ఏం తాగి కొట్టావ్ చిచ్చా.! 10 ఫోర్లు, 4 సిక్సర్లతో బౌలర్ల భరతం.. కట్ చేస్తే.. 39 బంతుల్లో
కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2025 రెండో మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ తన ప్రత్యర్ధి టీం సెయింట్ కిట్స్, నెవిస్ పేట్రియాట్స్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో అమెజాన్ వారియర్స్‌కు చెందిన ఆస్ట్రేలియన్ ఆటగాడు అద్భుతంగా రాణించాడు. ఆ వివరాలు..

కరేబియన్ గడ్డపై పాకిస్తాన్ బౌలర్లను ఉతికి ఆరేశాడు ఓ ఆస్ట్రేలియా వికెట్ కీపర్, బ్యాటర్. అదిరిపోయే హాఫ్ సెంచరీ చేయడమే కాదు.. తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈ ఆటగాడు వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్‌తో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడమే కాదు.. ఇంకా 16 బంతులు మిగిలి ఉండగానే టోర్నమెంట్‌లో తన జట్టుకు తొలి విజయాన్ని అందించాడు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్లు సీపీఎల్ 2025లో రెండో మ్యాచ్‌ను కేవలం 59 బంతుల్లో 114 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. ఈ సమయంలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ బెన్ మెక్‌డెర్మాట్ 10 ఫోర్లు, 4 సిక్సర్లతో అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించాడు. వెస్టిండీస్ కెప్టెన్ కూడా అజేయంగా అర్ధ సెంచరీ సాధించడం విశేషం.
బెన్ మెక్‌డెర్మాట్ విధ్వంసం..
CPL 2025లో రెండవ మ్యాచ్ సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్, గయానా అమెజాన్ వారియర్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఆండ్రీ ఫ్లెచర్ జట్టు తరపున అద్భుతంగా బ్యాటింగ్ చేసి 41 బంతుల్లో 60 పరుగులు చేశాడు. ఫ్లెచర్ తన ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్, ఐదు సిక్సర్లు బాదాడు. అతడితో పాటు యువ ఆటగాడు జైద్ గల్లీ 24 పరుగులు సాధించాడు. అమెజాన్ వారియర్స్ తరపున ఆల్ రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్ నాలుగు ఓవర్లలో 43 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టగా.. ఇమ్రాన్ తాహిర్ రెండు వికెట్లు తీశాడు. బెన్ మెక్‌డెర్మాట్ ఈ 153 పరుగుల లక్ష్యాన్ని అత్యంత ఈజీగా కానిచ్చేశాడు. ఐదు వికెట్ల తేడాతో తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అమెజాన్ వారియర్స్ తొలి వికెట్‌ను ముందుగానే కోల్పోయింది. కానీ ఆ తర్వాత బెన్ మెక్‌డెర్మాట్, షాయ్ హోప్‌తో కలిసి రెండో వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ భాగస్వామ్యంలో మెక్‌డెర్మాట్ 39 బంతుల్లో 75 పరుగులు చేసి భీకర ఇన్నింగ్స్ ఆడాడు. తన ఇన్నింగ్స్‌లో అమెజాన్ వారియర్స్ బౌలర్లలో ఎవరినీ వదిలిపెట్టలేదు. అలాగే ఈ ఇన్నింగ్స్‌లో డాషింగ్ బ్యాట్స్‌మెన్.. పాకిస్తాన్‌కు చెందిన అబ్బాస్ అఫ్రిది వేసిన ఒకే ఓవర్‌లో 21 పరుగులు చేశాడు. దీనితో పాటు అతడు నసీమ్ షాను బౌండరీలతో వెల్‌కమ్ చెప్పాడు.
బెన్ మెక్‌డెర్మాట్ మాత్రమే కాదు.. షాయ్ హోప్ 56 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. అతడు తన ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. మెక్‌డెర్మాట్ వికెట్ పడిన తర్వాత కూడా.. ఓ ఎండ్‌లో హోప్ వేగంగా పరుగులు రాబట్టాడు. తన జట్టును 16 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించాడు. ఆపై ఆల్ రౌండర్ మొయిన్ అలీ 19 పరుగులు చేసి అవుటయ్యాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఆ జట్టు తరఫున అబ్బాస్ అఫ్రిది రెండు ఓవర్లలో 24 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టగా.. నసీమ్ షా, ఫజల్హాక్ ఫరూఖీ, వకార్ సలాంఖేల్ చెరో వికెట్ తీశారు. ప్రారంభ ఓవర్లలో సెయింట్ కిట్స్ బౌలర్ నసీమ్ షా వేసిన ఓవర్‌లో బెన్ మెక్‌డెర్మాట్ క్యాచ్‌ను వదిలేశారు. ఆ సమయంలో అతడు 32 పరుగులు చేశాడు. ఆపై ఎవ్వరికీ ఛాన్స్ ఇవ్వకుండా బౌండరీల వర్షం కురిపించాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




