AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ఫ్లే ఆప్స్‌ నుంచి ఔట్‌.. కాటేరమ్మ కొడుకుల కథ ముగిసింది..? SRH కొంపముంచి 3 కారణాలు ఇవే!

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఐపీఎల్ సీజన్‌లో ఘోరంగా విఫలమైంది. ప్రారంభంలో అద్భుత ప్రదర్శన తర్వాత, బలహీనమైన బౌలింగ్, అతిగా ఆక్రమణాత్మక బ్యాటింగ్, మరియు నిలకడ లేకపోవడం వల్ల వరుస ఓటములు ఎదుర్కొంది. బౌలింగ్ దాడి డిజాస్టర్ గా మారింది, ముఖ్య బ్యాటర్లు నిలకడగా రాణించలేదు.

IPL 2025: ఫ్లే ఆప్స్‌ నుంచి ఔట్‌.. కాటేరమ్మ కొడుకుల కథ ముగిసింది..? SRH కొంపముంచి 3 కారణాలు ఇవే!
Srh Team Players
SN Pasha
|

Updated on: May 03, 2025 | 6:03 PM

Share

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆడిన తొలి మ్యాచ్‌ చూసి.. ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్యాన్స్‌ అయిన మనం బట్టలు చించుకున్నాం. వామ్మో.. కావ్య ప్లాన్‌ మామూలుగా లేదు, ఆ రిటెన్షన్స్‌ ఏంటి? మెగా ఆక్షన్‌లో ఆ పికింగ్‌ ఏంటి? అబ్బా.. మాస్టర్‌ మైండ్‌ అంటే మన కావ్య పాపే అని మురిసిపోయాం. ట్రావిస్‌ హెడ్డు, అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, నితీష్‌ కుమార్‌ రెడ్డి, క్లాసెన్‌.. అబ్బో.. ఇది బ్యాటింగ్‌ లైనప్పా.. బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్సా అంటూ హంగామా చేశాం.. ఆ హైపుకు తగ్గట్లే రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సునామీ సృష్టించారు. ఏకంగా 286 పరుగులు చేసి.. ఐపీఎల్‌ చరిత్రలోనే సెకండ్‌ హైయొస్ట్‌ స్కోర్‌ కొట్టేశారు. అప్పుడే కొత్తగా ఆరెంజ్‌ ఆర్మీలోకి వచ్చిన ఇషాన్‌ కిషన్‌ తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో విరుచుకుపడ్డాడు.. ఇది రా ఎస్‌ఆర్‌హెచ్‌ అంటే, వీళ్లురా కాటేరమ్మ కొడుకులంటే.. తొలి మ్యాచ్‌ చూసి ఈ సారి కప్పు మిస్‌ కాదని కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.. కానీ, మ్యాచ్‌లు గడుస్తున్న కొద్దీ.. పులి లాంటి ఎస్‌ఆర్‌హెచ్‌ పిల్లిలా మారుతూ వచ్చింది. 10 మ్యాచ్‌లు ముగిసే సరికి.. 7 మ్యాచ్‌లు ఓడిపోయి.. ప్లే ఆఫ్స్‌కు ఆల్‌మోస్ట్‌ దూరమైంది. టెక్నికల్‌గా ఇంకా ఎస్‌ఆర్‌హెచ్‌కు ఛాన్స్‌ ఉన్నా.. అది అంత ఈజీ కాదనే విషయం ప్రతి క్రికెట్‌ ఫ్యాన్‌కు తెలుసు. మరి అద్భుతమైన టీమ్‌, దుమ్ములేపే ఓపెనర్లు, మంచి బౌలింగ్‌ ఎటాక్‌, ఒంటిచేత్తో మ్యాచ్‌ గెలిపించగలిగే కాటేరమ్మ కొడుకులు ఉండి కూడా.. ఎస్‌ఆర్‌హెచ్‌కు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది. తొలి మ్యాచ్‌లో ఆ రేంజ్‌ బ్యాటింగ్‌ తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌ ఎందుకు సడెన్‌గా డౌన్‌ ఫాల్‌లోకి వెళ్లిపోయింది. అసలు ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఫేలవ ప్రదర్శనకు కారణం అయిన ఓ మూడు ప్రధాన కారణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

డిజాస్టర్‌ బౌలింగ్‌ ఎటాక్‌..

