AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hong Kong Sixes 2025 : టైం బాగోలేదు.. 24 గంటల్లో 4 మ్యాచ్‌లు ఓడిపోయిన భారత్.. చిన్న జట్ల చేతిలోనూ ఘోర పరాజయం

హాంకాంగ్ ఇంటర్నేషనల్ సిక్సెస్ 2025 టోర్నమెంట్‌లో భారత జట్టుకు తీవ్ర నిరాశ ఎదురైంది. టోర్నమెంట్ ప్రారంభంలో తమ తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించి శుభారంభం చేసినప్పటికీ, ఆ తర్వాత మాత్రం భారత జట్టు వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓటమి పాలై టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.

Hong Kong Sixes 2025 : టైం బాగోలేదు.. 24 గంటల్లో 4 మ్యాచ్‌లు ఓడిపోయిన భారత్.. చిన్న జట్ల చేతిలోనూ ఘోర పరాజయం
India Vs Sri Lanka Hk Sixes
Rakesh
|

Updated on: Nov 09, 2025 | 1:24 PM

Share

Hong Kong Sixes 2025 : హాంకాంగ్ ఇంటర్నేషనల్ సిక్సెస్ 2025 టోర్నమెంట్‌లో భారత జట్టుకు తీవ్ర నిరాశ ఎదురైంది. టోర్నమెంట్ ప్రారంభంలో తమ తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించి శుభారంభం చేసినప్పటికీ, ఆ తర్వాత మాత్రం భారత జట్టు వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓటమి పాలై టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. మరీ ముఖ్యంగా కేవలం 24 గంటల వ్యవధిలో శ్రీలంకతో సహా కువైట్, యూఏఈ, నేపాల్ వంటి చిన్న జట్ల చేతిలో కూడా ఓడిపోవడం భారత జట్టు పేలవ ప్రదర్శనకు అద్దం పట్టింది. ఈ సిక్సెస్ టోర్నమెంట్‌లో భారత జట్టు ప్రదర్శన ఎలా ఉంది, చివరి మ్యాచ్‌ ఓటమి వివరాలు చూద్దాం.

హాంకాంగ్ ఇంటర్నేషనల్ సిక్సెస్ టోర్నమెంట్ నవంబర్ 7న ప్రారంభమైంది. మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై విజయం సాధించిన భారత జట్టు, ఆ తర్వాత ఏ ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేకపోయింది. భారత జట్టు కేవలం 24 గంటల వ్యవధిలోనే వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. పూల్-సిలో కువైట్ చేతిలో ఓడిపోయిన భారత్, ఆ తర్వాత బాల్ రౌండ్‌లో యూఏఈ, నేపాల్ వంటి చిన్న జట్ల చేతిలో కూడా పరాజయాన్ని చవిచూసింది. బాల్ స్టేజ్‌లో భారత్ ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయింది. కువైట్ 27 పరుగుల తేడాతో ఓడించింది. యూఏఈ 4 వికెట్ల తేడాతో ఓడించింది. నేపాల్ ఏకంగా 92 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది.

భారత జట్టు తమ చివరి మ్యాచ్‌ను శ్రీలంకతో ఆడింది. ఈ మ్యాచ్‌లోనూ పరాజయం పాలై టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడంతో శ్రీలంక 138 పరుగుల భారీ స్కోరు సాధించింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లు లహిరు సమరకూన్ (14 బంతుల్లో 52 పరుగులు – 6 సిక్సర్లు), లహిరు మధుశంక (14 బంతుల్లో 52 పరుగులు) చెలరేగి ఆడారు. వీళ్లిద్దరూ రిటైర్డ్ హర్ట్ అయిన తర్వాత, సచిత జయతిలక, ధనంజయ లక్షణ్ కూడా వేగంగా పరుగులు సాధించారు.

139 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో భారత బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. రాబిన్ ఊతప్ప 13 పరుగులు మాత్రమే చేశాడు. భరత్ చిప్లీ (13 బంతుల్లో 41 పరుగులు) ధాటిగా ఆడినప్పటికీ, మిగిలిన ఆటగాళ్ల నుంచి సరైన మద్దతు లభించలేదు. ప్రియాంక్ పాంచాల్ 2 పరుగులకే అవుటయ్యాడు. నిర్ణీత ఓవర్లలో భారత జట్టు 3 వికెట్ల నష్టానికి కేవలం 90 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో శ్రీలంక 48 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..