Glenn Maxwell : మాక్స్ వెల్ నువ్వు మామూలోడివి కాదు.. ఒక్క క్యాచ్‌తో ఓడిపోవాల్సిన మ్యాచ్ గెలిపించావు
డార్విన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ ఒక అద్భుతమైన క్యాచ్ పట్టడం వల్ల ఆస్ట్రేలియా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ చివరి ఓవర్‌లో మాక్స్‌వెల్ పట్టిన ఈ క్యాచ్‌తో రైయన్ రికల్టన్ (71) కీలకమైన ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో ఆస్ట్రేలియా విజయం దాదాపు ఖరారైంది.

Glenn Maxwell : ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ గెలుపు కంటే గ్లెన్ మాక్స్ వెల్ పట్టుకున్న అద్భుతమైన క్యాచ్ గురించే ఇప్పుడు క్రికెట్ ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది. బౌండరీ లైన్ వద్ద మాక్స్ వెల్ పట్టిన ఈ క్యాచ్ క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ క్యాచ్‌లలో ఒకటిగా నిలిచిపోయింది. దీనితో ఆస్ట్రేలియా వరుసగా తొమ్మిదో టీ20 మ్యాచ్‌ను గెలిచి సరికొత్త రికార్డు సృష్టించింది.
డార్విన్‌లో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం కోసం చివరి ఓవర్‌లో 21 పరుగులు కావాల్సి ఉంది. ఆ సమయంలో బ్యాట్స్‌మెన్ రియాన్ రికెల్టన్ (71) బంతిని లాంగాన్ దిశగా బలంగా కొట్టాడు. బంతి బౌండరీ అవతల పడుతుందేమోనని అంతా అనుకున్నారు. కానీ, బౌండరీ లైన్ వద్ద ఉన్న గ్లెన్ మాక్స్ వెల్ గాల్లోకి ఎగిరి, బౌండరీ అవతలకి వెళ్తూనే బంతిని వెనక్కి విసిరి, మళ్లీ బౌండరీ లైన్‌లోకి వచ్చి క్యాచ్ పూర్తి చేశారు. ఇది అతని అద్భుతమైన అథ్లెటిసిజం, ఫాస్టెస్ట్ థింకింగ్, పర్ఫెక్ట్ టైం మెయింటెనెన్స్ అని చెప్పవచ్చు. ఈ క్యాచ్‌తో రికెల్టన్ ఇన్నింగ్స్ ముగియడంతో ఆస్ట్రేలియా విజయం దాదాపు ఖరారైంది.
మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు ఆరంభం అంతగా కలిసి రాలేదు. కేవలం 7 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన టిమ్ డేవిడ్ (83 పరుగులు) 52 బంతుల్లో 8 సిక్సర్లతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి తోడుగా కామెరూన్ గ్రీన్ 13 బంతుల్లో 35 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో ఆస్ట్రేలియా 178 పరుగుల భారీ స్కోరు సాధించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో 17 ఏళ్ల క్వేనా మపాకా 4 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. టీ20లో నాలుగు వికెట్లు తీసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సాధించాడు.
179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టులో రియాన్ రికెల్టన్ (71), ట్రిస్టన్ స్టబ్స్ (37) కొంతవరకు పోరాడినా చివరికి ఓటమి తప్పలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ 3/27, బెన్ డ్వార్షుయిస్ 3/26 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ సిరీస్‌లో రెండో మ్యాచ్ మంగళవారం కూడా డార్విన్‌లోనే జరగనుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




