభారంభాన్ని ఇచ్చారు. దీంతో ఆ జట్టుపై ఒత్తిడి పెంచే అవకాశం దక్కినా టీమిండియా సరిగ్గా వినియోగించుకోలేక పోయింది. ఈ క్రమంలోనే ఓటమిపాలై ఐసీసీ ట్రోర్నోల్లో మరోసారి భంగపాటుకు గురైంది.

కాగా, టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకు ఆలౌటైంది. రిషభ్‌ పంత్‌(41/ 88 బంతుల్లో 4×4) పెద్ద నెంబర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. కివీస్‌ పేసర్లు టిమ్‌సౌథీ 4/48, బౌల్ట్‌ 3/39 అద్భుతమైన బౌలింగ్‌తో టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. ఈ క్రమంలోనే తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 32 పరుగులు కలుపుకొని న్యూజిలాండ్‌ ఫైనల్ టార్గెట్ ఛేదించింది.

అంతకుముందు 64/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆరోరోజు రిజర్వ్‌డే ఆట కొనసాగించిన కెప్టెన్‌ విరాట్‌ (13/ 29 బంతుల్లో), చెతేశ్వర్‌ పుజారా (15/ 80 బంతుల్లో 2×4) నిరాశపరిచారు. ఆట ప్రారంభమైన అరగంటకే ఒక్క పరుగు తేడాతో ఇద్దరూ పెవిలియన్‌ దారి పట్టారు. ఇక జేమీసన్‌ వరుస ఓవర్లలో వీరిని ఔట్‌చేశాడు.

ఆ తర్వాత రహానె (15/40 బంతుల్లో 1×4) సైతం పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కాసేపు వికెట్‌ కాపాడుకునే ప్రయత్నం చేసినా చివరికి బౌల్ట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. లెగ్‌సైడ్‌ వెళ్లే బంతిని ఆడి వికెట్‌ సమర్పించుకున్నాడు. ఆపై పంత్‌, జడేజా(16/ 49 బంతుల్లో 2×4) జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును మెల్లిగా ముందుకు తీసుకెళ్లారు. వారిద్దరూ ఆరో వికెట్‌కు 33 పరుగులు జోడించారు. ఈ నేపథ్యంలోనే స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. తొలుత జడ్డూ వాగ్నర్‌ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇవ్వగా కాసేపటికే పంత్.. బౌల్ట్‌ బౌలింగ్‌లో నికోల్స్‌ చేతికి చిక్కాడు. అప్పటికి టీమ్‌ఇండియా స్కోర్‌ 156/7గా నమోదైంది. ఇక టెయిలెండర్లు అశ్విన్‌(7), షమి(13), బుమ్రా(0) కూడా పెద్దగా రాణించకపోవడంతో భారత్‌ 170 పరుగులకే పరిమితమైంది.

ఐసీసీ టోర్నమెంట్‌లో మరోసారి న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. కేన్ విలియమ్సన్ జట్టు 2019 సెమీ ఫైనల్స్‌లో ఓడిపోయిన తరువాత వరుసగా రెండోసారి టీమిండియాను ఓడించింది. 2003 ప్రపంచ కప్‌లో సూపర్ సిక్స్ మినహా ఇప్పటి వరకు ఐసిసి టోర్నమెంట్‌లో భారత్ ఒక్కసారి కూడా న్యూజిలాండ్‌ను ఓడించలేదు.