94 ఫోర్లు, 6 సిక్సర్లతో 1107 పరుగులు.. క్రికెట్ హిస్టరీలోనే ఎన్నటికీ బద్దలవ్వని క్రేజీ రికార్డ్..!
Victoria 1107 Runs Record: క్రికెట్ మైదానంలో నిత్యం ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. పాత రికార్డులు కనుమరుగై కొత్తవి పుట్టుకొస్తుంటాయి. దశాబ్దాలు గడిచినా దరిదాపుల్లోకి కూడా వెళ్లలేని ఓ మహా రికార్డు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో నమోదైంది. ఒకే ఇన్నింగ్స్‌లో ఏకంగా 1107 పరుగులు సాధించి ఒక జట్టు సృష్టించిన ఆ విధ్వంసానికి 99 ఏళ్లు. ఆ సంచలన మ్యాచ్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Victoria 1107 Runs Record: ఆధునిక క్రికెట్‌లో టీ20ల రాకతో బ్యాటర్లు విరుచుకుపడుతున్నారు. పదుల సంఖ్యలో ఫోర్లు, సిక్సర్లు బాదుతూ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. వన్డేల్లో 400 పరుగులు, టెస్టుల్లో 700 పరుగులు చేయడం ఇప్పుడు సాధారణ విషయంగా మారిపోయింది. సరిగ్గా 99 ఏళ్ల క్రితం ఎలాంటి ఆధునిక బ్యాట్లు, రక్షణ పరికరాలు లేని కాలంలోనే ఓ జట్టు బౌలర్లపై అత్యంత దారుణంగా దాడికి దిగింది. 1926 డిసెంబర్ 24న ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో విక్టోరియా, న్యూ సౌత్ వేల్స్ జట్ల మధ్య జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్ దీనికి వేదికైంది. ఆ రోజు విక్టోరియా బ్యాటర్లు ఆడిన ఇన్నింగ్స్ చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని ఒక మహా రికార్డుగా మిగిలిపోయింది. విల్ వుడ్‌ఫుల్ సారథ్యంలోని ఆ జట్టు ఏకంగా 1107 పరుగులు బోర్డుపై ఉంచి కనీవినీ ఎరుగని చరిత్ర సృష్టించింది. ఒకే ఇన్నింగ్స్‌లో వెయ్యికి పైగా పరుగులు చేయడం భవిష్యత్తులోనూ ఏ జట్టుకు సాధ్యపడకపోవచ్చు.
ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన పోన్స్‌ఫోర్డ్..
న్యూ సౌత్ వేల్స్ బౌలర్లకు ఆ మ్యాచ్ ఒక పీడకల లాంటిది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన విక్టోరియా కెప్టెన్ బిల్ వుడ్‌ఫుల్ (133) పరుగుల వరదకు పునాది వేశాడు. అతనికి తోడుగా వచ్చిన మరో ఓపెనర్ బిల్ పోన్స్‌ఫోర్డ్ మైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఏకంగా 36 ఫోర్లు బాది 352 పరుగులతో ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్రీజులో పాతుకుపోయి వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. తర్వాతి స్థానాల్లో వచ్చిన బ్యాటర్లు కూడా ఏమాత్రం తగ్గలేదు.
సిక్సర్ల వర్షం కురిపించిన జాక్ రైడర్..
మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన స్టార్క్ హెండ్రీ 100 పరుగులు సాధించగా, నాలుగో నంబర్ బ్యాటర్ జాక్ రైడర్ అద్భుతమైన డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. 6 భారీ సిక్సర్లు బాదిన రైడర్ 295 పరుగుల వద్ద అవుటై తృటిలో ట్రిపుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఇన్నింగ్స్‌లో నమోదైన మొత్తం 6 సిక్సర్లు ఇతని బ్యాట్ నుంచి వచ్చినవే కావడం విశేషం. చివర్లో ఆల్బర్ట్ హార్ట్‌కోఫ్ (61), జాన్ ఎల్లిస్ (63) లాంటి ఆటగాళ్లు కూడా హాఫ్ సెంచరీలతో రాణించడంతో స్కోరు బోర్డు 1107 పరుగుల అఖండమైన మైలురాయిని తాకింది. ఈ సుదీర్ఘ ఇన్నింగ్స్‌లో విక్టోరియా బ్యాటర్లు మొత్తంగా 94 ఫోర్లు, 6 సిక్సర్లు బాదారు.
తమ రికార్డును తామే బ్రేక్ చేసుకుని..
ఫస్ట్ క్లాస్ క్రికెట్ సుదీర్ఘ చరిత్రలో ఒక జట్టు వెయ్యి పరుగులు దాటడం కేవలం రెండుసార్లు మాత్రమే జరిగింది. ఆసక్తికరంగా ఆ రెండు ఘనతలు విక్టోరియా జట్టు పేరిటే ఉండటం మరో అద్భుతం. 1923లో టాస్మానియాతో జరిగిన మ్యాచ్‌లో విక్టోరియా తొలిసారి 1059 పరుగులు చేసింది. మూడేళ్ల వ్యవధిలో న్యూ సౌత్ వేల్స్‌పై 1107 పరుగులు సాధించడం ద్వారా తమ పేరిట ఉన్న పాత రికార్డును ఆ జట్టే తిరగరాసింది. ప్రపంచంలో మరే ఇతర దేశవాళీ లేదా అంతర్జాతీయ జట్టు ఈ మ్యాజిక్ ఫిగర్‌ను ఇప్పటివరకు అందుకోలేకపోయింది.
శ్రీలంక, హైదరాబాద్ జట్ల పోరాటం..
విక్టోరియా రికార్డును ఛేదించేందుకు మిగతా జట్లు దరిదాపుల్లోకి వచ్చినా అంతిమంగా విఫలమయ్యాయి. 1997లో కొలంబో వేదికగా భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సనత్ జయసూర్య ట్రిపుల్ సెంచరీతో చెలరేగడంతో శ్రీలంక జట్టు 952/6 స్కోరు సాధించి డిక్లేర్ చేసింది. దేశవాళీ క్రికెట్‌లో చూసుకుంటే పాకిస్థాన్‌కు చెందిన సింధ్ జట్టు 1974లో బలూచిస్తాన్‌పై 951/7 స్కోరు నమోదు చేసింది. మన రంజీ ట్రోఫీలో 1994లో ఆంధ్ర జట్టుపై హైదరాబాద్ 944/6 పరుగులు సాధించి చరిత్ర పుటల్లోకెక్కింది. అయినప్పటికీ విక్టోరియా 1107 పరుగుల మహోన్నత శిఖరాన్ని ఏ జట్టూ తాకలేకపోయింది. ఈ భారీ లక్ష్య ఛేదనలో న్యూ సౌత్ వేల్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు. వారి రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా 221, 230 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. మొత్తంగా 451 పరుగులకే కుప్పకూలడంతో, విక్టోరియా ఏకంగా 656 పరుగుల చారిత్రక తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.
వంద సంవత్సరాల క్రితం ఎలాంటి అత్యుత్తమ సాంకేతికత లేని రోజుల్లోనే విక్టోరియా బ్యాటర్లు సాధించిన ఈ 1107 పరుగుల రికార్డు క్రికెట్ క్రీడకే ఒక మణిమకుటం. పరిమిత ఓవర్ల ఫార్మాట్లు పెరిగిపోయిన ప్రస్తుత తరం క్రికెట్‌లో, రోజుల తరబడి క్రీజులో నిలబడి ఇలాంటి మరొక సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడటం ఏ జట్టుకైనా దాదాపు అసాధ్యమే.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




