IPL 2021: బయో బబుల్‌ బద్దలయ్యింది… కరోనా దూసుకొచ్చింది… ఐపీఎల్ ను వాయిదా వేయ‌క తప్ప‌ని పరిస్థితులు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ... క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పిచ్చేక్కించే లీగ్‌! కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ఈ మెగా టోర్నీని నిర్వహించడం సబబేనా అని అడిగినవారికి బీసీసీఐ...

IPL 2021: బయో బబుల్‌ బద్దలయ్యింది... కరోనా దూసుకొచ్చింది... ఐపీఎల్ ను వాయిదా వేయ‌క తప్ప‌ని పరిస్థితులు
Ipl 2021
Balu

| Edited By: Phani CH

May 05, 2021 | 4:56 PM

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ … క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పిచ్చేక్కించే లీగ్‌! కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ఈ మెగా టోర్నీని నిర్వహించడం సబబేనా అని అడిగినవారికి బీసీసీఐ తగు సమాధానమే చెప్పుకుంది.. కరోనా విపత్తు వేళ కాస్తో కూస్తో ఎంటర్‌టైన్మెంట్‌ అందించేది ఈ క్రికెట్‌ లీగేనని, పైగా మూడునాలుగు గంటలు జనాలు ఇంటిపట్టునే ఉండగలరని చెప్పుకుంది. కోట్లాది రూపాయల అంశం కాబట్టి బీసీసీఐ ఆ విధమైన జవాబులను సిద్ధం చేసిపెట్టుకుని ఉంటుంది. అది అలా ఉంచితే, టోర్నీని వాయిదా వేయడం మంచిదేమోనని చాలా మంది చేసిన సూచనలను పెడచెవిన పెట్టి పంతానికి పోయింది బీసీసీఐ. ఫలితంగా క్రికెట్‌కే కరోనా సోకింది. మెగా టోర్నమెంట్‌ కరోనా బారిన పడి విలవిలలాడింది. సుమారు నెల రోజుల పాటు సాగిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ను వాయిదా వేయక తప్పని పరిస్థితులు వచ్చాయి. కారణం క్రికెటర్లకు కరోనా అంటుకోవడమే! క్రికెటర్లకు, సిబ్బందికి ఎలాంటి భయాలు అవసరం లేదని, అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని బోర్డు చెప్పిన మాటలు తుస్సుమన్నాయి. బయో బబుల్‌ బద్దలయ్యింది. కరోనా దూసుకొచ్చింది. ఆటగాళ్లకు సోకింది. ఒకరు, ఇద్దరు, ముగ్గురు.. ఆ తర్వాత పదుల సంఖ్యలో కేసులు రావడంతో లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. దేశాన్ని కరోనా సెకండ్‌వేవ్‌ అల్లకల్లోలం చేస్తున్న సమయంలోనూ బీసీసీఐ టోర్నమెంట్‌ కొనసాగింపునకే మొగ్గు చూపింది. ఆటగాళ్లకు భరోసా ఇచ్చింది. అయితే ఆ భరోసా చచ్చుబండలు కావడంతో క్రికెటర్లలో ఆందోళన మొదలయ్యింది. అప్పటికే చాలా మంది ఎందుకొచ్చిన రిస్కంటూ ఐపీఎల్‌ను వదిలేసి ఇంటిదారి పట్టారు. ఇక ఇప్పుడు లీగ్‌ నిర్వహణ అంత సులభం కాదని గ్రహించింది బీసీసీఐ. టోర్నీని వాయిదా వేసి ఆటగాళ్ల భద్రత, వారిని సురక్షితంగా ఇంటికి చేర్చడం ఎలా అన్నదానిపై దృష్టి పెట్టింది.

అసలు బయోబబుల్‌ను దాటి కరోనా వైరస్‌ లోపలికి ఎలా అడుగుపెట్టిందన్నదే అర్థం కావడం లేదు. నిజానికి బయోబబుల్‌ చాలా సురక్షితం అనుకుంటారు కానీ.. దాన్ని దాటి కూడా కరోనా క్రికెటర్లకు అంటుకున్నదంటే ఏదో పొరపాటు జరిగే ఉంటుంది. లాస్టియర్‌ కూడా కరోనా తీవ్రంగా ఉంటే ఐపీఎల్‌ను దేశాన్ని దాటించేసింది బీసీసీఐ. అంతే కానీ టోర్నమెంట్‌ను రద్దు చేసుకోలేదు. టోర్నమెంట్‌ను నిర్వహించడానికి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ముందుకు రావడంతో బీసీసీఐ టక్కున ఆతిథ్య బాధ్యతలను ఆ దేశానికి అప్పగించింది. అక్కడ టోర్నమెంట్ విజయవంతంగా సాగింది. యుఏఈలో ఏర్పాటు చేసిన బయోబబుల్‌లో ఒక్క లోటు కూడా కనిపించలేదు. పైగా టోర్నమెంట్‌ను పక్కాగా నిర్వహించింది. యుఏఈనే నిర్వహించగా లేనిని మనం నిర్వహించలేమా అని అనుకుంది బీసీసీఐ.. ఆ అతి విశ్వాసంతోనే వద్దు వద్దని ఎంతమంది చెప్పినా వినకుండా టోర్నమెంట్‌ను మొదలు పెట్టింది. టోర్నమెంట్‌ను తాము సమర్థంగా నిర్వహించగలమని, ఈసారి కూడా తమకే అప్పగించమని యుఏఈ చెప్పినా బోర్డు వినలేదు. కేసులు తక్కువగా ఉన్న శ్రీలంక కూడా ఆతిథ్యమివ్వడానికి ముందుకొచ్చింది. ఈ ప్రతిపాదనను కూడా బీసీసీఐ తిరస్కరించింది.

ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌లలో టీ-20 ప్రపంచకప్‌ను భారత్‌ నిర్వహించాల్సి ఉంది. అంతకు ముందు ఐపీఎల్‌ను జరిపితే కాస్త అనుభవం వస్తుందన్న ఉద్దేశంతో బీసీసీఐ ఇండియాలోనే టోర్నమెంట్‌ జరపాలని డిసైడయ్యింది. పైగా ఐపీఎల్‌ సక్సెసయితే వరల్డ్‌కప్‌ ఆడేందుకు వచ్చే ఆటగాళ్లు ధైర్యంగా భారత్‌లో అడుగుపెడతారని భావించింది. అయితే మ్యాచ్‌లను వేరు వేరు నగరాలలో నిర్వహించడంలోనే తప్పటడుగు వేసింది. ఇండియన్‌ సూపర్‌లీగ్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లాగా ఏదైనా ఒకే నగరానికి ఐపీఎల్‌ను పరిమితం చేసి బయో బబుల్‌ను పటిష్టంగా ఏర్పాటు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. బీసీసీఐ మాత్రం ఆరు నగరాలను లీగ్‌ కోసం ఎంపిక చేసి పెద్ద పొరపాటు చేసింది. క్రికెటర్లు, సిబ్బంది ఓ నగరం నుంచి మరో నగరానికి విమానంలో ప్రయాణం చేసినప్పుడే బబుల్‌ బద్దలయ్యింది. కరోనా ఎక్కడి నుంచి అయినా వచ్చే అవకాశం ఉందని అధికారులకు తెలియదా? తెలిసీ ఆటగాళ్లను ఓ నగరం నుంచి మరో నగరానికి ఎందుకు తిప్పినట్టు? యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఐపీఎల్‌ నిర్వహించినప్పుడు అబుదాబి, షార్జా, దుబాయ్‌ నగరాలలోనే మ్యాచ్‌లను ఏర్పాటు చేశారు. ఆటగాళ్ల కోసమే ప్రత్యేకించి బస్సులను ఏర్పాటు చేశారు. ప్లేయర్లు బస్సుల్లోనే ప్రయాణం చేశారు తప్పితే విమానం ఎక్కలేదు. అందుకే కరోనా ఎవరినీ అంటుకోలేదు. పైగా యుఏఈ ప్రభుత్వం కట్టుదిట్టమైన నిబంధనలను ఏర్పాటు చేసింది. ఎవరూ ఆ నిబంధనలను అతిక్రమించకూడదు. కఠినతరమైన ఆంక్షలు ఉన్నాయి. ఎవరైనా గీత దాటితే భారీ జరిమానాలు విధిస్తారు. ఈ విషయంలో తరతమ భేదాలుండవు. అందుకే అక్కడ ఉల్లంఘనలు జరగవు. భారత్‌లో అలా కాదు.. అన్నింటా కనబడే ఉదాసీనతే బయోబబుల్‌ నిర్వహణలోనూ కనిపించింది. వారం రోజుల క్రితం వరకు కూడా క్రికెటర్లు తాము ఉంటున్న నగరంలో ఎక్కడి నుంచైనా నచ్చిన భోజనాన్ని ఆన్‌లైన్‌ ఆర్డర్‌ ద్వారా తెప్పించుకునే అవకాశం కల్పించారు. యుఈఏలో ఇలా జరుగుతుందా?కరోనా విస్తరిస్తున్న వేళ ఇలా బయట నుంచి ఫుడ్డు తెప్పించుకోవడం శ్రేయస్కరమేనా? అదీ కాకుండా నిబంధనలు గాలికి వదిలేసి క్రికెటర్లను ఎవరు పడితే వారు కలిసి వెళ్లారు. కరోనా రాకుండా ఎలా ఉంటుంది?

యుఏఈలో కూడా లీగ్‌ ఆరంభానికి ముందు కొన్ని కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే క్వారంటైన్‌ను చాలా పకడ్బందీగా అమలు చేసింది ఆ దేశం. వైరస్‌ను అదులోకి తీసుకురాగలిగింది. ఒక్కసారి లీగ్‌ మొదలయ్యాక కరోనా జాడే లేకుండా పోయింది. టోర్నమెంట్‌ సజావుగా సాగింది. బయోబలుల్‌ నిర్వహణను బ్రిటన్‌కు చెందిన రెస్ట్రారా అనే కంపెనీకి అప్పగించింది యుఏఈ . ఆ సంస్థ బయోబబుల్‌ను చక్కగా నిర్వహించింది. ప్లేయర్లతో పాటు సిబ్బంది, గ్రౌండ్‌ క్యూరేటర్లు, నిర్వహాకులు, హోటళ్ల సిబ్బంది.. ఇలా టోర్నమెంట్‌లో భాగమైన ప్రతి ఒక్కరిని బయోబబుల్‌లోకి తీసుకొచ్చారు. బయటి వ్యక్తులు ఎవరూ బయోబబుల్‌ లోపలికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మన దగ్గర మాత్రం బయోబబుల్‌ నిర్వహణను గాలికి వదిలేశారు. అందుకే టోర్నమెంట్‌ను సగంలో ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది.

Also Read: మీ వడ్డీ ఆదాయంపై టీడీఎస్‌ కట్‌ అవుతోందా..? ఎఫ్‌డీ వడ్డీపై పన్ను ఎందుకు విధిస్తారు..!

మెదక్‌ జిల్లాలో ఆసక్తిగా మారిన ఆన్‌లైన్‌ పెళ్లి.. ఆన్‌లోనే మంత్రాలు చదివి పెళ్లి జరిపించిన పురోహితులు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu