Mohsin Naqvi : ఇదెక్కడి లెక్క సామీ..ఐసీసీ మీద నిప్పులు చెరిగిన మొహ్సిన్ నఖ్వీ
Mohsin Naqvi : టీ20 వరల్డ్ కప్ 2026 వేదికగా భారత్, పాకిస్థాన్, ఐసీసీ మధ్య కోల్డ్ వార్ ముదిరి పాకాన పడింది. భద్రతా కారణాలతో ఇండియాకు రావడానికి బంగ్లాదేశ్ నిరాకరించడం, వారిని టోర్నీ నుంచి తొలగించి స్కాట్లాండ్‌ను చేర్చడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నఖ్వీ నిప్పులు చెరిగారు. బంగ్లాదేశ్‌కు అన్యాయం జరుగుతోందని, ఒకవేళ తాము కూడా తప్పుకుంటే ఐసీసీ 22వ జట్టును వెతుక్కోవాల్సి వస్తుందని ఆయన ఘాటుగా హెచ్చరించారు.

Mohsin Naqvi : టీ20 వరల్డ్ కప్ 2026కు భారత్ ఆతిథ్యం ఇస్తుండటంతో పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు ఇక్కడ ఆడటానికి సవాలక్ష నిబంధనలు పెడుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ జట్టు భద్రతా కారణాల దృష్ట్యా భారత్ రావడానికి నో చెప్పడంతో, ఐసీసీ వారిని టోర్నీ నుంచి తప్పించి స్కాట్లాండ్‌ను చేర్చింది. ఈ నిర్ణయంపై పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ క్రికెట్‌లో ఒక ప్రధాన భాగస్వామి అని, వారిని ఇలా టోర్నీ నుంచి పక్కన పెట్టడం ఏమాత్రం సరికాదని మండిపడ్డారు. బంగ్లాదేశ్‌కు అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే పాకిస్థాన్ కూడా ఈ టోర్నీ నుంచి తప్పుకుంటుందా? అనే ప్రశ్నకు నఖ్వీ చాలా వ్యూహాత్మక సమాధానం ఇచ్చారు. “మేము ఆడాలా వద్దా అనేది పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఒకవేళ మా ప్రభుత్వం వద్దు అని చెబితే, మేము రాము. అప్పుడు ఐసీసీ 22వ జట్టును (ఉగాండా వంటివి) టోర్నీలోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. దీని ద్వారా బంగ్లాదేశ్‌కు మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తూనే, ఐసీసీని, భారత బోర్డును పరోక్షంగా హెచ్చరించారు. పాక్ లేకపోతే టోర్నీకి ఉండే క్రేజ్, ఆదాయం తగ్గిపోతాయని ఆయన నర్మగర్భంగా గుర్తుచేశారు.
అంతేకాకుండా బంగ్లాదేశ్ అంశంలో ఐసీసీ ఏకపక్షంగా వ్యవహరించిందని నఖ్వీ ఆరోపించారు. పాక్ మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించే హైబ్రిడ్ మోడల్‌ను బంగ్లాదేశ్‌కు కూడా ఎందుకు వర్తింపజేయలేదని ఆయన ప్రశ్నించారు. ఈ నిర్ణయం వెనుక చాలా రాజకీయ కారణాలు ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు బయటపెడతానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి మాత్రం బంగ్లాదేశ్ పక్షాన నిలబడటమే తమ ప్రాధాన్యత అని నఖ్వీ స్పష్టం చేశారు.
మరోవైపు ఐసీసీ మాత్రం ఇప్పటికే స్కాట్లాండ్‌ను బంగ్లాదేశ్ స్థానంలో ఖరారు చేసింది. పాకిస్థాన్ ప్రభుత్వం గనుక టీమిండియా పర్యటనకు అనుమతి ఇవ్వకపోతే, ఆ స్థానంలో ఉగాండా జట్టును చేర్చడానికి కూడా ఐసీసీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ వివాదం వల్ల ఫిబ్రవరిలో జరగబోయే వరల్డ్ కప్ షెడ్యూల్ గందరగోళంలో పడింది. ఒకవేళ పాక్ కూడా రాకపోతే, టోర్నీలో భారత్ వర్సెస్ పాకిస్థాన్ వంటి హై-వోల్టేజ్ మ్యాచ్‌లు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఈ రచ్చ ఎటు దారితీస్తుందో చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
