బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ప్రారంభానికి పెర్త్ టెస్టు రికార్డు స్థాయిలో హాజరును ఆకర్షించింది, ఇది క్రికెట్ ప్రేమికుల ఉత్సాహాన్ని చాటిచెబుతోంది. పెర్త్ స్టేడియం తొలిరోజు 31,302 మంది ప్రేక్షకులతో టెస్టు క్రికెట్‌కు సంబంధించి అత్యధిక హాజరు రికార్డును నెలకొల్పింది. రెండోరోజు ఈ సంఖ్య 32,368కు చేరగా, మొత్తం 96,463 మంది హాజరు నమోదైంది. ఇది ఇప్పటివరకు పెర్త్‌లో నమోదైన రెండవ అత్యధిక మొత్తం హాజరుగా నిలిచింది.
సిరీస్ ప్రారంభంతో టీవీ రేటింగ్‌లు, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, డిజిటల్ ఛానెల్‌లు విస్తృతమైన వినియోగదారులను ఆకర్షించాయి. పెర్త్ టెస్ట్ మొదటి మూడు రోజులలో టీవీ రేటింగ్‌లలో ఆధిపత్యం కొనసాగగా, 1.6 మిలియన్ వీక్షకులతో తొలి రోజు మూడో సెషన్ అత్యధిక ప్రేక్షకులను రాబట్టింది. క్రికెట్ ఆస్ట్రేలియా డేటా ప్రకారం, ఈ టెస్టుకు సగటు వీక్షణలో 30% వృద్ధి నమోదైంది.
డిజిటల్ ఛానెల్‌లలో క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త రికార్డులను సృష్టించింది. cricket.com.au, లైవ్ యాప్‌ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా 8.4 మిలియన్ల వినియోగదారులు సిరీస్‌ను అనుసరించగా, ఆస్ట్రేలియాలోని 2.7 మిలియన్ల మంది వీక్షకులగా నిలిచారు. వీక్షించిన వీడియోల సంఖ్య కూడా 30% పెరిగింది, గత సీజన్‌తో పోల్చితే ఇది క్రికెట్‌కు పెరుగుతున్న ఆసక్తిని సూచిస్తుంది.
సోషల్ మీడియా ద్వారా 259 మిలియన్ వీడియో వీక్షణలను సాధించడంతో ఈ సిరీస్ గ్లోబల్ స్థాయిలో మరింత ప్రసిద్ధి చెందింది. పెర్త్ టెస్టుతో మొదలైన ఈ ఉత్సాహం అడిలైడ్, మెల్‌బోర్న్, సిడ్నీ టెస్టుల వరకు కొనసాగుతుందనే అంచనాలు ఉన్నాయి. సిరీస్ మొత్తం అభిమానులను మరింత క్రికెట్ ఆనందంలో ముంచెత్తే అవకాశముంది.
బుమ్రా నాయకత్వంలో భారత జట్టు మొదటి టెస్ట్ ను 295 పరుగుల తేడాతో విజయం సాధించి ఈ 5 మ్యాచ్ ల సిరీస్ లో 1-0 ఆధిక్యంతో నిలిచింది.