
MS Dhoni Retirement : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌కు సమయం దగ్గర పడుతోంది. మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న ఈ క్రికెట్ పండగలో తొలి పోరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరగనుంది. అయితే మ్యాచ్‌లు ఎవరి మధ్య జరిగినా, అందరి కళ్లు మాత్రం ఒకే ఒక్కడిపై ఉన్నాయి.. ఆయనే చెన్నై సూపర్ కింగ్స్ తలా ఎంఎస్ ధోని. తన ఐపీఎల్ కెరీర్‌లో వరుసగా 19వ సీజన్ ఆడేందుకు సిద్ధమవుతున్న ధోని, ఇప్పటికే సీఎస్‌కే ట్రైనింగ్ క్యాంప్‌లో చేరి నెట్స్‌లో చెమటోడుస్తున్నారు. ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ గురించి మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాయి.
జియో హాట్‌స్టార్‌లో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. ఎంఎస్ ధోని లేని చెన్నై సూపర్ కింగ్స్‌ను ఊహించుకోవడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. అయితే ఇదే ధోనికి చివరి ఐపీఎల్ సీజన్ కావచ్చని ఆయన జోస్యం చెప్పారు. 2026 సీజన్ ముగిసిన తర్వాత ధోని పసుపు రంగు జెర్సీని శాశ్వతంగా వదిలేసి, ఆటకు వీడ్కోలు పలికే అవకాశం ఉందని పఠాన్ పేర్కొన్నారు. ధోని లేకుండా ఐపీఎల్ కళ తప్పుతుందని, కానీ కాలక్రమేణా మార్పులు తప్పవని ఆయన అన్నారు. ఈ వార్త విన్న ధోని అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నప్పటికీ, చివరిసారిగా తమ అభిమాన ఆటగాడిని మైదానంలో చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు.
ఈసారి సీఎస్‌కే జట్టులో కొన్ని ఆసక్తికర మార్పులు చోటుచేసుకున్నాయి. టీమిండియా వరల్డ్ కప్ హీరో సంజూ శాంసన్ ఈ సీజన్‌లో చెన్నై జట్టులో చేరడం విశేషం. దీనిపై పఠాన్ స్పందిస్తూ.. ధోని లాంటి లెజెండ్ పక్కన ఉండటం వల్ల సంజూ శాంసన్‌కు చాలా లాభం జరుగుతుందని చెప్పారు. జట్టును ఎలా నడిపించాలి, క్లిష్ట సమయాల్లో ఎలా నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయాలను సంజూ నేర్చుకుంటాడని పఠాన్ అన్నారు. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ, డ్రెస్సింగ్ రూమ్‌లో ధోని ఉనికి జట్టులోని భవిష్యత్తు తరాన్ని తీర్చిదిద్దడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన వివరించారు.
అయితే, గత సీజన్లలో ధోని మోకాలి గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. దీనివల్ల 2026లో కూడా ఆయన కొన్ని మ్యాచ్‌లకే పరిమితమవుతారా? అనే అనుమానాలు తలెత్తాయి. వీటన్నిటికీ సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్ క్లారిటీ ఇచ్చారు. ఎంఎస్ ధోని పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని, ఈ సీజన్ లోని అన్ని మ్యాచ్‌లకు ఆయన అందుబాటులో ఉంటాడని స్పష్టం చేశారు. దీంతో తలా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తన ట్రేడ్‌మార్క్ హెలికాప్టర్ షాట్లతో ధోని మరోసారి స్టేడియాన్ని హోరెత్తిస్తాడని అందరూ ఆశిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..