AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs IRE : బీసీసీఐకి కొత్త టెన్షన్.. టీమిండియా ఐర్లాండ్ పర్యటన రద్దవుతుందా?

IND vs IRE : బెల్‌ ఫాస్ట్‌లో కొనసాగుతున్న హింసాత్మక అల్లర్ల కారణంగా భారత్ - ఐర్లాండ్ టీ20 సిరీస్‌పై అనిశ్చితి నెలకొంది. ఆటగాళ్ల భద్రతపై బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేస్తుండగా, వేదిక మార్పు లేదా సిరీస్ వాయిదా అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి.

IND vs IRE :  బీసీసీఐకి కొత్త టెన్షన్.. టీమిండియా ఐర్లాండ్ పర్యటన రద్దవుతుందా?
Ind Vs Ire
Rakesh
|

Updated on: Jun 12, 2026 | 10:50 AM

Share

IND vs IRE : భారత క్రికెట్ జట్టు రాబోయే రోజుల్లో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అక్కడ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. సాధారణంగా ఐర్లాండ్‌తో జరిగే సిరీస్‌లపై పెద్దగా అంచనాలు ఉండవు. కానీ, ఈసారి మాత్రం ఈ పర్యటనపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది. దీనికి ప్రధాన కారణం కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత సీనియర్ జట్టుకు ఎంపికైన సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ. ఈ సిరీస్ ద్వారా అతను అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. అయితే ఈ చారిత్రాత్మక అరంగేట్రానికి ముందే ఈ సిరీస్‌పై ఊహించని విధంగా రద్దు ముప్పు ముంచుకొచ్చింది. ఐర్లాండ్‌లో చెలరేగిన హింసాత్మక అల్లర్లు ఇప్పుడు బీసీసీఐని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

నార్తర్న్ ఐర్లాండ్ రాజధాని నగరమైన బెల్‌ఫాస్ట్‌లో గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నగరంలో జరిగిన ఒక ఘోర హత్యాయత్నం ఉదంతం ఈ అల్లర్లకు కారణమైంది. గత వారం బెల్‌ఫాస్ట్ నడిరోడ్డుపై సుడాన్ దేశానికి చెందిన ఒక వలసదారుడు.. స్థానిక ఐరిష్ వ్యక్తిపై నడిరోడ్డుపైనే ఘోరంగా కత్తితో దాడి చేశాడు. అంతటితో ఆగకుండా అతని తల నరికేందుకు కూడా ప్రయత్నించాడు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో స్థానికుల్లో ఒక్కసారిగా భయాందోళనలు, తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.

ఈ దారుణమైన ఘటన తర్వాత ఐర్లాండ్‌లోని స్థానిక ప్రజలు వలసదారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. ఈ ప్రదర్శనలు క్రమంగా హింసాత్మకంగా మారాయి. వందలాది మంది ఆగ్రహంతో ఊగిపోతూ స్థానికేతరుల ఇళ్లు, దుకాణాలు, వాహనాలపై దాడులు చేసి, వాటిని తగులబెట్టారు. ఈ హింసాకాండకు ప్రధాన కేంద్రంగా రాజధాని బెల్‌ఫాస్ట్ నగరం మారింది. ప్రస్తుతం అక్కడ శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. సరిగ్గా ఇదే నగరంలో టీమిండియా మ్యాచ్‌లు జరగాల్సి ఉండటంతో బీసీసీఐ పెద్దలు అలర్ట్ అయ్యారు.

ఈ ఆందోళనకర పరిస్థితులపై బీసీసీఐ ఇప్పటికే స్పందించింది. పరిస్థితులను చాలా నిశితంగా గమనిస్తున్నామని, తమ ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్, అధికారుల భద్రతే తమకు అన్నింటికంటే ముఖ్యమని స్పష్టం చేసింది. ఒకవేళ బెల్‌ఫాస్ట్‌లో మ్యాచ్‌లు నిర్వహించడం సాధ్యం కాకపోతే.. వేదికలను మార్చే అంశాన్ని పరిశీలించాలని ఐర్లాండ్ క్రికెట్ బోర్డుకు సూచించింది. వేదికల మార్పునకు సంబంధించి ఐర్లాండ్ బోర్డు నుంచి ఎలాంటి ప్రతిపాదన వచ్చినా తాము సానుకూలంగా స్పందిస్తామని, కానీ ప్లేయర్ల భద్రత విషయంలో మాత్రం ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని లీగల్స్ పరంగా క్లారిటీ ఇచ్చింది.

భారత్ మరియు ఐర్లాండ్ జట్ల మధ్య జూన్ 27, జూన్ 29 తేదీల్లో బెల్‌ఫాస్ట్ వేదికగానే ఈ రెండు టీ20 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. మరోవైపు ఐర్లాండ్ క్రికెట్ బోర్డు కూడా అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై స్థానిక ప్రభుత్వంతో కలిసి సమీక్షిస్తోంది. రాబోయే రెండు మూడు రోజుల్లో పరిస్థితులు అదుపులోకి రాకపోతే.. మ్యాచ్‌లను మరో నగరానికి మార్చడం లేదా సిరీస్‌ను తాత్కాలికంగా వాయిదా వేయడం మినహా మరో మార్గం కనిపించడం లేదు. దీంతో ఈ ప్రతిష్టాత్మక సిరీస్ జరుగుతుందా లేదా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

మరిన్ని క్రికెట్ మ్యాచ్‌ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us