
MS Dhoni Retirement: ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న వేళ చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు భారీ షాక్ తగిలేలా కనిపిస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్, సీఎస్‌కే వెన్నెముక మహేంద్ర సింగ్ ధోనీ నిశ్శబ్దంగా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నారా? ఐపీఎల్ చరిత్రలోనే ఒక శకం ముగియబోతోందా? అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజా పరిణామాలు ధోనీ అంతర్జాతీయ క్రికెట్ తరహాలోనే ఐపీఎల్‌కు కూడా సైలెంట్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారనే సంకేతాలను బలంగా ఇస్తున్నాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ ఈ సీజన్‌లో చెన్నైలోని హోమ్ గ్రౌండ్ ఎంఏ చిదంబరం (చేపాక్) స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు చివరి మ్యాచ్. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో కనిపించిన దృశ్యాలు అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. సాధారణంగా భావోద్వేగాలకు దూరంగా ఉండే మిస్టర్ కూల్.. మ్యాచ్ ముగిసిన తర్వాత చాలా సేపటి వరకు మైదానంలోనే ఉండిపోయాడు. స్టేడియం నలుమూలలా ఉన్న అభిమానుల వైపు చూస్తూ చేతులూపుతూ సుదీర్ఘంగా అభివాదం చేశాడు. మైదాన సిబ్బందితో పాటు తోటి ఆటగాళ్లతో కలిసి ప్రత్యేకంగా ఫొటోలు దిగారు. ధోనీ ముఖంలో కనిపించిన ఆ వీడ్కోలు హావభావాలు, భావోద్వేగ క్షణాలు చూశాక.. చేపాక్‌లో ధోనీకి ఇదే చివరి మ్యాచ్ అనే ప్రచారం జోరందుకుంది.
ఈ లీగ్ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగే చివరి కీలక మ్యాచ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అహ్మదాబాద్ బయలుదేరింది. అయితే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ధోనీ ఈ పర్యటనకు దూరంగా ఉండిపోయాడు. ఆయన జట్టుతో కలిసి ప్రయాణించకపోవడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌కు ధోనీ దూరం కావడానికి ఫిట్‌నెస్ సమస్యలా లేక కెరీర్‌పై ఆయన తీసుకున్న తుది నిర్ణయమా అనేది ఇంకా స్పష్టత రాలేదు. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ, ధోనీ నిశ్శబ్దంగా తప్పుకుంటున్నారనే వార్త సోషల్ మీడియాను ఊపేస్తోంది.
ధోనీకి అత్యంత ఆప్తుడైన మాజీ క్రికెటర్ సురేష్ రైనా చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రైనా మాట్లాడుతూ.. మ్యాచ్ ముగిసిన తర్వాత తాను ధోనీతో మాట్లాడానని చెప్పాడు. “ఈ సీజన్‌ను ఒక మిస్డ్‌కాల్‌లా భావించి, వచ్చే ఏడాది మళ్లీ ఐపీఎల్‌లోకి పునరాగమనం చేయాలని” తాను ధోనీతో సరదాగా అన్నట్లు రైనా పేర్కొన్నారు. అయితే దీనికి ధోనీ స్పందిస్తూ.. “ఇప్పుడు నా శరీరం మునుపటిలా సహకరించడం లేదు, తీవ్రమైన బలహీనతగా అనిపిస్తోంది” అని సమాధానమిచ్చినట్లు రైనా వెల్లడించాడు. వయసు పైబడటం, తీవ్రమైన మోకాలి, పిక్కల గాయాలు ధోనీ ఆటను ఎంతలా ప్రభావితం చేస్తున్నాయో ఆయన మాటలను బట్టే అర్థమవుతోంది.
ఈ సీజన్ పొడవునా ధోనీ పిక్కల గాయంతో బాధపడుతూనే బ్యాటింగ్ ఆర్డర్‌లో చాలా కిందకు వచ్చి పరిమిత ఓవర్లలో మాత్రమే ఆడారు. ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధన ఉన్నందున ఆయన ఈ స్థాయికైనా ఆడగలిగారు. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ధోనీని వచ్చే ఏడాది కూడా జట్టులోనే చూడాలని ఆశిస్తున్నప్పటికీ, అంతిమ నిర్ణయం ధోనీ చేతుల్లోనే ఉంది. కోట్ల మంది అభిమానులకు చేపాక్ మైదానంలో ఘనమైన వీడ్కోలు మ్యాచ్ ఇవ్వాలనేది యాజమాన్యం కోరిక. మహేంద్ర సింగ్ ధోనీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరూ ఊహించలేరు. గతంలో అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా ఆయన ఇలాగే సాదాసీదాగా, ఎలాంటి హడావుడి లేకుండా సామాజిక మాధ్యమాల్లో ఒక చిన్న పోస్టుతో వీడ్కోలు పలికారు. ఇప్పుడు ఐపీఎల్‌లో కూడా అదే పంథాను అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు అభిమానులు ఊపిరి బిగబట్టుకుని ఎదురుచూడక తప్పదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..