
India Test Match History: భారత్ తన తొలి టెస్టు మ్యాచ్‌ను 1932లో లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో ఆడింది. స్వాతంత్ర్యానికి ముందే మొదలైన ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 158 పరుగుల తేడాతో విజయం సాధించింది. 100వ టెస్టు కూడా ఇంగ్లండ్‌తోనే జరిగింది. 1967లో బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 132 పరుగులతో భారత్‌ను ఓడించింది. దీంతో తొలి రెండు మైలురాళ్ల టెస్టుల్లోనూ టీమిండియాకు పరాజయాలే ఎదురయ్యాయి.
1982లో లాహోర్‌లో పాకిస్థాన్‌తో జరిగిన 200వ టెస్టు డ్రాగా ముగిసింది. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 485 పరుగులు చేయగా, భారత్ తరపున మొహిందర్ అమర్‌నాథ్ సెంచరీతో 389 పరుగులు చేసింది. చివరికి మ్యాచ్ ఫలితం తేలలేదు.
1996లో అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన 300వ టెస్టులో భారత్ సత్తా చాటింది. తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులు చేసిన టీమిండియా, రెండో ఇన్నింగ్స్‌లో 190 పరుగులకు ఆలౌటైంది. 170 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకున్న భారత్ 64 పరుగులతో గెలిచింది.
2006లో కింగ్‌స్టన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన 400వ టెస్టులో భారత్ 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 200 పరుగులు చేయగా, వెస్టిండీస్ 103కే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 171 పరుగులు చేసింది.
2016లో కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన 500వ టెస్టు మరింత ఘనంగా సాగింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 318 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 377/5 చేసింది. కివీస్ 262, 236 పరుగులకే పరిమితమై 197 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఇప్పుడు 2026లో గాలేలో శ్రీలంకతో జరిగిన 600వ టెస్టు కూడా భారత జ్ఞాపకాల్లో నిలిచిపోయింది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసింది. శ్రీలంక 284 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులు చేసింది.
372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 206 పరుగులకే కుప్పకూలింది. మానవ్ సుతార్ అద్భుత బౌలింగ్‌తో భారత్‌కు 165 పరుగుల విజయం అందింది. దీంతో 600వ టెస్టును గెలిచిన భారత్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి మైలురాయి టెస్టుల్లో పరాజయాలు ఎదురైనా భారత టెస్టు ప్రయాణం క్రమంగా విజయాల బాట పట్టింది. 600వ మ్యాచ్‌లో శ్రీలంకపై గెలుపు.. రెడ్ బాల్ క్రికెట్‌లో టీమిండియా ఎదుగుదలకు మరో గుర్తుగా నిలిచింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..