
Shubman Gill Catch : ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ ముగింపు మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ అద్భుత ప్రదర్శనతో అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఈ కీలక పోరులో గుజరాత్ 89 పరుగుల భారీ తేడాతో ఘోర విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో చెన్నై జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించగా, గుజరాత్ ప్లేఆఫ్స్ రేసులో టాప్-2 స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గిల్ బ్యాట్‌తో 64 పరుగులు చేయడమే కాకుండా, మైదానంలో ఒక కళ్లు చెదిరే క్యాచ్, అలాగే ఊహించని రనౌట్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.
చెన్నై ఇన్నింగ్స్ సమయంలో స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడుతూ మ్యాచ్‌ను చెన్నై వైపు తిప్పే ప్రయత్నం చేశాడు. కేవలం 16 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో దూబే ప్రమాదకరంగా మారాడు. ఈ దశలో ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన రషీద్ ఖాన్ బౌలింగ్‌లో దూబే భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే బంతి సరిగ్గా బ్యాట్‌కు కనెక్ట్ కాకపోవడంతో కవర్స్ ఏరియాలో గాల్లోకి లేచింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వెనక్కి పరుగెత్తుకుంటూ వెళ్లడమే కాకుండా, ఊహించని రీతిలో గాల్లోకి డైవ్ చేస్తూ ఆ క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ సూపర్‌మ్యాన్ క్యాచ్ చూసి స్టేడియంలోని అభిమానులతో పాటు చెన్నై బ్యాటర్లు సైతం నోరెళ్లబెట్టారు. ఈ వికెట్ పడగానే గిల్ ఎమోషనల్ అవుతూ చేసిన అగ్రెసివ్ సెలబ్రేషన్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
అంతకుముందు చెన్నై బ్యాటింగ్ లైన్‌అప్‌ను దెబ్బతీయడంలో గిల్ రనౌట్ కీలక పాత్ర పోషించింది. క్రీజులో ఉన్న కార్తీక్ శర్మ, గిల్ వైపు బంతిని నెట్టి సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. అయితే అంతే వేగంగా స్పందించిన గుజరాత్ కెప్టెన్ చిరుతపులిలా బంతిపైకి దూకి, సింగిల్ స్టంప్‌ను టార్గెట్ చేస్తూ డైరెక్ట్ హిట్ కొట్టాడు. గిల్ విసిరిన త్రో నేరుగా వికెట్లను తాకడంతో కార్తీక్ శర్మ (19 రన్స్) కథ ముగిసింది. ఇలా ఒకే మ్యాచ్‌లో అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు ఫీల్డింగ్‌లోనూ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి గిల్ జట్టును ముందుండి నడిపించాడు.
WE ARE OUT OF WORDS! 🤯
Shubman Gill with Catch of the Season contender 🫡
Updates ▶️ https://t.co/p5TP9NLREX #TATAIPL | #KhelBindaas | #GTvCSK | @ShubmanGill pic.twitter.com/iuwx06Ln6B
— IndianPremierLeague (@IPL) May 21, 2026
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 229 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు సాయి సుదర్శన్ 84 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, గిల్ 64 పరుగులు చేశాడు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 125 పరుగులు జోడించారు. ఆఖరిలో జోస్ బట్లర్ కేవలం 27 బంతుల్లోనే 57 పరుగులతో చెలరేగిపోయాడు. అనంతరం 230 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన చెన్నైని గుజరాత్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, కగిసో రబాడా, రషీద్ ఖాన్ చెరో 3 వికెట్లతో దెబ్బకొట్టారు. దీంతో చెన్నై కేవలం 140 పరుగులకే ఆలౌట్ అయి టోర్నీ నుంచి వైదొలిగింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..