మెగా వేలం కంటే ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రిటేన్‌ చేసుకున్న ఆటగాళ్ల లిస్ట్‌ ఒకసారి చూస్తే.. హెన్రిచ్ క్లాసెన్, పాట్ కమ్మిన్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి.. ఈ లిస్ట్‌ చూస్తే బ్యాటింగ్‌ స్ట్రాంగ్‌ అనే విషయం స్పష్టం అర్థం అవుతుంది. కమిన్స్‌, నితీష్‌ కుమార్‌ రెడ్డి బౌలింగ్‌ చేస్తారు అని అనుకోవచ్చు.. కానీ ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌ డామినేట్‌ టీమ్‌గానే రిటేన్‌ స్ట్రాటజీ ఫాలో అయింది. ఆక్షన్‌లో కూడా ఇషాన్‌ కిషన్‌ ను తీసుకోవడంతో బ్యాటింగ్‌ను మరింత స్ట్రాంగ్‌ చేసుకుంది. కానీ, బౌలింగ్‌ ఎటాక్‌ కోసం.. మొహమ్మద్‌ షమీ, హార్షల్‌ పటేల్‌పై భారీ నమ్మకం పెట్టుకుంది. షమీకి రూ.10 కోట్లు, పటేల్‌కు రూ.8 కోట్ల భారీ ధర ఇచ్చి మరీ తీసుకుంది. కానీ, ఇద్దరు దారుణంగా ఫెయిల్‌ అయ్యారు. ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఎంపిక చేసుకున్న బౌలింగ్‌ ఎటాక్‌ ఒక డిజాస్టర్‌ అని చెప్పక తప్పదు. మొహమ్మద్‌ షమీ, హర్షల్‌ పటేల్‌, ప్యాట్‌ కమిన్స్‌, జయ్‌దేవ్‌ ఉనద్కట్‌, సిమర్‌జీత్‌ సింగ్‌, ఆడమ్‌ జంపా, రాహుల్‌ చాహర్‌, ఇషాన్‌ మలింగా.. ఇలా లిస్ట్‌ చూస్తే పేపర్‌పై మంచి బౌలర్లు ఉన్నట్లు కనిపించినా.. అంతా విఫలం అయ్యారు. అయితే.. రాహుల్‌ చాహర్‌ విషయంలో మాత్రం ఎస్‌ఆర్‌హెచ్‌ మేనేజ్‌మెంట్‌, కెప్టెన్‌ కమిన్స్‌ తప్పు చేశారని చెప్పుకోచ్చు. ఒక జెన్యూన్‌ వికెట్‌ టేకర్‌ అయిన రాహుల్‌ చాహర్‌కు సరిగ్గా ఛాన్సులు ఇవ్వలేదు. ఈ సీజన్‌లో కేవలం ఒకే ఒక మ్యాచ్‌ ఆడించారు. ఆ ఒక్క మ్యాచ్‌లోనూ ఆశ్చర్యకరంగా కేవలం ఒక్కటంటే ఒక్క ఓవర్‌ మాత్రమే బౌలింగ్‌ ఇచ్చారు. ఇతని విషయంలో సన్‌రైజర్స్‌దే మిస్టేక్‌. గతంలో ముంబై ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ తరఫున ఆడుతూ.. రాహుల్‌ చాహర్‌ మంచి ప్రదర్శనలు ఇచ్చాడు. కానీ, ఎస్‌ఆర్‌హెచ్‌ ఎందుకో రాహుల్‌ను సరిగ్గా వాడుకోలేదు. గతంలో బౌలింగ్‌ బలంతో మ్యాచ్‌లు గెలిచిన సన్‌రైజర్స్‌.. ఈ సీజన్‌లో మాత్రం చెత్త బౌలింగ్‌తోనే మ్యాచ్‌లు ఓడిపోయింది.

ఓవర్‌ అగ్రెసివ్‌ బ్యాటింగ్‌ అప్రోచ్‌..

గత సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విధ్వంసకర బ్యాటింగ్‌ చేస్తూ ప్రత్యర్థి జట్లను భయపెట్టింది. ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ, నితీష్‌ కుమార్‌ రెడ్డి, క్లాసెన్‌ సూపర్‌ బ్యాటింగ్‌తో భారీ భారీ స్కోర్లు, ఐపీఎల్‌ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా పెద్ద పెద్ద స్కోర్లు బాదేసింది ఎస్‌ఆర్‌హెచ్‌. అదే ఊపులో ఫైనల్‌ వరకు వెళ్లింది. కానీ ఫైనల్‌లో బ్యాటర్లు దారుణంగా విఫలం అవ్వడంతో కేకేఆర్‌ ఓవరాల్‌ టీమ్‌ ఎఫర్ట్‌తోనే కప్పులు వస్తాయి.. కేవలం బ్యాటింగ్‌ బలంతో కాదు అనే విషయాన్ని నిరూపించింది. అయినా కూడా సన్‌రైజర్స్‌ కళ్లు తెరుచుకోలేదు. రిటెన్షన్‌తో కోర్‌ను టీమ్‌ను అంటిపెట్టుకున్నా.. మెగా ఆక్షన్‌లో బౌలింగ్‌ను స్ట్రాంగ్‌ చేసుకోవడంలో మాత్రం విఫలమైంది. గత సీజన్‌లో ఎక్కడైతే ఆపారో.. ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌ అక్కడి నుంచే మొదలుపెట్టినట్లు ఆడారు. 286 పరుగులు స్కోర్‌ చేయడంతో.. ఎస్‌.. కాటేరమ్మ కొడుకులు ఆడుతున్న ఆటే కరెక్టు, సన్‌రైజర్స్‌ స్ట్రాటజీ సూపర్‌ అంటూ అంతా అనుకున్నారు. కానీ.. మిగతా టీమ్స్‌ కూడా బాగానే ఆడుతున్నాయ్‌.. వాళ్ల బౌలర్లు మన బ్యాటర్లకు కళ్లెం వేయగలరు, మన బౌలర్లను ఉతికి ఆరేయగలరని విషయం నెమ్మదిగా అర్థమైంది. అయినా కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ జాగ్రత్త పడలేదు.. అంతే అగ్రెసివ్‌గా ఆడతాం, గుడ్డెద్దు చేలో పడ్డట్టు దూసుకెళ్తాం అని.. బొక్కబోర్లా పడ్డారు. 10 మ్యాచ్‌లు ముగిసే సరికి.. 7 ఓటములు వెనకేసుకున్నారు. ఒక్క అడుగులో దూరమైన ట్రోఫీని ఈ సారి కొట్టేస్తాం అంటూ కనీసం ప్లే ఆఫ్స్‌ కూడా చేరుకోలేని స్థితికి పడిపోయారు. పాయింట్ల పట్టికలో ఇప్పుడు 9వ స్థానంలో ఉన్నారు. కాటేరమ్మ కరుణించలేదో.. లేక కాటేరమ్మ కొడుకులకు దిష్టి తగిలిందో ఏమో కానీ.. వారిపై ఉన్న ఎక్స్‌పెట్టేషన్స్‌ను అందుకోవడంలో మాత్రం ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాళ్లు.. సారీ సారీ.. మన కాటేరమ్మ కొడుకులు విఫలం అయ్యారు.

బ్యాటింగ్‌ వైఫల్యం..

