Ind Vs Sl: మరో సిరీస్‌పై టీమిండియా గురి.. లంకేయులతో నేడు రెండో టీ 20 మ్యాచ్..
Ind Vs Sl: గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ చేదు అనుభవాలను మరిపిస్తూ పొట్టి ఫార్మాట్లో వరుస విజయాలు సాధిస్తోంది టీమిండియా.
Ind Vs Sl: గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ చేదు అనుభవాలను మరిపిస్తూ పొట్టి ఫార్మాట్లో వరుస విజయాలు సాధిస్తోంది టీమిండియా. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ అదరగొడుతున్న ఆటగాళ్లకు తోడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అద్భుత కెప్టెన్సీ తో వరుస సిరీస్‌లను చేజిక్కించుకుంటోంది. ఇటీవల వన్డేలు, టీ20ల్లో వెస్టిండీస్‌ను వైట్ వాష్ చేసిన భారత జట్టు లక్నో వేదికగా లంకేయులతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లోనూ ఘన విజయం సాధించింది. ఏకంగా 62 పరుగులతో శ్రీలంక (Srilanka) ను చిత్తు చేసింది. ఇప్పుడు ఇదే జోరులో మరో సిరీస్‌ను కైవసం చేసుకోవాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతోంది. శనివారం శ్రీలంకతో రెండో టీ20లోనూ విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ప్రయోగాలు సానుకూల ఫలితాలు ఇస్తుండడం, అదేవిధంగా ఈ ఏడాది ఆఖర్లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ 20 ప్రపంచకప్ ఉండడంతో మరోసారి యువ ఆటగాళ్లకే ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని టీమిండియా భావిస్తోంది.
మరోసారి యువ ఆటగాళ్లకే..
గాయం కారణంగా రుతురాజ్ మొత్తం సిరీస్‌కు దూరమవ్వడంతో మరోసారి ఇషాన్ కిషాన్- రోహిత్ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక రుతురాజ్ స్థానంలో జట్టులోకి మయాంక్‌కు ఛాన్స్ ఇవ్వాలనుకుంటే మాత్రం రోహిత్ మిడిల్ ఆర్డర్‌లో వచ్చే అవకాశం ఉంది.. వెస్టిండీస్‌తో మూడో టీ20లోనూ అతడు బ్యాటింగ్ ఆర్డర్‌లో దిగువున వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి మ్యాచ్‌లో తుది జట్టులో స్థానం దక్కించుకున్నా బ్యాటింగ్ చేసే అవకాశం రాని సంజు శాంసన్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో మరింత ముందు పంపే అవకాశముంది. ఇవి తప్ప జట్టులో మరేమీ మార్పులుండకపోవచ్చని తెలుస్తోంది. బౌలింగ్‌లో సీనియర్ పేసర్ భువీ మళ్లీ ఫాంలోకి రావడం టీమిండియాకు సానుకూలాంశం. ఇక శ్రీలంక జట్టు విషయానికొస్తే.. మొదటి మ్యాచ్‌కు ముందే మహేశ్ తీక్షణ, వనిందు హసరంగ కీలక ఆటగాళ్లు దూరం కావడంతో లంకేయులు ఒత్తిడికి గురయ్యారు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి కనీసం ప్రతిఘటన లేకుండా మ్యాచ్‌ను అప్పగించేసింది. మరి టాప్ ఫాంలో ఉన్న టీమిండియాను అడ్డుకోవాలంటే శ్రీలంక జట్టు అద్భుతంగా పుంజుకోవాల్సి ఉంటుంది.
పిచ్, వాతావరణం ఎలా ఉందంటే..
లక్నోతో పోలిస్తే ధర్మశాలలో రాత్రి పూట వాతావరణం చల్లగా ఉంటుంది. ఇక చివరిగా ఇక్కడ మ్యాచ్ జరిగినప్పుడు టాస్ వేయడానికి ముందే భారీ వర్షం మైదానాన్ని ముంచెత్తింది. శనివారం కూడా వర్షం పడే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
జట్ల వివరాలు (అంచనా)
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, రవీంద్ర జడేజా, దీపక్ హుడా, వెంకటేశ్ అయ్యర్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మయాంక్ అగర్వాల్
శ్రీలంక : పథుమ్ నిశాంక, కమిల్ మిశారా, చరిత్ అసలంక, దినేశ్ చండిమాల్ (వికెట్ కీపర్), జనిత్ లియనాగె, దసున్ శనక (కెప్టెన్), చమిక కరుణరత్నె, దుష్మంత చమీర, ప్రవీణ్ జయవిక్రమ, జెఫ్రీ వాండర్సే, లాహిరు కుమార, దనుష్క గుణతిలక, ఆషియాన్ డేనియల్, శిరన్ ఫెర్నాండో, బినుర ఫెర్నాండో.
రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
Russia Ukraine War: అధికారం చేతుల్లోకి తీసుకోండి.. రష్యా ఆర్మీకి పుతిన్ కీలక సూచనలు..
Big News Big Debate: రష్యాపై ఫైనాన్సియల్ వార్ మొదలైందా? అగ్రదేశాల ఆంక్షలతో ఎవరికి ఎంత నష్టం?