IND vs ENG Head to Head Records: టీ20 ప్రతీకారానికి రివేంజ్ రెడీ.. హెడ్-టు-హెడ్ రికార్డులు చూస్తే..!
India vs England Head to Head Records: రాబోయే 2027 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు ఈ సిరీస్‌లో తమ ఫామ్‌ను నిరూపించుకోవాలని పట్టుదలగా ఉన్నారు. టీ20ల్లో దెబ్బతిన్న సింహంలా ఉన్న భారత్, వన్డేల్లో ఖచ్చితంగా పుంజుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరగబోయే ఈ తొలి వన్డే క్రికెట్ అభిమానులకు అసలైన వినోదాన్ని పంచడం ఖాయం.

India vs England Head to Head Records: ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఎదురైన ఘోర పరాభవం తర్వాత, టీమిండియా ఇప్పుడు వన్డే సిరీస్‌లో ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైంది. జూలై 14న బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుబ్‌మన్ గిల్ వంటి దిగ్గజాలు జట్టులోకి తిరిగి రావడంతో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
టీ20 చేదు జ్ఞాపకాలను తుడిచేసేందుకు భారత్ సిద్ధం..
శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఆడిన టీ20 సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయిన భారత జట్టు తీవ్ర నిరాశకు గురైంది. అయితే, వన్డే ఫార్మాట్‌లో సరికొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతోంది. ఇప్పుడు జట్టు బాధ్యతలు శుబ్‌మన్ గిల్ భుజాలపై ఉన్నాయి. అతనికి తోడుగా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ, అనుభవజ్ఞుడైన కేఎల్ రాహుల్ అండగా నిలవనున్నారు. టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అదే జోరును కొనసాగించాలని చూస్తున్నాడు. దానికి తోడు సీనియర్ బ్యాటర్ జో రూట్ పునరాగమనం ఇంగ్లాండ్ జట్టు బలాన్ని రెట్టింపు చేసింది. జోఫ్రా ఆర్చర్ రూపంలో వారి బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది.
వన్డేల్లో ఇరు జట్ల రికార్డులు (హెడ్-టు-హెడ్)..
సుదీర్ఘ క్రికెట్ చరిత్ర కలిగిన ఈ రెండు జట్ల మధ్య వన్డేల్లో భారత్‌దే పైచేయిగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఇరు జట్లు 110 వన్డేల్లో తలపడగా, భారత్ 61 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇంగ్లాండ్ 44 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. రెండు మ్యాచ్‌లు టై కాగా, మూడు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.
టెస్టులు, టీ20ల విషయానికి వస్తే, 141 టెస్టుల్లో ఇంగ్లాండ్ 53 గెలిచి ఆధిక్యంలో ఉండగా, భారత్ 37 మ్యాచ్‌లు గెలిచింది. 51 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఇక 35 టీ20 మ్యాచ్‌ల్లో భారత్ 18, ఇంగ్లాండ్ 16 విజయాలతో హోరాహోరీగా తలపడ్డాయి.
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్: వన్డే చరిత్రలో టాప్ రికార్డులు..
అత్యధిక స్కోరు: వన్డేల్లో ఇరు జట్ల మధ్య నమోదైన అత్యధిక స్కోరు 387/5. భారత్ 2008లో రాజ్‌కోట్ వేదికగా ఈ భారీ స్కోరును సాధించింది.
అత్యల్ప స్కోరు: 2022లో ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు భారత్ చేతిలో కేవలం 110 పరుగులకే కుప్పకూలింది. ఇది ఇరు జట్ల మధ్య అత్యల్ప స్కోరు.
అత్యధిక వ్యక్తిగత స్కోరు: 2011లో బెంగళూరులో జరిగిన వన్డేలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ 158 పరుగులు చేశాడు. భారత్ తరఫున యువరాజ్ సింగ్ 2017లో కటక్‌లో 150 పరుగులు సాధించి టాప్‌లో ఉన్నాడు.
అత్యుత్తమ బౌలింగ్: జస్ప్రీత్ బుమ్రా సృష్టించిన 6/19 (7.2 ఓవర్లలో) రికార్డే ఇప్పటికీ అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనగా ఉంది. అయితే, గాయం లేదా విశ్రాంతి కారణంగా ఈ సిరీస్‌లో బుమ్రా అందుబాటులో లేకపోవడం భారత్‌కు పెద్ద లోటు.
అత్యధిక పరుగులు, వికెట్లు: ఈ రెండు జట్ల పోరులో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 44 ఇన్నింగ్స్‌ల్లో 1546 పరుగులతో టాప్ రన్ గెట్టర్‌గా ఉన్నాడు. బౌలింగ్‌లో రవీంద్ర జడేజా 28 వన్డేల్లో 45 వికెట్లు తీసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
గత మ్యాచ్ హీరోలు ఎవరు?
భారత్, ఇంగ్లాండ్ మధ్య అహ్మదాబాద్‌లో జరిగిన చివరి వన్డేలో శుబ్‌మన్ గిల్ 102 బంతుల్లో 112 పరుగులతో అద్భుత శతకం బాదాడు. అయితే, ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ 64 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి భారత టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, శుబ్‌మన్ గిల్‌లను అతడే అవుట్ చేయడం గమనార్హం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



