Team India: బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంది.. తెలుగోడిపై మాజీ ఓపెనర్ ఫైర్..!
Tilak Varma Run-out: వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో తిలక్ వర్మ అనూహ్య రనౌట్‌పై మాజీ క్రికెటర్ సదగోపన్ రమేశ్ తీవ్రంగా స్పందించారు. మైదానంలో ఏం జరుగుతుందో తెలియకుండా తిలక్ బీచ్‌లో నడుస్తున్నట్లు కనిపించాడని రమేశ్ విమర్శించారు. మ్యాచ్ అవగాహన లోపమే ఈ సంఘటనకు కారణమని పేర్కొంటూ, ఇది క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Tilak Varma run-out, Sadagoppan Ramesh criticism: వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత యువ బ్యాటర్ తిలక్ వర్మ ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అతడు అనూహ్యంగా రనౌట్ కావడంపై మాజీ భారత ఓపెనర్ సదగోపన్ రమేశ్ తీవ్రంగా స్పందించారు. తిలక్ వర్మ మైదానంలో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా బీచ్‌లో వాకింగ్ చేస్తున్నట్టుగా కనిపించాడని విమర్శించారు.
ఆదివారం ఇండోర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో 17వ ఓవర్ నాలుగో బంతికి ఈ ఘటన చోటుచేసుకుంది. గుడాకేశ్ మోటీ వేసిన బంతిని అక్షర్ పటేల్ స్క్వేర్ లెగ్ వైపు ఫ్లిక్ చేశాడు. బౌండరీ దిశగా వెళ్లిన బంతిని కైల్ పూరన్ డైవ్ చేసి అడ్డుకున్నాడు. అయితే బంతి బౌండరీ లైన్‌ను తాకిందని అక్షర్ పటేల్, తిలక్ వర్మ భావించారు.
ఈ క్రమంలో ఇద్దరు బ్యాటర్లు పరుగులు తీయడం ఆపేశారు. అయితే బంతి ఇంకా ఆటలోనే ఉండటంతో వెస్టిండీస్ ఫీల్డర్లు వెంటనే స్పందించారు. రెండు వైపులా వికెట్ల వద్ద ఉన్న బెయిల్స్‌ను తొలగించారు. అక్షర్ పటేల్ వెంటనే స్ట్రైకర్ ఎండ్‌కు చేరుకున్నప్పటికీ, తిలక్ వర్మకు మాత్రం ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న మోటీ బెయిల్స్‌ను తొలగించే సమయానికి తిలక్ క్రీజుకు చాలా దూరంలో ఉన్నాడు. ఈ రనౌట్‌పై ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్‌ను ఆశ్రయించారు. రీప్లేలను పరిశీలించిన టీవీ అంపైర్ తిలక్ వర్మను ఔట్‌గా ప్రకటించారు.
ఈ ఘటనపై సదగోపన్ రమేశ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఛానల్‌లో మాట్లాడుతూ తిలక్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘బౌండరీకి అంపైర్లు చాలా దూరంలో ఉండటంతో వాళ్లే థర్డ్ అంపైర్‌ను ఆశ్రయించారు. మరి అదే దూరంలో ఉన్న తిలక్ వర్మ, అక్షర్ పటేల్ బంతి బౌండరీకి వెళ్లిందని ఎలా నిర్ణయించుకున్నారు? కనీసం అక్షర్ తర్వాత పరిస్థితిని గమనించాడు. కానీ తిలక్ వర్మ మాత్రం బీచ్‌లో వాకింగ్ చేస్తున్నట్టుగా కనిపించాడు. తన చుట్టూ ఏం జరుగుతుందో అతడికి అసలు అర్థం కాలేదు’’ అని రమేశ్ వ్యాఖ్యానించారు.
‘‘సాధారణంగా బౌండరీని ఫీల్డర్ అడ్డుకున్న సందర్భాల్లో అంపైర్లు వెంటనే థర్డ్ అంపైర్‌ను సంప్రదిస్తారు. వికెట్ దగ్గర ఉన్న అంపైర్‌కు బౌండరీ లైన్ చాలా దూరంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఫీల్డర్ బంతిని అడ్డుకునే సమయంలో బౌండరీని తాకాడా లేదా అనే విషయం స్పష్టంగా తెలియకపోవడంతో బంతి ఇంకా ఆటలో ఉందని భావిస్తారు’’ అని ఆయన వివరించారు.
14 పరుగుల విజయం..
ఈ మ్యాచ్‌లో భారత్ 14 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది.
ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 30 బంతుల్లోనే 69 పరుగులు చేసి భారత ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 37 పరుగులు చేయగా, తిలక్ వర్మ 16 బంతుల్లో 28 పరుగులు చేశాడు. నితీశ్ కుమార్ రెడ్డి 14 బంతుల్లో 21, అక్షర్ పటేల్ 14 బంతుల్లో 20 పరుగులు చేశారు.
224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 209/7కే పరిమితమైంది. షిమ్రోన్ హెట్‌మేయర్ 43, కైల్ పూరన్ 42 పరుగులతో పోరాడినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. భారత బౌలర్లలో ఎడమచేతి పేసర్ అర్ష్‌దీప్ సింగ్ 44 పరుగులకు 3 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




