Mitchell Starc Breaks Brett Lee Record: ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభమైంది. అయితే, సోమవారం ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో పాక్ జట్టును ఓడించిన ఆస్ట్రేలియా జట్టు సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ తన పేరిట ఓ ప్రత్యేక రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఆస్ట్రేలియా గడ్డపై 100 వన్డే వికెట్లు పూర్తి చేశాడు. దీంతో తన పేరిట ఓ భారీ రికార్డు లిఖించుకున్నాడు.
తన దేశం ఆస్ట్రేలియాలో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా మిచెల్ స్టార్క్ నిలిచాడు. స్టార్క్ తన 54వ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాలో 100 వన్డే వికెట్లు పూర్తి చేసి మాజీ కంగారూ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ రికార్డును బద్దలు కొట్టాడు. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్లలో ఒకరైన బ్రెట్ లీ తన దేశంలో 55 ఇన్నింగ్స్‌లలో 100 వన్డే వికెట్లు పూర్తి చేశాడు. అయితే, అతని కంటే ఒక ఇన్నింగ్స్ తక్కువ ఆడి స్టార్క్ ఈ ఘనత సాధించాడు.
ఆస్ట్రేలియాకు చెందిన ఈ స్టార్ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ ఫాస్టెస్ట్ 100 వికెట్ల రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా స్వదేశంలో అత్యధిక వన్డే వికెట్లు తీసిన ఆస్ట్రేలియా తరపున ఐదో బౌలర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 3 వికెట్లు సాధించడం ద్వారా, అతను స్వదేశంలో 102 వన్డే వికెట్లు పూర్తి చేశాడు. 101 వికెట్లతో స్టీవ్ వా రికార్డును అధిగమించాడు.
ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో తొలి వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి 10 ఓవర్లలో 33 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అబ్దుల్లా షఫీక్, సామ్ అయూబ్, షాహీన్ షా అఫ్రిది వికెట్లు పడగొట్టాడు. అతని అద్భుత బౌలింగ్ కారణంగా పాక్ జట్టు 203 పరుగులకే ఆలౌట్ అయింది.
మిచెల్ స్టార్క్- 54 ఇన్నింగ్స్‌లు
బ్రెట్ లీ – 55 ఇన్నింగ్స్‌లు
గ్లెన్ మెక్‌గ్రాత్ – 56 ఇన్నింగ్స్‌లు
షేన్ వార్న్ – 61 ఇన్నింగ్స్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..