IND vs SA: 57 ఫోర్లు, 18 సిక్సర్లతో 720 పరుగులు.. 4 రోజుల్లోనే బద్దలైన ప్రపంచ రికార్డ్..
Team India: భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి 362 పరుగులు చేసి విజయం సాధించింది. సఫారీ బ్యాటర్ మార్క్రమ్ (110) అద్భుత శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాథ్యూ బ్రీట్జ్‌కే (68), డెవాల్డ్ బ్రెవిస్ (54) కూడా అర్ధశతకాలతో మెరిశారు.

భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ పరుగుల వరదతో రికార్డుల మోత మోగించింది. రాయ్‌పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో బౌలర్లను ఊచకోత కోస్తూ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. కేవలం నాలుగు రోజుల క్రితం నెలకొల్పిన రికార్డును ఈ మ్యాచ్‌లో బద్దలు కొట్టడం విశేషం.
ఈ మ్యాచ్‌లో మొత్తం 720 పరుగులు నమోదయ్యాయి. భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన వన్డే చరిత్రలో ఒకే మ్యాచ్‌లో నమోదైన అత్యధిక పరుగులు ఇవే కావడం గమనార్హం.
గత రికార్డు..
కేవలం 4 రోజుల క్రితం (నవంబర్ 30న) రాంచీలో జరిగిన తొలి వన్డేలో ఇరు జట్లు కలిసి 681 పరుగులు చేశాయి. ఆ రికార్డు ఇప్పుడు రాయ్‌పూర్‌లో బద్దలైంది.
బౌండరీల వర్షం..
ఈ మ్యాచ్‌లో ఏకంగా 57 ఫోర్లు, 18 సిక్సర్లు నమోదయ్యాయి.
భారత్: 32 ఫోర్లు, 7 సిక్సర్లు.
దక్షిణాఫ్రికా: 25 ఫోర్లు, 11 సిక్సర్లు.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (102), రుతురాజ్ గైక్వాడ్ (105) సెంచరీలతో కదం తొక్కగా, కెప్టెన్ కేఎల్ రాహుల్ (66) రాణించారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి 362 పరుగులు చేసి విజయం సాధించింది. సఫారీ బ్యాటర్ మార్క్రమ్ (110) అద్భుత శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాథ్యూ బ్రీట్జ్‌కే (68), డెవాల్డ్ బ్రెవిస్ (54) కూడా అర్ధశతకాలతో మెరిశారు.
మొత్తానికి బౌలర్లకు పీడకలగా మిగిలిన ఈ మ్యాచ్, బ్యాటింగ్ ప్రియులకు మాత్రం కావాల్సినంత వినోదాన్ని పంచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








