Test Debut : డెబ్యూలోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. టెస్ట్ అరంగేట్రంలోనే అదరగొట్టిన టాప్ ఇండియన్ క్రికెటర్ల లిస్ట్ ఇదే
Test Debut : ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ డెబ్యూ మ్యాచ్‌లో మనవ్ సుతార్ అద్భుత ప్రదర్శన చేశాడు. 7 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచాడు. ఈ ఘనతతో అతను భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించాడు.

Test Debut : భారత లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ మానవ్ సుతార్ తన అంతర్జాతీయ టెస్ట్ కెరీర్‌ను అద్భుతమైన రికార్డుతో ప్రారంభించాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో ముల్లన్‌పూర్‌లో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్, 300 పరుగుల భారీ విజయం సాధించడంలో ఈ 23 ఏళ్ల రాజస్థాన్ స్పిన్నర్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 7 వికెట్లు పడగొట్టిన మానవ్‌కు అరంగేట్రం మ్యాచ్‌లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. దీంతో టెస్ట్ డెబ్యూలోనే ఈ ఘనత సాధించిన అతికొద్ది మంది భారతీయ దిగ్గజాల సరసన అతను చేరిపోయాడు.
ఆఫ్ఘన్ బ్యాటర్లను వణికించిన బౌలింగ్
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శుభ్‌మన్ గిల్ సేన మొదటి ఇన్నింగ్స్‌లో 568 పరుగుల భారీ స్కోరు చేసి డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఆఫ్ఘనిస్తాన్‌కు మానవ్ సుతార్ తన స్పిన్ మాయాజాలంతో చుక్కలు చూపించాడు. హర్ష్ దూబే స్థానంలో జట్టులోకి వచ్చిన ఈ యువ ఆటగాడు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 33 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇది భారతదేశం తరఫున ఒక లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్‌కు అరంగేట్రం మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ రికార్డు కావడం విశేషం. అతని ధాటికి ఆఫ్ఘన్ తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే కుప్పకూలింది.
రెండో ఇన్నింగ్స్‌లో సీనియర్ల జోరు
భారత్ ఫాలో-ఆన్ ఇవ్వడంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ జట్టును మిగతా బౌలర్లు దెబ్బకొట్టారు. ఈ ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ చెలరేగిపోయి 7 వికెట్లు పంచుకున్నారు. మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్ చెరో వికెట్ తీశారు. ఆఫ్ఘన్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 112 పరుగులకే పరిమితమై భారీ పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో మానవ్ కేవలం బౌలింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్‌లోనూ లోయర్ ఆర్డర్‌లో వచ్చి కీలకమైన 28 పరుగులు చేసి తనేంటో నిరూపించుకున్నాడు.
జడేజాకు సరైన వారసుడు దొరికాడా?
రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ల తర్వాత భారత స్పిన్ విభాగాన్ని నడిపించే వారెవరు అనే ప్రశ్నకు మానవ్ సుతార్ పర్ఫెక్ట్ సమాధానంలా కనిపిస్తున్నాడు. జడేజా లాగే సాంప్రదాయ స్పిన్ వేయడంతో పాటు, అవసరమైనప్పుడు బంతిని గాల్లోకి లేపి బ్యాటర్లను బోల్తా కొట్టించగల సామర్థ్యం ఇతనికి ఉంది. పిచ్ ఎలాంటిదైనా సరే వికెట్లు తీయగలనని ఈ మ్యాచ్‌తో మానవ్ నిరూపించాడు. లోయర్ ఆర్డర్‌లో మంచి బ్యాటింగ్ నైపుణ్యం కూడా ఉండటంతో టీమిండియాకు భవిష్యత్తులో ఒక మంచి ఆల్‌రౌండర్ దొరికినట్లయింది.
డెబ్యూ మ్యాచ్‌లోనే అవార్డు గెలిచిన భారతీయులు
టెస్ట్ క్రికెట్ హిస్టరీలో అరంగేట్రం మ్యాచ్‌లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న 9వ భారతీయ క్రికెటర్‌గా మానవ్ సుతార్ రికార్డులకు ఎక్కాడు. అలాగే అశ్విన్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. గతంలో ఈ అరుదైన రికార్డు సాధించిన వారి వివరాలను పరిశీలిస్తే.. 1992లో సౌతాఫ్రికాపై డర్బన్‌లో ప్రవీణ్ ఆమ్రే, 2006లో పాకిస్తాన్‌పై ఫైసలాబాద్‌లో ఆర్పీ సింగ్, 2011లో వెస్టిండీస్‌పై ఢిల్లీలో రవిచంద్రన్ అశ్విన్ ఈ అవార్డులు అందుకున్నారు.
శిఖర్ ధావన్ నుంచి యశస్వి జైస్వాల్ వరకు
ఆ తర్వాత 2013లో ఆస్ట్రేలియాపై మొహాలీలో శిఖర్ ధావన్, అదే ఏడాది 2013లో వెస్టిండీస్‌పై కోల్‌కతాలో రోహిత్ శర్మ తమ డెబ్యూ మ్యాచ్‌లోనే మ్యాచ్ విన్నర్లుగా నిలిచారు. అనంతరం 2018లో వెస్టిండీస్‌పై హైదరాబాద్‌లో పృథ్వీ షా, 2021లో న్యూజిలాండ్‌పై కాన్పూర్‌లో శ్రేయాస్ అయ్యర్, 2023లో వెస్టిండీస్‌పై రోసౌలో యశస్వి జైస్వాల్ ఈ అద్భుత ఫీట్ సాధించారు. ఇప్పుడు 2026లో ఆఫ్ఘనిస్తాన్‌పై ముల్లన్‌పూర్‌లో జరిగిన మ్యాచ్ ద్వారా మానవ్ సుతార్ ఈ లీగ్‌లో చేరాడు.
దేశీవాళీ క్రికెట్ నుంచి అంతర్జాతీయ స్థాయికి
రాజస్థాన్‌కు చెందిన మానవ్ సుతార్ డొమెస్టిక్ క్రికెట్‌లో కఠినంగా శ్రమించి ఈ స్థాయికి చేరుకున్నాడు. ఇప్పటివరకు అతను 30 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి 24.89 అద్భుతమైన యావరేజ్‌తో 136 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లోనూ ఒక సెంచరీ, ఆరు హాఫ్ సెంచరీలతో 973 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున 4 మ్యాచ్‌లు ఆడి ఒత్తిడిని ఎలా జయించాలో నేర్చుకున్నాడు. భారత్‌కు నవంబర్‌లో న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ఉన్నందున, మానవ్ తన నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుని జట్టులో శాశ్వత స్థానం కోసం ప్రయత్నిస్తున్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
