Watch Video: పింక్ బాల్ టెస్ట్.. టీమిండియా ది బెస్ట్.. ఈ రికార్డులు చూస్తే మీరూ వావ్ అనాల్సిందే..!

గతంలో శ్రీలంకతో జరిగిన రెండు టెస్టు సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. ప్రస్తుత టెస్టు సిరీస్‌లోనూ క్లీన్ స్వీప్ చేసి, ముచ్చటగా మూడోసారి సిరీస్‌ను సొంతం చేసుకుంది.

Watch Video: పింక్ బాల్ టెస్ట్.. టీమిండియా ది బెస్ట్.. ఈ రికార్డులు చూస్తే మీరూ వావ్ అనాల్సిందే..!
Ind Vs Sl Rohit Sharma
Follow us

|

Updated on: Mar 14, 2022 | 6:40 PM

వన్డే, టీ20 తర్వాత టెస్టు క్రికెట్‌లోనూ రోహిత్ శర్మ(Rohit Sharma) కెప్టెన్సీ అద్భుతంగా మొదలైంది. రోహిత్ సారథ్యంలోని భారత జట్టు(Indian Cricket Team) తొలి టెస్టు సిరీస్‌లోనే శ్రీలంక(India vs Sri Lanka)ను 2-0 తేడాతో వైట్ వాష్ చేసింది. ఇరుజట్ల మధ్య జరిగిన రెండో టెస్టులో భారత్ 238 పరుగుల భారీ తేడాతో లంకను ఓడించి సిరీస్‌ని సొంతం చేసుకుంది. అయితే ఈ క్రమంలో ఎన్నో రికార్డులను టీమిండియా బద్దలు కొట్టింది. భారత జట్టుతో పాటు, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, అశ్విన్ ఇలా ఎందరో భారత ఆటగాళ్లు తమ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను చేర్చుకున్నారు. ఆ స్పెషల్ రికార్డులు ఏంటో ఇప్పుడు చూద్దాం..

మూడోసారి క్లీన్ స్వీప్..

గతంలో శ్రీలంకతో జరిగిన రెండు టెస్టు సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. ప్రస్తుత టెస్టు సిరీస్‌లోనూ క్లీన్ స్వీప్ చేసి, ముచ్చటగా మూడోసారి సిరీస్‌ను సొంతం చేసుకుంది. గతంలో 1993-94, 2017లో భారత జట్టు ఈ ఘనత సాధించింది.

వరుసగా 15వ సిరీస్‌ గెలిచిన టీమిండియా..

శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడంతో.. స్వదేశంలో వరుసగా 15వ టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. 2012 నవంబర్‌లో ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన చివరి టెస్టు సిరీస్‌లో భారత్ ఓడిపోయింది. ఆ సమయంలో మహేంద్ర సింగ్ ధోనీ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అప్పటి నుంచి భారత జట్టు స్వదేశంలో ఏ టెస్టు సిరీస్‌ను కోల్పోలేదు. ఇప్పటి వరకు ఏ జట్టు కూడా తమ సొంత మైదానంలో ఇన్ని సిరీస్‌లు గెలవలేకపోవడం విశేషం. దీంతో ఈ లిస్టులో భారత్ స్పెషల్ రికార్డును సొంతం చేసుకుంది.

టీమ్ ఇండియా తర్వాత రెండో స్థానంలో ఆస్ట్రేలియా పేరు వస్తుంది. కంగారూ జట్టు ఇప్పటి వరకు స్వదేశంలో వరుసగా 10 టెస్టు సిరీస్‌లను కైవసం చేసుకుంది. ఈ జట్టు రెండుసార్లు ఈ ఘనత సాధించింది. ఆస్ట్రేలియా నవంబర్ 1994 నుంచి నవంబర్ 2000 వరకు మొదటి సిరీస్‌ను గెలుచుకుంది. జులై 2004, నవంబర్ 2008 మధ్య రెండవసారి గెలిచింది.

5 సంవత్సరాలలో తొలిసారిగా..

శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో రెండో రోజు కోహ్లీ టెస్టు సగటు 50 కంటే తక్కువగా మారింది. విరాట్ రెండో ఇన్నింగ్స్‌లో పెద్దగా రాణించలేకపోయాడు. కేవలం 13 పరుగులు చేసి ఔటయ్యాడు. కోహ్లీని స్పిన్నర్ ప్రవీణ్ జయవిక్రమ ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలమవడంతో కోహ్లీ టెస్టు యావరేజ్ కూడా 50కి పడిపోయింది. కోహ్లి ఇప్పుడు 101 టెస్టు మ్యాచ్‌ల్లో 49.95 సగటుతో 8,043 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతని బ్యాట్ 27 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు చేసింది. 2017లో శ్రీలంకతో జరిగిన కోల్‌కతా టెస్టు రెండో ఇన్నింగ్స్ తర్వాత 40 టెస్టుల్లో కోహ్లి టెస్టు బ్యాటింగ్ యావరేజి తొలిసారి 50 కంటే తక్కువకు పడిపోయింది.

కపిల్ 40 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన రిషబ్ పంత్..

టీమిండియా తరపున టెస్టు ఫార్మాట్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రిషబ్ పంత్ నిలిచాడు. శ్రీలంకతో జరిగిన రెండో ఇన్నింగ్స్‌లో పంత్ కేవలం 28 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో పాటు కపిల్ దేవ్ 40 ఏళ్ల రికార్డును కూడా బద్దలు కొట్టాడు. 1982లో పాకిస్థాన్‌పై కపిల్ 30 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. అయితే రికార్డు ఇన్నింగ్స్ ఆడి 31 బంతుల్లో 50 పరుగులు చేసి పంత్ వికెట్ కోల్పోయాడు.

అశ్విన్ సరికొత్త రికార్డు..

డిసిల్వాను ఔట్ చేసిన తరువాత, ప్రపంచంలో టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన 8వ బౌలర్‌గా ఆర్‌ అశ్విన్‌ నిలిచాడు. అతను డేల్ స్టెయిన్ రికార్డును బద్దలు కొట్టాడు. దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ 439 వికెట్లు, అశ్విన్ 440 వికెట్లు పడగొట్టారు.

రెండు జట్లు-

భారత్: మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), హనుమ విహారి, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (కీపర్), శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా

శ్రీలంక: దిముత్ కరుణరత్నే (కెప్టెన్), లహిరు తిరిమన్నె, కుసల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, చరిత్ అస్లాంక, నిరోషన్ డిక్వెల్లా (కీపర్), సురంగ లక్మల్, లసిత్ ఎంబుల్దేనియా, విశ్వ ఫెర్నాండో, ప్రవీణ్ జయవిక్రమ.

Also Read: IND vs SL: శ్రీలంకను చిత్తు చేసిన రోహిత్ సేన.. వరుసగా 15వ సిరీస్‌ గెలిచిన టీమిండియా..

ICC Player of the Month: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా భారత యంగ్ ప్లేయర్.. ప్రకటించిన ఐసీసీ