AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. 3 టెస్ట్‌ల్లోనూ విఫలం.. జట్టు నుంచి తప్పించడంతో వెక్కివెక్కి ఏడ్చిన కరుణ్..

Karun Nair Photo Viral: ఇప్పటికే మూడు అవకాశాలు వచ్చినా కరుణ్ నాయర్ తనను తాను నిరూపించుకోలేకపోవడంతో, అతని టెస్ట్ కెరీర్ ఇక ముగిసినట్టేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మాజీ క్రికెటర్లు సైతం కరుణ్ నాయర్ స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు.

8 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. 3 టెస్ట్‌ల్లోనూ విఫలం.. జట్టు నుంచి తప్పించడంతో వెక్కివెక్కి ఏడ్చిన కరుణ్..
Ind Vs Eng 4th Test Karun Nair Kl Rahul
Venkata Chari
|

Updated on: Jul 25, 2025 | 5:16 PM

Share

భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో బ్యాట్స్‌మెన్ కరుణ్ నాయర్. కానీ, అతని కెరీర్ ఆ ట్రిపుల్ సెంచరీ తర్వాత అనుకున్న విధంగా సాగలేదు. దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత టెస్ట్ జట్టులోకి పునరాగమనం చేసిన కరుణ్ నాయర్‌కు చేదు అనుభవమే మిగిలింది. తాజాగా, జట్టు నుంచి తప్పించిన తర్వాత అతను కన్నీళ్లు పెట్టుకోవడం, అతని చిన్ననాటి స్నేహితుడు కేఎల్ రాహుల్ ఓదార్చడం నెటిజన్లను ఉద్వేగానికి గురి చేస్తోంది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎనిమిదేళ్ల తర్వాత పునరాగమనం, నిరాశపరిచిన ప్రదర్శన..

2016లో ఇంగ్లండ్‌పై ట్రిపుల్ సెంచరీ సాధించిన తర్వాత కరుణ్ నాయర్ భారత జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన అతను, దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనలతో మళ్లీ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడం, దేశవాళీలో నాయర్ నిలకడైన ఆటతీరు కనబరచడం వంటి కారణాలతో, దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రస్తుత టెస్ట్ సిరీస్‌తో భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.

అయితే, ఈ రీఎంట్రీ కరుణ్ నాయర్‌కు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టుతో బరిలోకి దిగిన కరుణ్ నాయర్, తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయి తీవ్ర నిరాశపరిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులు మాత్రమే చేశాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులోనూ 31, 26 పరుగులతో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 40 పరుగులు చేసి కాస్త ఆశలు రేపినా, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 14 పరుగులు చేసి నిష్క్రమించాడు.

కన్నీళ్లు పెట్టుకున్న కరుణ్ నాయర్, ఓదార్చిన కేఎల్ రాహుల్..

మూడు టెస్టుల్లో నిలకడగా రాణించలేకపోవడంతో, నాలుగో టెస్ట్ (మాంచెస్టర్) నుంచి కరుణ్ నాయర్‌ను పక్కన పెట్టారు. అతని స్థానంలో యువ బ్యాట్స్‌మెన్ బి. సాయి సుదర్శన్‌కు అవకాశం కల్పించారు. జట్టు నుంచి తప్పించిన తర్వాత కరుణ్ నాయర్ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నాడని, అతని చిన్ననాటి స్నేహితుడు, సహచర ఆటగాడు కేఎల్ రాహుల్ అతన్ని ఓదార్చాడని చూపిస్తున్న ఒక ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఫొటో క్రికెట్ అభిమానులను కలచివేసింది. ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడికి ఇలాంటి పరిస్థితి రావడంపై చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఈ ఫోటో మాంచెస్టర్ టెస్ట్ సమయంలో తీసింది కాదని, లార్డ్స్ టెస్ట్ సందర్భంగా తీసినదని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఏది ఏమైనా, ఈ ఫొటో కరుణ్ నాయర్ అనుభవిస్తున్న మానసిక సంఘర్షణకు, జట్టులో చోటు కోల్పోవడం వల్ల కలిగిన ఆవేదనకు అద్దం పడుతోంది.

భవిష్యత్తుపై ప్రశ్నార్థకం..

ఇప్పటికే మూడు అవకాశాలు వచ్చినా కరుణ్ నాయర్ తనను తాను నిరూపించుకోలేకపోవడంతో, అతని టెస్ట్ కెరీర్ ఇక ముగిసినట్టేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మాజీ క్రికెటర్లు సైతం కరుణ్ నాయర్ స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు. ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత వచ్చిన ఈ అవకాశం కూడా సద్వినియోగం చేసుకోలేకపోవడంతో కరుణ్ నాయర్ క్రికెట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ దశలో కేఎల్ రాహుల్ లాంటి సన్నిహితుడు అతనికి అండగా నిలవడం, ఓదార్చడం క్రికెట్ లోని స్నేహబంధానికి నిదర్శనం.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..