IPL చాలా మంది ఆటగాళ్ల జీవితాలను మార్చేసింది. అందులో దక్షిణాఫ్రికా స్టార్ ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ కూడా ఒకడు. మోరిస్ ఇప్పుడు IPL ఆడడం లేదు కానీ అతను ఈ లీగ్‌లో భాగమైనప్పుడు భారీ ధరకు అమ్ముడుపోయాడు. దీంతో మోరిస్ దశ తిరిగింది. ఆల్ రౌండర్ గా ధనాధన్ లీగ్ లో సత్తా చాటిన అతను జాతీయ జట్టులో కూడా స్థానం సంపాదించుకున్నాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అతను తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇదే ఐపీఎల్ మొదటి సంపాదనతో తన తల్లిదండ్రుల అప్పులన్నీ తీర్చేశానంటూ అప్పటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నాడు. IPL 2013 సీజన్ లో మోరిస్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే IPL 2021 లోనే అతని పేరు బాగా మార్మోగింది. ఆ ఏడాది వేలంలో రాజస్థాన్ రాయల్స్ అతనిని రూ 16.25 కోట్ల రూపాయలు వెచ్చించి మరీ కొనుగోలు చేసింది. తద్వారా ఆ సీజన్ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు మోరిస్.
క్రిస్ మోరిస్ ఐపీఎల్‌లో తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగాడు. అప్పుడు సీఎస్‌కే అతడిని రూ.4 కోట్ల 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఆ మొత్తంతో తన తల్లిదండ్రుల అప్పులన్నీ తీర్చేశాడట మోరిస్. క్రిస్ మోరిస్ తండ్రి విల్లీ మోరిస్ కూడా క్రికెటర్. అయితే అతనికి దక్షిణాఫ్రికా జట్టుకు ఆడే అవకాశం రాలేదు. అందుకే తన కొడుక్కి అలా జరగకూడదనుకున్నాడు. మోరిస్‌ను మెరుగైన క్రికెటర్‌గా మార్చడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. పట్టు బట్టీ మరీ బలవంతంగా క్రికెస్ ప్రాక్టీస్ కు తీసుకెళ్లాడు. మోరిస్ కూడా తన తండ్రి కష్టాన్ని వృథా పోనియ్యలేదు.
క్రిస్ మోరిస్ ఇప్పుడు క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ తీసుకున్నాడు. కానీ, ఐపీఎల్‌లో అత్యధిక స్ట్రైక్‌రేట్‌తో ఇన్నింగ్స్ ఆడిన రికార్డు ఇప్పటికీ మోరిస్ పేరిటే ఉంది. ఐపీఎల్ 2017లో పుణె సూపర్‌జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున ఆడుతున్నప్పుడు మోరిస్ ఈ ఫీట్ చేశాడు. ఆ మ్యాచ్ లో కేవలం 9 బంతుల్లో 422.22 స్ట్రైక్ రేట్‌తో 28 పరుగులు చేశాడు. క్రిస్ మోరిస్ IPL కెరీర్ గురించి మాట్లాడితే మొత్తం 155.28 స్ట్రైక్ రేట్‌తో 618 పరుగులు చేశాడు. అలాగే 95 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో, క్రిస్ మోరిస్ దక్షిణాఫ్రికా తరపున 4 టెస్టులు, 42 వన్డేలు, 23 టీ20లు ఆడాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..