IPL 2021: తాలిబన్ల నియంత్రణలో ఆఫ్ఘనిస్తాన్.. రషీద్ ఖాన్, నబీలపై ప్రభావం పడనుందా.. ఐపీఎల్‌లో వీరి భవితవ్యం?
Rashid Khan-Mohammed Nabi: ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లింది. ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడితో సహా ఇతర పెద్ద నాయకులు, దౌత్యవేత్తలు దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రజలలో భయానక వాతావరణం నెలకొంది.
Rashid Khan-Mohammed Nabi: ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లింది. భారతదేశం తన 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించుకునే సమయంలోనే తాలిబన్లు కాబూల్‌పై తన పట్టును బిగించారు. ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడితో సహా ఇతర పెద్ద నాయకులు, దౌత్యవేత్తలు దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రజలలో భయానక వాతావరణం నెలకొంది. అలాగే వలసలు పెద్ద సంఖ్యలో కొనసాగుతున్నాయి. భారతదేశం పట్ల కూడా తాలిబన్ల వైఖరి సక్రమంగా లేదు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్లు రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ ఐపీఎల్ 2021 లో పాల్గొంటారా లేదా అనే ప్రశ్న? వేధిస్తోంది.
ఐపీఎల్ 2021 రెండవ దశ సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో జరగనుంది. ఇక్కడ మిగిలిన 31 మ్యాచ్‌లు జరుగుతాయి. రషీద్ ఖాన్, మహ్మద్ నబీ ఇద్దరూ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ ఆక్రమించిన సమయంలో, ఈ ఆటగాళ్లు ఇద్దరూ దేశంలో లేరు. వీరు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న 100 బాల్స్ టోర్నమెంట్ అయిన ది హండ్రెడ్‌లో పాల్గొంటున్నారు.
పరిస్థితిపై కన్నేసిన బీసీసీఐ.. రషీద్ ఖాన్ హండ్రెడ్ లీగ్‌లో ట్రెంట్ రాకెట్స్ టీమ్‌లో భాగమయ్యాడు. కాగా మహ్మద్ నబీ లండన్ స్పిరిట్స్ టీమ్‌లో ఆడుతున్నాడు. ఐపీఎల్ 2021లో వారు ఆడతారని బీసీసీఐ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. అయితే అక్కడి పిరిస్థితులను బీసీసీఐ నిరంతరం పర్యవేక్షిస్తుందని ఓ అధికారి పీటీఐకి వెల్లడించారు. “అనేక రకాల ప్రకటనలు వెలువడుతున్నాయి. ఐపీఎల్‌లో ఎలాంటి మార్పు ఉండదని ఆశిస్తున్నాం. రషీద్ ఖాన్, ఇతర ఆఫ్ఘన్ ఆటగాళ్లు ఐపీఎల్‌లో పాల్గొంటారు” అని పేర్కొన్నారు.
ప్రపంచ నాయకులకు విజ్ఞప్తి చేసిన ఆఫ్ఘన్ ఆటగాళ్లు.. ఆఫ్ఘనిస్తాన్ తాజా పరిస్థితులపై బీసీసీఐ అక్కడి క్రికెట్ బోర్డుతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఇటీవల, రషీద్, నబీ తాలిబన్ల నుంచి ఆఫ్ఘనిస్తాన్‌ను రక్షించాలని ట్విట్టర్ ద్వారా ప్రపంచ నాయకులకు విజ్ఞప్తి చేశారు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో వీరి అభ్యర్థనలో స్పష్టంగా తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్.. శ్రీలంక పర్యటించే తేదీలు ఇంకా వెల్లడి కాలేదు. అదే సమయంలో, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ఇప్పటికే రద్దైన సంగతి తెలిసిందే. అయితే, దీని వెనుక కారణం మాత్రం ఐపీఎల్ అని తెలుస్తోంది.
భారత్‌పై తాలిబన్ తాజా వైఖరి.. ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమణ తరువాత, తాలిబన్ నాయకులు భారతదేశం గురించి రెండు విషయాలు వెల్లడించారు. భారతదేశంతో మంచి సంబంధాలను కోరుకుంటామని, అలాగే భారతీయులతో సహా అక్కడ నివసిస్తున్న సాధారణ పౌరులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. దీంతో రషీద్, నబీ లేదా ఏ ఇతర ఆఫ్ఘన్ ఆటగాడైనా ఐపీఎల్ ఆడడంలో ఎలాంటి సమస్య ఎదరుకాబోదని అర్థమవుతుంది. అయితే తాలిబన్ల మనసు ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం.
ఐపీఎల్‌లో ఆడతారు: ఎస్ఆర్‌హెచ్ టీం సీఈవో కే షణ్ముగం ‘రషీద్, నబీ ఇద్దరూ ఐపీఎల్‌లో ఆడతారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కానీ, వీరు కచ్చితంగా ఐపీఎల్‌లో పాల్గొంటారు. టోర్నమెంట్‌కు అందుబాటులోనే ఉంటారు. ఎస్‌ఆర్ఎస్ టీం ఆగస్టు 31న యూఏఈ వెళ్లనున్నాం. ఆఫ్ఘన్‌లో గొడవలపై రషీద్ ఆందోళన చెందుతున్నాడు. అతను మాత్రం ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్నాడు. రషీద్ కుటుంబం మాత్రం ఆఫ్ఘన్‌లోనే ఉండిపోయిందని’ పేర్కొన్నారు.
Also Read:
PM Modi – Sindhu: కల నెరవేరింది.. ప్రధాని మోడీతో కలిసి ఐస్ క్రీం తిన్న పీవీ సింధు