AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: గుండె పగిలే వార్తను చెప్పకుండానే దాచారు.. కట్ చేస్తే.. ఛాంపియన్‌గా నిలిచింది.. ఎవరంటే.?

అమన్‌జోత్ కౌర్ ఈ టోర్నమెంట్‌లో అటు బ్యాటింగ్‌తో పాటు, బౌలింగ్‌లోనూ మంచి ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో ఆమె ఫీల్డింగ్ హైలైట్‌గా నిలిచింది. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ సెంచరీ పూర్తి చేసి, జట్టును విజయానికి దగ్గరగా తీసుకెళ్తున్న సమయంలో, దీప్తి శర్మ బౌలింగ్‌లో ఆమె ఇచ్చిన క్యాచ్‌ను అమన్‌జోత్ కౌర్ అద్భుతంగా అందుకుంది.

Video: గుండె పగిలే వార్తను చెప్పకుండానే దాచారు.. కట్ చేస్తే.. ఛాంపియన్‌గా నిలిచింది.. ఎవరంటే.?
Amanjot Kaur
Venkata Chari
|

Updated on: Nov 03, 2025 | 1:30 PM

Share

Amanjot Kaur Grandmother had Heart Attack: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన భారత జట్టు విజయం వెనుక కేవలం ఆటగాళ్ల పట్టుదలే కాదు, వారి కుటుంబ సభ్యుల అపార త్యాగం కూడా దాగి ఉంది. ఈ చారిత్రక విజయం తరువాత వెలుగులోకి వచ్చిన ఓ విషయం యావత్ దేశాన్ని కదిలించింది. భారత ఆల్‌రౌండర్, ప్రపంచ కప్ హీరో అమన్‌జోత్ కౌర్ (Amanjot Kaur) అమ్మమ్మకు టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో గుండెపోటు వచ్చింది. అయితే, ఈ భయంకరమైన వార్తను కుటుంబ సభ్యులు ఆమెకు చెప్పకుండా దాచిపెట్టారు.

భారత జట్టు ఫైనల్‌కు చేరుకుని, తుది పోరులో దక్షిణాఫ్రికాను ఓడించిన వెంటనే, అమన్‌జోత్ కౌర్ కుటుంబం ఈ విషయాన్ని వెల్లడించింది. అమన్‌జోత్ కౌర్ తండ్రి భూపిందర్ సింగ్ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ, తమ తల్లి (అమన్‌జోత్ అమ్మమ్మ)కి ప్రపంచ కప్ జరుగుతున్న సమయంలో గుండెపోటు వచ్చిందని తెలిపారు. ఆ సమయంలో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ, వారు ఈ వార్తను అమన్‌జోత్‌కు తెలియకుండా జాగ్రత్త పడ్డారు.

“ఆమె ప్రపంచ కప్‌పై దృష్టి కోల్పోకూడదు. ఆమె కల నెరవేరేందుకు, దేశానికి కప్పు తీసుకురావాలన్న లక్ష్యంపై ఆమె పూర్తి ఏకాగ్రత పెట్టాలి. కుటుంబ సమస్యలతో ఆమె ఆటపై ప్రభావం పడకూడదు,” అని భూపిందర్ సింగ్ వివరించారు. అమ్మమ్మ అనారోగ్యం గురించి తెలిసి ఉంటే, అమన్‌జోత్ మానసికంగా కుంగిపోయి, తన వంద శాతం ఆటను ప్రదర్శించలేకపోయేది. అందుకే, కఠినమైనప్పటికీ, కుటుంబం ఈ సత్యాన్ని గోప్యంగా ఉంచాలని నిర్ణయించుకుంది.

కీలక క్యాచ్‌తో విజయంలో భాగం..

అమన్‌జోత్ కౌర్ ఈ టోర్నమెంట్‌లో అటు బ్యాటింగ్‌తో పాటు, బౌలింగ్‌లోనూ మంచి ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో ఆమె ఫీల్డింగ్ హైలైట్‌గా నిలిచింది. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ సెంచరీ పూర్తి చేసి, జట్టును విజయానికి దగ్గరగా తీసుకెళ్తున్న సమయంలో, దీప్తి శర్మ బౌలింగ్‌లో ఆమె ఇచ్చిన క్యాచ్‌ను అమన్‌జోత్ కౌర్ అద్భుతంగా అందుకుంది. ఆ క్యాచ్ మ్యాచ్ గతిని మార్చేసింది. ఇది భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. అలాంటి కీలక సమయంలో, కుటుంబ బాధను మనసులో పెట్టుకుని ఉంటే, ఆమె అంతటి ఏకాగ్రతతో ఆ క్యాచ్ పట్టగలిగేదా? అన్న ప్రశ్న ఉద్భవిస్తుంది.

అమ్మమ్మకే ఈ విజయం అంకితం..

ప్రపంచ కప్ గెలిచిన తరువాత అమన్‌జోత్ కౌర్ మాట్లాడిన మాటల్లోనే, ఆమెకు ఇంట్లో ఏదో సమస్య ఉన్నట్లు అర్థమైంది. “నా కుటుంబం, నా కోచ్‌లు, నా స్నేహితులు.. అందరికీ ఈ విజయం దక్కింది. నా అమ్మమ్మకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల కుటుంబమంతా ఇంట్లో కూర్చొని మ్యాచ్ చూస్తున్నారు,” అని ఆమె తెలిపింది.

కుటుంబం ఆమె కోసం ఇంత పెద్ద త్యాగం చేసిందనే విషయం తరువాత తెలియడంతో, అమన్‌జోత్ మరింత ఉద్వేగానికి లోనైంది. ఈ విజయం, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె అమ్మమ్మకు ఎంతో ఉపశమనాన్ని, సంతోషాన్ని ఇచ్చిందని ఆమె తండ్రి తెలిపారు.

ఒక క్రీడాకారిణి విజయం వెనుక ఆమె అంకితభావం ఎంత ఉంటుందో, అంతకు మించిన త్యాగం, మద్దతు కుటుంబ సభ్యులది ఉంటుందని ఈ సంఘటన నిరూపించింది. భారత అమ్మాయిల క్రికెట్ జట్టు సాధించిన ఈ చారిత్రక విజయానికి ఇలాంటి ఎన్నో భావోద్వేగాల కథలు తోడయ్యాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..