IPL 2026 RCB : కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఆర్సీబీ ఫ్యాన్స్‌కు ఇది అదిరిపోయే గుడ్ న్యూస్

IPL 2026 RCB : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు ఎట్టకేలకు ఒక భారీ ఊరట లభించింది. ఐపీఎల్ 2026 సీజన్ కు సంబంధించి బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ లు నిర్వహించుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా అనుమతిని ఇచ్చింది.

IPL 2026 RCB  : కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఆర్సీబీ ఫ్యాన్స్‌కు ఇది అదిరిపోయే గుడ్ న్యూస్
Ipl 2026 Chinnaswamy Stadium

Updated on: Mar 16, 2026 | 4:37 PM

IPL 2026 RCB : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు ఎట్టకేలకు ఒక భారీ ఊరట లభించింది. ఐపీఎల్ 2026 సీజన్ కు సంబంధించి బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ లు నిర్వహించుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా అనుమతిని ఇచ్చింది. గత ఏడాది కొన్ని చేదు అనుభవాల వల్ల స్టేడియంలో మ్యాచ్ ల నిర్వహణపై సందిగ్ధత నెలకొన్నప్పటికీ, ఇప్పుడు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బెంగళూరు అంతటా పండగ వాతావరణం నెలకొంది. మార్చి 28న ఈ మైదానంలోనే డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య తొలి పోరు జరగనుంది.

కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) కార్యదర్శి సంతోష్ మీనన్ ఈ విషయాన్ని ధృవీకరించారు. స్టేడియంలో భద్రత, మౌలిక సదుపాయాల్లో మార్పులను పర్యవేక్షించడానికి నియమించిన నిపుణుల కమిటీ, స్టేడియాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసింది. మార్చి 13న స్టేడియంలో నిర్వహించిన మాక్ డ్రిల్, ఇతర భద్రతా చర్యల పట్ల కమిటీ సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం తాజాగా అనుమతులు మంజూరు చేసింది.

కర్ణాటక హోం మంత్రి డాక్టర్ జి. పరమేశ్వర అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో కేఎస్‌సీఏ ప్రతినిధులతో పాటు ఆర్సీబీ మేనేజ్‌మెంట్, భద్రతా నిపుణులు పాల్గొన్నారు. స్టేడియం లోపల, వెలుపల ప్రేక్షకుల నియంత్రణ, అత్యవసర మార్గాలు, కొత్త భద్రతా నిబంధనల అమలుపై సమగ్రంగా చర్చించారు. నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు స్టేడియం ఇప్పుడు పూర్తి సురక్షితమని హోం మంత్రి ప్రకటించారు.

నిజానికి, గత సీజన్ (2025)లో ఆర్సీబీ తన మొట్టమొదటి ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత బెంగళూరులో నిర్వహించిన విక్టరీ పరేడ్ లో తీవ్ర విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. దాని ప్రభావంతోనే 2026 టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లను కూడా బెంగళూరు నుంచి ఇతర నగరాలకు తరలించాల్సి వచ్చింది. అయితే, ఇప్పుడు లోటుపాట్లన్నీ సరిదిద్దడంతో మళ్ళీ ఐపీఎల్ హంగామాకు చిన్నస్వామి స్టేడియం ముస్తాబైంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us