- Telugu News Sports News Cricket news Indian player and mumbai indians bowler karn sharma only income from ipl check lile story
10 ఏళ్లుగా పట్టించుకోని బీసీసీఐ.. ఐపీఎల్ జీతంతోనే ఇల్లు గడిచేది.. ఈ టీమిండియా ప్లేయర్ స్టోరీ వింటే కన్నీళ్లే
Team India: చాలామంది ఆటగాళ్ల మనుగడకు ఏకైక మార్గం ఐపీఎల్. ఐపీఎల్‌లో కొనుగోలు చేయకపోతే, ఈ ఆటగాళ్ల జీవనోపాధి కష్టతరం అయ్యే ప్రమాదంలో పడనుంది. ఐపీఎల్ ద్వారా సంపాదించిన డబ్బుతో తమ ఇంటిని నడుపుతున్న ఓ మ్యాచ్ విన్నర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: May 03, 2025 | 1:40 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రపంచంలోనే అత్యధికంగా డబ్బు సంపాదించే దేశీయ టోర్నమెంట్. ఆటగాళ్ళు రాత్రికి రాత్రే లక్షాధికారుల నుంచి కోటిశ్వరులయ్యే చోటు. వేలంలో, ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తుంటాయి. టీం ఇండియాలో భాగం కాని చాలా మంది ఆటగాళ్లు ఇందులో భాగమయ్యారు. బీసీసీఐ కేంద్ర కాంట్రాక్టులో లేని ప్లేయర్లు కూడా ఇక్కడ ఆడుతుంటారు.

ఇటువంటి పరిస్థితిలో అలాంటి ఆటగాళ్ల మనుగడకు ఏకైక మార్గం ఐపీఎల్. ఐపీఎల్‌లో కొనుగోలు చేయకపోతే, చాలా మంది ఆటగాళ్ల జీవనోపాధి కష్టతరం అయ్యే ప్రమాదంలో పడనుంది. ఐపీఎల్ ద్వారా సంపాదించిన డబ్బుతో తమ ఇంటిని నడుపుతున్న ఓ మ్యాచ్ విన్నర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ బౌలర్ కర్ణ్ శర్మ ప్రతిభావంతులైన ఆటగాళ్లలో ఒకడిగా పేరుంచాడు. కానీ, అతనికి టీం ఇండియాలో పెద్దగా అవకాశాలు రాలేదు. మూడు ఫార్మాట్లలో 4 మ్యాచ్‌లు ఆడిన తర్వాత, అతనికి జట్టు నుంచి తప్పించారు. కర్ణ్ శర్మ గత 10 సంవత్సరాలుగా భారత జట్టులో లేడు.

దీని కారణంగా అతనికి బీసీసీఐ నుంచి ఫీజు రూపంలో ఎలాంటి డబ్బు అందడం లేదు. అతను జట్టుకు దూరంగా ఉన్నప్పుడు స్పాన్సర్‌షిప్ అందుబాటులో ఉండదు. ఐపీఎల్ మాత్రమే ఆదాయానికి మూలం. అతను 18వ సీజన్‌లో ముంబై తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. మెగా వేలంలో కర్ణ్ శర్మను ఫ్రాంచైజీ రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2025లో కర్ణ్ శర్మ ముంబై జట్టుకు ఒక వరంలా నిలిచాడు. తొలి మ్యాచ్‌ల్లో పరాజయాల తర్వాత కర్ణ్ శర్మను రంగంలోకి దించిన హార్దిక్ పాండ్యా.. అందుకు తగ్గట్లుగానే ఈ ఆటగాడు తన స్పిన్ మ్యాజిక్‌తో ముంబైకు మ్యాచ్ విన్నర్‌గా నిరూపించుకున్నాడు.

రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీతో ముంబై ఓడిపోయే దశలో ఉన్న మ్యాచ్‌ను కర్ణ్ శర్మ తన బౌలింగ్‌తో గెలిపించాడు. పునరాగమనంతో తన ఖాతాలో 3 వికెట్లు చేర్చుకున్నాడు. అందుకుగాను కర్ణ్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2025లో తన బౌలింగ్‌తో, కర్ణ్ శర్మ స్టార్ బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టాడు. కానీ, అతను టీమ్ ఇండియాలోకి తిరిగి వస్తాడనే ఆశ కనిపించడం లేదు. అతను 2014 నుంచి ఏ అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు.

కర్ణ్ శర్మ భారతదేశం తరపున 1 టెస్ట్ ఆడాడు. అందులో అతను 4 వికెట్లు పడగొట్టాడు. కాగా 2 వన్డేలు, 1 టీ20 మ్యాచ్ ఆడాడు. అందులో అతనికి 1 వికెట్ దక్కింది. కానీ, 10 సంవత్సరాలకుపైగా గడిచిపోయింది. ఈ ఆటగాడికి తిరిగి వచ్చే అవకాశం సెలెక్టర్లు ఇవ్వలేదు. ప్రస్తుతం, అతను ఐపీఎల్‌పై ఆధారపడి తన జీవితాన్ని గడుపుతున్నాడు.



















