Ishan Kishan: బీసీసీఐ ఛీ కొట్టింది.. కట్‌చేస్తే.. ఇంగ్లండ్ ఫ్లైట్ ఎక్కిన టీమిండియా క్రికెటర్.. ఎందుకంటే?
India vs England: ఇషాన్ కిషన్ ఈ నిర్ణయం అతని రెడ్ బాల్ కెరీర్‌కు ఊతమిస్తుందని, భవిష్యత్తులో తిరిగి భారత టెస్ట్ జట్టులోకి రావడానికి ఇది ఒక మార్గంగా మారుతుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ వంటి భారత యువ ఆటగాళ్లు కౌంటీ క్రికెట్‌లో ఆడుతున్నారు.

India vs England Test Series: భారత యువ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్, ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు నుంచి దూరమైన తర్వాత, తన రెడ్ బాల్ క్రికెట్ కెరీర్‌ను తిరిగి గాడిలో పెట్టుకోవడానికి ఇంగ్లాండ్‌లోని కౌంటీ క్రికెట్‌లో చేరాడు. అతను నాటింగ్‌హామ్‌షైర్ క్రికెట్ క్లబ్‌తో స్వల్పకాలిక ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ నెలలో రెండు కౌంటీ మ్యాచ్‌లలో ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.
గత కొంతకాలంగా ఇషాన్ కిషన్ భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. 2023 నవంబర్‌లో ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్‌లో చివరిసారిగా ఆడాడు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడకుండా గైర్హాజరు కావడంతో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కూడా కోల్పోయాడు. అయినప్పటికీ, ఈ ఏడాది తిరిగి తన కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు బీసీసీఐ ఇషాన్ కిషన్‌ను సంప్రదించినప్పటికీ, టెస్ట్ క్రికెట్ ఆడేందుకు తాను ఇంకా సిద్ధంగా లేనని అతను చెప్పినట్లు నివేదికలు వచ్చాయి. దీంతో, ధ్రువ్ జురెల్ బ్యాకప్ వికెట్ కీపర్‌గా జట్టులోకి వచ్చాడు.
ఇప్పుడు, నాటింగ్‌హామ్‌షైర్ తరపున కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడటం ద్వారా ఇంగ్లాండ్ పరిస్థితుల్లో తన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇషాన్ కిషన్ సిద్ధంగా ఉన్నాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు కైల్ వెర్రెయన్నే స్థానంలో అతను నాటింగ్‌హామ్‌షైర్ జట్టులోకి వచ్చాడు. జూన్ 22 నుంచి యార్క్‌షైర్‌తో, జూన్ 29 నుంచి సోమర్‌సెట్‌తో జరగనున్న మ్యాచ్‌లలో ఇషాన్ కిషన్ ఆడనున్నాడు. కౌంటీ క్రికెట్ ఆడటం ఇషాన్ కిషన్‌కు ఇదే మొదటిసారి.
“ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడటం నాకు చాలా ఉత్సాహంగా ఉంది. నా నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది ఒక గొప్ప అవకాశం” అని ఇషాన్ కిషన్ నాటింగ్‌హామ్‌షైర్ వెబ్‌సైట్‌లో పేర్కొన్నాడు. “నేను ఉత్తమ క్రికెటర్‌గా మారాలని కోరుకుంటున్నాను, ఇంగ్లండ్ పరిస్థితుల్లో ఆడటం నాకు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి నిజంగా సహాయపడుతుంది. ట్రెంట్ బ్రిడ్జ్ ఇండియాలో, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మైదానం, అక్కడ ఆడటం నాకు చాలా ఉత్సాహంగా ఉంది.” అని చెప్పుకొచ్చాడు.
ఇషాన్ కిషన్ ఈ నిర్ణయం అతని రెడ్ బాల్ కెరీర్‌కు ఊతమిస్తుందని, భవిష్యత్తులో తిరిగి భారత టెస్ట్ జట్టులోకి రావడానికి ఇది ఒక మార్గంగా మారుతుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ వంటి భారత యువ ఆటగాళ్లు కౌంటీ క్రికెట్‌లో ఆడుతున్నారు. ఇషాన్ కిషన్ కూడా వారి బాటలోనే నడవటం, ఇది భారత క్రికెట్‌లో యువ ఆటగాళ్లు తమ రెడ్ బాల్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి చూపిస్తున్న ఆసక్తిని సూచిస్తుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








