AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్ ఇదెక్కడి వ్యాపారం.. ఫైనల్ జరిగే మైదానం గడ్డిని కూడా వదలడం లేదుగా.. ధర ఎంతో తెలిస్తే అవాక్కే..?

FIFA World Cup 2026 Final Grass Sale: ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జ్ఞాపకాలను తమతో ఉంచుకోవాలని తపించే సంపన్న అభిమానులను టార్గెట్ చేస్తూ ఫిఫా వేసిన ఈ వ్యాపార వ్యూహం నిజంగా ఆశ్చర్యకరమైనదే. టికెట్ల ధరల బాదుడుతో ఇప్పటికే బెంబేలెత్తిపోతున్న అభిమానులకు, ఈ గడ్డి ముక్కల అమ్మకం ఒక వింత అనుభూతిని ఇస్తోంది. వ్యాపారమే పరమావధిగా సాగుతున్న ఆధునిక క్రీడారంగంలో, రాబోయే రోజుల్లో ఇంకేం అమ్ముతారోనని క్రీడా ప్రేమికులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు!

బాబోయ్ ఇదెక్కడి వ్యాపారం.. ఫైనల్ జరిగే మైదానం గడ్డిని కూడా వదలడం లేదుగా.. ధర ఎంతో తెలిస్తే అవాక్కే..?
Fifa World Cup 2026 Final Grass Sale
Venkata Chari
|

Updated on: Jul 14, 2026 | 8:11 AM

Share

FIFA World Cup 2026 Final Grass Sale: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఫుట్‌బాల్ ప్రపంచకప్ సంబరం చివరి అంకానికి చేరుకుంది. ఈ మెగా టోర్నీ ద్వారా ఎలాగైనా భారీగా లాభాలు గడించాలని చూస్తున్న ఫుట్‌బాల్ అత్యున్నత సమాఖ్య (ఫిఫా), తాజాగా ఒక విస్తుపోయే నిర్ణయం తీసుకుంది. జూలై 19న న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరగబోయే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ పిచ్‌పై ఉన్న గడ్డిని ముక్కలు ముక్కలుగా చేసి అభిమానులకు విక్రయించబోతున్నట్లు ప్రకటించింది. క్రీడా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సాగుతున్న ఈ వింత వ్యాపారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

ఆకుపచ్చని గడ్డికి బంగారు ధర.. కోట్ల రూపాయల సంపాదన వైపు అడుగులు..!

ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వీక్షించే ఈ చారిత్రాత్మక మ్యాచ్‌కు వేదిక కానున్న మైదానంలోని గడ్డిని ఒక అపురూప జ్ఞాపకంగా మార్చి క్యాష్ చేసుకోవాలని ఫిఫా ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆ పిచ్‌పై ఉన్న పచ్చటి గడ్డిని ప్రత్యేకంగా సేకరించి, వాటిని పాడుకాకుండా యాక్రిలిక్ పెట్టెల్లో భద్రపరిచి విక్రయించనున్నారు.

ఇదికూడా చదవండి: కొంపముంచిన 7 మ్యాచ్‌లు.. 2028 టీ20 ప్రపంచకప్‌ రేసు నుంచి ముగ్గురు భారత ఆటగాళ్లు ఔట్..?

ఈ గడ్డి ముక్కల ధరలు వింటే సామాన్యుల మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అత్యంత కనీస స్థాయి గడ్డి ముక్క ధరను 450 అమెరికన్ డాలర్లుగా నిర్ణయించారు. అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు 37 వేల రూపాయలకు పైమాటే! కేవలం ఒక చిన్న గడ్డి ముక్కకు ఇంత ధర పెట్టాలా అని అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక్కడితో ఆగకుండా వివిధ రకాల ప్యాకేజీల కింద ఈ ధరలను 900 డాలర్లు, 1,200 డాలర్లు, అత్యంత ప్రీమియం కేటగిరీలో ఏకంగా 3,000 డాలర్ల (సుమారు 2.5 లక్షల రూపాయలు) వరకు నిర్ణయించారు. అత్యధిక ధర కలిగిన ప్యాకేజీలో గడ్డి ముక్కతో పాటు బంగారు ముద్ర కలిగిన ఫైనల్ మ్యాచ్ ప్రతిరూప టికెట్, ఒక చిన్న ప్రపంచకప్ బాల్, క్రిస్టల్ ప్రపంచకప్ ట్రోఫీని బహుమతిగా అందించనున్నారు.

పరిమిత సంఖ్యలోనే విక్రయాలు.. వివాదంలో ఫిఫా తీరు!

ఇదికూడా చదవండి: టీమిండియాలో ఆ ముగ్గురి చాప్టర్ క్లోజ్.. ఇంగ్లాండ్ సిరీస్ ఓటమితో ఇక జట్టులో నో ప్లేస్..?

ఈ వింత జ్ఞాపకాలను కొనుగోలు చేయాలనుకునే వారి కోసం ఫిఫా ఒక నిబంధన పెట్టింది. ఈ ఏడాది 2026 కావడంతో, ప్రతి కేటగిరీలోనూ కేవలం 2,026 ముక్కలను మాత్రమే విక్రయించనున్నారు. ఒకవేళ ఈ గడ్డి ముక్కలన్నీ అమ్ముడుపోతే, కేవలం ఈ వ్యాపారం ద్వారానే ఫిఫాకు దాదాపు 11 మిలియన్ డాలర్ల (సుమారు 90 కోట్ల రూపాయల) అదనపు ఆదాయం సమకూరనుంది.

అయితే ఈ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా క్రీడా విశ్లేషకులు, అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే అమెరికాలో జరుగుతున్న ఈ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ సాధారణ టికెట్ల ధరలను గరిష్టంగా 32,970 డాలర్ల వరకు, అలాగే ఆహార వసతులతో కూడిన విఐపి టికెట్ల ధరలను 34,500 డాలర్ల వరకు విక్రయిస్తూ ఫిఫా దోపిడీ చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు ఇప్పుడు మైదానం గడ్డిని కూడా అమ్ముకోవడమేంటని విమర్శిస్తున్నారు. అంతేకాకుండా, మెట్‌లైఫ్ స్టేడియంలో సాధారణంగా కృత్రిమ గడ్డిని వాడుతుండగా, ఈ టోర్నీ కోసం తాత్కాలికంగా సహజ సిద్ధమైన గడ్డిని ఏర్పాటు చేశారు. ఈ పిచ్ నాణ్యత సరిగా లేదని ఇప్పటికే పలువురు ఆటగాళ్లు, కోచ్‌లు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో, ఆ గడ్డిని ఇంత భారీ ధరకు అమ్మడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదికూడా చదవండి: Team India: రోహిత్ ఒక్కడే కాదు భయ్యో.. ఆ ముగ్గురికి చావో రేవో సిరీస్.. టార్గెట్ మాత్రం అదే..?

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us