Kuldeep Yadav : కుల్దీప్ యాదవ్ మాయాజాలం.. ఢిల్లీ టెస్టులో వరల్డ్ రికార్డ్ బ్రేక్
భారత్, వెస్టిండీస్ మధ్య ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట పూర్తిగా కుల్దీప్ యాదవ్‌దే. రెండో రోజు ఒక వికెట్ తీసిన అతను, మూడో రోజు ఆరంభం నుంచే విండీస్ బ్యాటర్లపై విరుచుకుపడ్డాడు. తన తొలి ఓవర్‌లోనే షాయ్ హోప్‌ను పెవిలియన్‌కు పంపి శుభారంభం ఇచ్చాడు.

Kuldeep Yadav : టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన మణికట్టు మాయాజాలంతో వెస్టిండీస్‌ను చిత్తు చేశాడు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో తన స్పిన్ ఉచ్చులో విండీస్ బ్యాటర్లను బంధించి, ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ అద్భుత ప్రదర్శనతో తన టెస్ట్ కెరీర్‌లో ఐదోసారి ఈ ఘనతను అందుకున్నాడు. అంతేకాదు, ఈ స్పెల్‌తో ఓ అరుదైన ప్రపంచ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుని చరిత్ర సృష్టించాడు. కుల్దీప్ దెబ్బకు విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ ఎలా కుప్పకూలిందో, అతను సృష్టించిన రికార్డులేంటో వివరంగా చూద్దాం.
భారత్, వెస్టిండీస్ మధ్య ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట పూర్తిగా కుల్దీప్ యాదవ్‌దే. రెండో రోజు ఒక వికెట్ తీసిన అతను, మూడో రోజు ఆరంభం నుంచే విండీస్ బ్యాటర్లపై విరుచుకుపడ్డాడు. తన తొలి ఓవర్‌లోనే షాయ్ హోప్‌ను పెవిలియన్‌కు పంపి శుభారంభం ఇచ్చాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే టెవిన్ ఇమ్లాచ్‌ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. ఆ తర్వాత జస్టిన్ గ్రీవ్స్‌ను కూడా ఔట్ చేసి విండీస్ పతనానికి నాంది పలికాడు. చివరికి జేడెన్ సీల్స్‌ను ఔట్ చేయడం ద్వారా తన ఐదు వికెట్ల హాల్‌ను పూర్తి చేసుకున్నాడు. కుల్దీప్ విజృంభణతో వెస్టిండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 248 పరుగులకే ఆలౌట్ అయింది.
ఈ ప్రదర్శనతో కుల్దీప్ యాదవ్ ఓ అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా ఐదుసార్లు 5 వికెట్ల హాల్ సాధించిన ఎడమచేతి వాటం స్పిన్నర్‌గా కుల్దీప్ చరిత్ర సృష్టించాడు. కుల్దీప్ ఈ ఘనతను కేవలం తన 15వ టెస్టు మ్యాచ్‌లోనే అందుకున్నాడు. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్‌కు చెందిన జానీ వార్డిల్ పేరిట ఉండేది. అతను ఈ ఫీట్‌ను తన 28వ టెస్టులో సాధించాడు. ఇప్పుడు కుల్దీప్ ఆ రికార్డును సునాయాసంగా అధిగమించాడు.
5⃣-fer x 5⃣ times
Kuldeep Yadav gets his fifth five-wicket haul in Tests! 👏
A wonderful performance from him yet again 🔝
Updates ▶ https://t.co/GYLslRzj4G#TeamIndia | #INDvWI | @IDFCFIRSTBank | @imkuldeep18 pic.twitter.com/BUhPgnIVt6
— BCCI (@BCCI) October 12, 2025
రికార్డుల మోత మోగించిన చైనామన్
ఈ ప్రపంచ రికార్డుతో పాటు కుల్దీప్ మరిన్ని ఘనతలు కూడా సాధించాడు. షాయ్ హోప్‌ను వన్డేలు , టెస్టుల్లో 3 సార్లు ఔట్ చేసిన ప్రపంచంలోనే ఏకైక బౌలర్‌గా నిలిచాడు. ఈ ఏడాది (2025) అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు నంబర్-1 స్థానంలో ఉన్న వరుణ్ చక్రవర్తిని వెనక్కి నెట్టి కుల్దీప్ టాప్‌లోకి వచ్చాడు.
2025లో అత్యధిక వికెట్లు తీసిన భారత స్పిన్నర్లు:
కుల్దీప్ యాదవ్ – 35*
వరుణ్ చక్రవర్తి – 31*
రవీంద్ర జడేజా – 25*
అక్షర్ పటేల్ – 20*
వాషింగ్టన్ సుందర్ – 11*
భారత జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధారంగా 270 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించి, వెస్టిండీస్‌ను ఫాలో-ఆన్‌కు ఆహ్వానించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




