Harmanpreet Kaur : కప్పు కచ్చితంగా కొడతాం కాస్కోండి..యూవీ భయ్యే మాకు ఇన్సిపిరేషన్ : హర్మన్‌ప్రీత్ కౌర్
భారత మహిళల జట్టుకు తొలిసారిగా వన్డే ప్రపంచ కప్ గెలిచేందుకు సువర్ణావకాశం లభించింది. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు జరిగే 2025 మహిళల వన్డే ప్రపంచ కప్‌కు భారత్ మరియు శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఏళ్ల తరబడి భారత్ మెరుగ్గా రాణిస్తున్నా, ఐసీసీ ట్రోఫీ గెలవాలనే కల ఇంకా తీరలేదు.

Harmanpreet Kaur : భారత మహిళల జట్టుకు తొలిసారిగా వన్డే ప్రపంచ కప్ గెలిచేందుకు సువర్ణావకాశం లభించింది. మహిళల వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 2025కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. సొంత గడ్డపై జరగనున్న ఈ టోర్నమెంట్‌లో తొలిసారి ఐసీసీ టైటిల్ సాధించాలని భారత మహిళా క్రికెట్ జట్టు కలలు కంటోంది. ఈ సందర్భంగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అభిమానులకు ఒక మెసేజ్ ఇచ్చారు. ఈసారి కప్ కచ్చితంగా కొడతామని దేశప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆ కలను నిజం చేస్తామని ఆమె చెప్పారు.
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో జరగనుంది. ఈ టోర్నమెంట్‌కు సంబంధించి 50 రోజుల కౌంట్‌డౌన్ ప్రారంభోత్సవంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడారు. “సొంత ప్రేక్షకుల ముందు ఆడడం ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. ఈసారి మా జట్టు కప్ గెలవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంది. భారత అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆ కలను నిజం చేస్తాం” అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా హర్మన్‌ప్రీత్ కౌర్, మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన స్ఫూర్తి అని చెప్పారు. “వరల్డ్ కప్ టోర్నమెంట్‌లు ఎప్పుడూ ప్రత్యేకమే. అలాంటి సందర్భాల్లో మన దేశం పేరు నిలబెట్టడానికి నేను ప్రయత్నిస్తాను. నేను యువరాజ్ సింగ్‌ను చూసి ఇన్ స్పైర్ అయ్యాను” అని ఆమె అన్నారు. వరల్డ్ కప్‌కు ముందు భారత్, ఆస్ట్రేలియాతో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌ను హర్మన్‌ప్రీత్ కౌర్ వరల్డ్ కప్‌కు ఒక మంచి సన్నాహంగా అభివర్ణించారు. “ఆస్ట్రేలియాతో ఆడటం ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. ఈ సిరీస్ మా సన్నాహాలు ఎంతవరకు ఉన్నాయో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. మేము చాలా గట్టిగా ప్రాక్టీస్ చేశాం, మా మంచి ప్రదర్శన దాని ఫలితమే” అని ఆమె పేర్కొన్నారు.
ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్ రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో జరుగుతుంది. ఇందులో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. గ్రూప్ దశలో ప్రతి జట్టు ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. టోర్నమెంట్ తొలి మ్యాచ్ సెప్టెంబర్ 30న భారత్, శ్రీలంక మధ్య జరగనుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




