IND vs SA 1st Test : భారత్-సౌతాఫ్రికా టెస్ట్ కోసం స్పెషల్ కాయిన్.. దాని ప్రత్యేకత ఏంటంటే?
భారత్, సౌతాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా మొదటి టెస్ట్ శుక్రవారం నుంచి కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం పిచ్ ఎలా ఉండబోతుంది అనే ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన చేశారు.

IND vs SA 1st Test : భారత్, సౌతాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా మొదటి టెస్ట్ శుక్రవారం నుంచి కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం పిచ్ ఎలా ఉండబోతుంది అనే ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన చేశారు. భారత జట్టు మేనేజ్‌మెంట్ స్పిన్నర్లకు అనుకూలమైన పిచ్‌ను డిమాండ్ చేయలేదని గంగూలీ తెలిపారు. అయితే, క్యూరేటర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు మాత్రం ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌ల టెన్షన్‌ను పెంచేలా ఉన్నాయి.
ఆస్ట్రేలియాలో లిమిటెడ్ ఓవర్ల సిరీస్ ఆడిన తర్వాత భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, బ్యాటింగ్ కోచ్ సీతాంశు కోటక్ ఆదివారం రాత్రి కోల్‌కతా చేరుకున్నారు. సోమవారం ఉదయం వారు పిచ్‌ను పరిశీలించారు. భారత జట్టు మేనేజ్‌మెంట్ స్పిన్నర్లకు అనుకూలమైన పిచ్‌ను కోరిందా అని మీడియా గంగూలీని ప్రశ్నించగా.. “వారు ఇప్పటివరకు దాని గురించి అడగలేదు. అందుకే నేను ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేను. పిచ్ చాలా బాగుంది” అని గంగూలీ బదులిచ్చారు.
గంగూలీ కూడా సాయంత్రం పిచ్‌ను పరిశీలించారు. తర్వాత మంచు లేదా ఊహించని వర్షం నుంచి పిచ్‌ను రక్షించడానికి మొత్తం మైదానాన్ని కవర్లతో కప్పివేశారు. ఈ సీజన్‌లో ఈడెన్ గార్డెన్స్ రెండు రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. ఆ మ్యాచ్‌లలో పిచ్‌లు నెమ్మదిగా ఉండి, ఫాస్ట్ బౌలర్లకు పెద్దగా సహకరించలేదు. ఈ టెస్టు పిచ్ గురించి క్యూరేటర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ పిచ్‌పై సంతృప్తి వ్యక్తం చేశారు. గౌతమ్ గంభీర్ కూడా పిచ్‌ను చూసి సంతృప్తి చెందారని ఆయన తెలిపారు. గౌతమ్ గంభీర్ పిచ్ నుంచి స్పిన్నర్లకు ఎప్పుడు సహాయం లభిస్తుందని అడగగా, ముఖర్జీ మూడవ రోజు నుంచి టర్నింగ్ ఆశించవచ్చని సమాధానం ఇచ్చారు.
ముఖర్జీ ప్రకారం.. “ఈ పిచ్ బ్యాట్స్‌మెన్‌లకు, బౌలర్లకు ఇద్దరికీ సహాయపడుతుంది. స్పిన్నర్లకు కూడా సహాయం లభిస్తుంది” అని తెలిపారు. అంటే తొలి రెండు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నా, ఆ తర్వాత బంతి స్పిన్ అయ్యే అవకాశం ఉంది. స్పిన్ ట్రాక్ అంటేనే భయపడే టీమిండియా ఇప్పుడు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన హోమ్ సిరీస్‌లో పూర్తిగా స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌లపై భారత్ ఓటమి పాలైంది. ఈ అనుభవం దృష్ట్యా, పూర్తిగా స్పిన్ ట్రాక్‌పై ఆడకుండా భారత్ జాగ్రత్త పడవచ్చు.
ప్రస్తుత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ సౌతాఫ్రికా జట్టులో ఎడమచేతి స్పిన్నర్ కేశవ్ మహారాజ్, ఆఫ్ స్పిన్నర్ సిమోన్ హార్మర్, మరో లెఫ్ట్ హ్యండ్ స్పిన్నర్ సెనూర్ ముత్తుస్వామి ఉన్నారు. వీరు ఇటీవల పాకిస్తాన్ పర్యటనలో మంచి ప్రదర్శన చేశారు. ఈ చారిత్రక సిరీస్‌ను పురస్కరించుకుని, టాస్ వేయడానికి మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా చిత్రాలు ఉన్న ప్రత్యేక కాయిన్‌ను విడుదల చేసినట్లు గంగూలీ తెలిపారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