గత రెండు సీజన్స్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ బలం ఏంటంటే.. బ్యాటింగ్‌ అని ఎవరిని అడిగినా చెప్తారు. తొలి మ్యాచ్‌లో వచ్చిన ఆ భారీ స్కోర్‌ చూసి.. ఈ సారి మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్లు కనిపించింది ఎస్‌ఆర్‌హెచ్‌. కానీ, మన టీమ్‌కు అసలైన బలంగా భావించే.. అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్‌, క్లాసెన్‌, నితీష్‌ కుమార్‌ రెడ్డి దారుణంగా విఫలం అయ్యారు. ఒకటి రెండు మ్యాచ్‌లు ఆడితే సరిపోదు.. కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్‌ అనే విషయం మరోసారి బోధపడింది. ఈ సీజన్‌లో అభిషేక్‌ శర్మ 10 మ్యాచ్‌ల్లో 314 పరుగులు చేశాడు. అందులో ఒక్క మ్యాచ్‌లోనే 141 రన్స్‌ చేశాడు. అంటే మిగతా 9 మ్యాచ్‌ల్లో కలిపి మనోడు చేసింది 173 మాత్రమే. ఇక హెడ్‌ 10 మ్యాచ్‌ల్లో 281 రన్స్‌ మాత్రమే, మిడిల్‌ ఆర్డర్‌ను భుజాలపై మోస్తాడని అనుకుంటే.. నితీష్‌ కుమార్‌ రెడ్డి దారుణంగా ఫెయిల్‌ అయ్యాడు. 10 మ్యాచ్‌ల్లో కేవలం 173 పరుగులు మాత్రమే చేశాడు. ఇక కాటేరమ్మ కొడుకు హెన్రిచ్‌ క్లాసెన్‌ 10 మ్యాచ్‌ల్లో 311 పరుగులు మాత్రమే చేశాడు. వీరి పరుగులు 10 మ్యాచ్‌లు కలిపి చూస్తే.. పర్వాలేదనిపించేలా ఉన్నా.. ఒకటి రెండు మ్యాచ్‌ల్లోనే బాగా ఆడారు. మిగతా మ్యాచ్‌ల్లో విఫలం అయ్యారు. వీళ్ల స్థాయికి ఒకటి రెండు మ్యాచ్‌ల్లోనే బాగా ఆడటం సరికాదు.. టోర్నీ మొత్తం నిలకడగా ఆడుతూ.. ఒకటి అరా మ్యాచ్‌ల్లో విఫలమైనా.. ఓవరాల్‌గా కన్సిస్టెన్సీతో ఆడాలి. అది వీళ్ల రేంజ్‌. కానీ, కాటేరమ్మ కొడుకులు.. కేవలం అగ్రెసివ్‌ బ్యాటింగ్‌ను నమ్మకొని దారుణంగా విఫలం అయ్యారు. తొలి మ్యాచ్‌లో సెంచరీతో దుమ్మురేపిన ఇషాన్‌ కిషన్‌.. ఆ తర్వాత టీమ్‌లో ఉన్నాడన్న విషయం కూడా మర్చిపోయేలా చేశాడు. వీటికి తోడు.. హైదరబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌తో విభేదాల కారణంగా.. పిచ్‌ ఎస్‌ఆర్‌హెచ్‌కు అనుకూలంగా ఇవ్వలేదనే ఆరోపణలు కూడా ఉన్నా.. అది వేరే విషయం. మొత్తానికి.. ఈ సీజన్‌లో కాటేరమ్మ కొడుకుల కథ ముగిసినట్టే. వచ్చే సీజన్‌లో అయినా.. నిలకడను నమ్ముకొని కప్పు కొడతారని ఆశిద్దాం.. ఏదీ ఏమైనా.. వీ లవ్‌ ఆరెంజ్‌ ఆర్మీ. వీ లవ్‌ కాటేరమ్మ కొడుకులు.. వీ సపోర్ట్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..