Ind vs Nz Test Match: టెస్ట్ క్రికెట్‌లో సంచలనం.. ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన న్యూజిలాండ్ స్పిన్నర్..
Ind vs Nz Test Match: భారత బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టిన అజాజ్ పటేల్ మొత్తం 10 వికెట్లను నేలకూల్చాడు. ఇలా ఒకే ఇన్నింగ్స్‌లో మొత్తం పది వికెట్లను పడగొట్టి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
Ind vs Nz Test Match: ముంబయి వేదికగా న్యూజిలాండ్, టీమిండియాల మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ సంచలనం సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన మూడో క్రికెటర్‌గా చరిత్ర సృష్టించారు. ముంబై టెస్ట్‌లో తన స్పిన్ మాయాజాలంతో భారత బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 119 పరుగులు ఇచ్చి 10 వికెట్లు తీశాడు. దీంతో అనిల్ కుంబ్లే 1999 ఫిబ్రవరి 7న పది వికెట్లు పడగొట్టిన రికార్డును అజాజ్ సమం చేశాడు. రెండో టెస్టు మ్యాచ్‌లో మొత్తం 47.5 బంతులు వేసిన అజాజ్ 119 పరుగులు, 12 మేడిన్ ఓవర్‌లతో 10 వికెట్లు తీసుకున్నాడు.
దీంతో ఇంగ్లాండ్ బౌలర్ జిమ్ లేకర్, అనిల్ కుంబ్లేల రికార్డును సమం చేశాడు అజాజ్. టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి 1956లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో జిమ్ లేకర్ ఒకే ఇన్నింగ్స్‌లో 53 పరుగులు ఇచ్చి10 వికెట్లు తీసి ఈ ఘనతను అందుకున్న తొలి బౌలర్‌గా నిలిచాడు. ఆ తర్వాత మరో 43 ఏళ్లకు అంటే 1999లో అంటే పాకిస్థాన్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో 74 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు.
ఇప్పుడు మళ్లీ 22 ఏళ్ల తర్వాత అజాజ్ పటేల్ ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాకుండా ఓ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన తొలి న్యూజిలాండ్ స్పిన్నర్‌గా కూడా అజాజ్ గుర్తింపు దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే అజాజ్ పటేల్ మన భారతీయుడేనన్న విషయం మీకు తెలుసా.? ముంబయిలో జన్మించిన అజాజ్ తర్వాత న్యూజిలాండ్ వెళ్లి స్థిరపడ్డాడు.